అభిప్రాయం
ఒక రోజు ఒక వ్యక్తి తన ఇరవైఐదు సంవత్సరాల కుమారుడితో కలిసి రైలులో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అతని కుమారుడు రైలు బోగీ కిటికీ వద్ద కూర్చొని బయటకు చూస్తూ నాన్నా... ఇక్కడ ఆకాశంలో ఉన్న మబ్బులు మనం ఎంత దూరం వెళితే అంత దూరం మనతోపాటు వస్తున్నాయి చూశారా అని గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటాడు.
అదే బోగీలో వున్న భార్యాభర్తలు అతని ప్రవర్త చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు. మరికొంత సమయం అయ్యాక ఆ యువకుడు నాన్నా ... పక్షులు ఆకాశంలో ఎంత ఎత్తుగా ఎగురుతున్నాయో!! అని అదే ఉత్సాహంతో గట్టిగా చెబుతూ ఉంటాడు. యువకుని మాటలు విని భార్య భర్తలు చాలా విసుగుగా చూస్తారు.
మరి కొంత సమయం అయ్యాక ఆ యువకుడు నాన్నా... చెట్లు కూడా మన కంటే వేగంగా పరిగెడుతున్నాయి చూశారా అని రెట్టింపు ఉత్సాహంతో చెబుతూ ఉంటాడు. అతని మాటలు విన్న ఆ భార్యాభర్తలు తండ్రితో, మీ అబ్బాయికి ఏదో మానసిక సమస్య ఉన్నట్లుగా అనిపిస్తుంది మీరు ఎవరన్నా చక్కని మానసిక వైద్యుని చూపించినట్లు అయితే బాగుంటుందేమో అని వ్యంగ్యంగా అంటారు.
అప్పుడు ఆ యువకుని తండ్రి వారితో నా కొడుకు గత ఇరవైఐదుసంవత్సరాలుగా తన అంధత్వం వల్ల ప్రపంచాన్ని చూడలేకపోయాడు, పది రోజుల క్రితమే వీడికి కంటిచూపుకోసం చికిత్స చేశారు. ఈ రోజు ఉదయమే కట్లువిప్పారు. అందువలన వీడు ఈ ఉదయం నుంచే మొట్టమొదటిసారి ప్రపంచాన్ని చూడడం ప్రారంభించాడు, అందుకే ప్రతిదీ చాలా కొత్తగా వింతగా ఉంది అని చెప్తాడు. ఆ తండ్రి మాటలు విన్న భార్యభర్తలిద్దరు ఆశ్చర్యపోయి వారి ప్రవర్తనకు వారే సిగ్గుపడి ఆ తండ్రికి ఆ యువకునికి క్షమాపణ చెప్పారు.
కథ యొక్క నీతి: ఎదుటి వారి పరిస్థితి గురించి ఆలోచించకుండా, మనకు మనమే వారి గురించి ఒక అభిప్రాయానికి రాకూడదు.