అతితెలివి
ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు. అందులో వెన్న కాచుదామని అతను నిప్పు చేస్తూండగా ఎక్కడినుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్లు పెట్టి లేచి నిలబడింది. అది చూసి అతను పిల్లిని తరుమబోయాడు. పిల్లి వెనక్కు దూకింది. కుండ అరుగుమీద నుంచి కింద పడి రెండే రెండు ముక్కలయింది.
కుండ అరువు తెచ్చినవాడు తడువుకోకుండా రెండు ముక్కలూ జిగురు పెట్టి అంటించి, పొరుగువాడి వద్దకు తీసుకుపోయి, ‘ఇదుగో నీ కుండ’ అని ఇచ్చేశాడు. పొరుగువాడు పగులు గమనించి ‘ఏమిటిది?’ అన్నాడు.
ఆసామి, ‘నాకు తెలియదు’ అంటూ ఇంటికి వచ్చాడు. పొరుగువాడు న్యాయస్థానంలో పిర్యాదు చేశాడు. ఆసామి న్యాయవాది వద్దకు వెళ్లి సలహా అడిగాడు. న్యాయవాది అంతా విని, ‘జరిగినదానికి సాక్షులెవరూ లేరు గనక నువు మూడు విధాలుగా సమర్థిచుకోవచ్చు. నువు కుండ అరువు తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదనవచ్చు. లేదా, నువు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమోననవచ్చు; అన్నిటికన్నా భేషయినదేమంటే, అసలు నువు కుండ తీసుకోలేదనవచ్చు,’ అన్నాడు. కుండ ఖరీదు పావలే అయినా మంచి సలహా చెప్పినందుకు న్యాయవాదికి రూపాయి ఇచ్చి ఆసామి ఇంటికి వచ్చాడు.
మర్నాడు న్యాయస్థానంలో విచారణలో, ఆసామి న్యాయమూర్తితో ఇలా విన్నవించుకు న్నాడు. ‘అయ్యా, నేనా కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదండి. ఆ మాటకు వస్తే అది నేను తిరిగి ఇచ్చినాక పగిలిందేమో నాకా సంగతి తెలియదండి. అన్నిటికన్న ముఖ్యమే మంటే నేనసలు ఆ కుండను అరువు తీసుకోనే లేదండి!’ న్యాయవాది సలహా ఇంత బాగా పాటించినా న్యాయాధికారి తనకు రెండు రూపాయలు జరిమానా ఎందుకు వేశాడో ఆసామికి అర్థం కాలేదు. ఆయన డబ్బు చెల్లించి న్యాయవాదులను తిట్టుకుంటూ ఇంటికి వెళ్లాడు.
కథ యొక్క నీతి: అడిగిన సలహా, నిజం గల పనికి ఉపయోగపడదు. అలా చెప్పిన మాటలు కేవలం తప్పులు తప్పించడానికి మాత్రమే ఉంటాయి.