అన్నింటికంటే ఇష్టమైనది
అక్బర్ చక్రవర్తి చాలా మంది భార్యలు ఉండేవారు, వారిలో ఒక రాణి పరమ గయ్యాళి. ఆమె మీద చాలామంది అక్బర్ ఫిర్యాదులు కూడా చేశారు. ఒక నాడు అయితే ఆమె అక్బర్ తో చాలా మొరటుగా మాట్లాడింది. దానితో ఆయనకు విపరీతంగా కోపం వచ్చి “నువ్వు వెంటనే మీ పుట్టింటికి వెళ్ళిపో” అని ఆజ్ఞాపించాడు.
ఆయన వెళ్లిపొమ్మంటే సరికి ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికి వచ్చింది, “నా మాటలకు, చేతలకు సిగ్గు పడుతున్నా దయచేసి క్షమించండి. నన్ను మా పుట్టింటికి పంపొద్దు” అని వేడుకుందామె. అక్బర్ కి కూడా జాలి కలిగింది, కానీ ఇచ్చిన ఆజ్ఞను ఉపసంహరించడం ఎట్లా? అందుకే, నువ్వు వెళ్లేటప్పుడు నీకు అన్నింటికంటే ఇష్టమైన దాన్ని తీసుకెళ్లొచ్చు అని కొంచెం సడలించాడు. చక్రవర్తి తనను క్షమించాడని ఆమెకు అర్థమైంది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆఖరికి ఆమెకు బీర్బల్ గుర్తుకొచ్చాడు. అతని సహాయం కోరాలి అనుకుంది. కానీ ఆమె అతన్ని కూడా గతంలో ఎన్నోసార్లు దూషించింది. ఏ మొహం పెట్టుకొని అడగగలదు?.
ఏది ఏమైనప్పటికీ ఆమె అతని కోసం కబురు పంపగానే వచ్చాడు బీర్బల్.
“బీర్బల్, నాకు నీ సహాయం అత్యవసరంగా కావాలి. కానీ నిన్ను సహాయం అర్థించడానికి సిగ్గుపడుతున్నా” అని పశ్చాత్తాపం నిండిన స్వరంతో.
“బేగం సాహెబ్, గతం మర్చిపోండి. దయచేసి నేను మీకు చేయగల సహాయం ఏంటో చెప్పండి” అన్నాడు బీర్బల్ సహృదయంతో.
ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించింది. అంతావిని, కొంచెం సేపు ఆలోచించి, “… ఇలా చేయండి” అని ఆమెకు గుసగుసగా చెప్పాడు.
ఆ బేగం ఆ సలహాకు ఎంతో సంతోషించింది. ఆ తర్వాత ఆమె ఆ సాయంకాలం, తాను మర్నాడే వెళ్లిపోతున్నానని, ఈ సాయంత్రం చివరిసారిగా తన స్వీకరించమని అక్బర్ కి కబురు పంపింది ఆ ప్రకారమే ఆమె మందిరానికి వచ్చాడు అక్బర్.
“నా సామాన్లన్నీ సర్దుకున్నాను. ఈ షర్బత్ మీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను. దయచేసి తాగండి” అని అడిగింది బేగం. బేగం తన ఆజ్ఞ ప్రకారం వెళ్లి పోతున్నందుకు సంతోషించిన అక్బర్, ఆమె ఇచ్చిన షర్బత్ తాగాడు. కొద్దిసేపట్లోనే మైకం కమ్మినట్లు మత్తుగా నిద్రపోయాడు. అప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న బేగం, నిద్రపోతున్న అక్బర్ ను పల్లకిలో కి చేర్పించింది నౌకర్లతో. తాను కూడా ఎక్కి కూర్చుని పుట్టింటికి ప్రయాణం అయింది.
మర్నాడు పొద్దున మెలకువ వచ్చిన అక్బర్ కు పరిసరాలన్నీ కొత్తగా తోచడంతో, “ఏంటిది! నేను ఎక్కడున్నాను” అని అన్నాడు ఆశ్చర్యంగా. అతన్ని కనిపెట్టుకొని ఉన్న బేగం “మందిరంలోనే ఉన్నారు ప్రభూ!” అంది.
“కానీ ఇది మా మందిరం కాదే?” అన్నాడు అక్బర్ సందేహంగా, కిటికీలోంచి బయటికి చూస్తూ.
“ప్రభూ! మీరు నన్ను మా పుట్టింటికి నాకు అత్యంత ప్రీతి పాత్రమైన దాన్ని తీసుకొని పొమ్మన్నారు కదా. నాకు అత్యంత ఇష్టమైంది మీరే కాబట్టి మిమ్మల్ని తీసుకుని మా పుట్టింటికి వచ్చాను” అంది
ఆ మాటలకు ఆయన కోపం పోయింది. బీర్బల్ తప్ప ఆమెకు ఇలాంటి సలహా మరెవ్వరు ఇచ్చి ఉండరని ఆయనకు తెలిసి నవ్వుకున్నాడు.
కథ యొక్క నీతి: మన ప్రేమ మరియు కృషి ద్వారా మనం ప్రత్యర్థులను కూడా సమాధానపరిచే సాధనాలు కనుగొంటాం. సమయానికి సరైన మార్గదర్శనం కీలకం.