అల్లుడి అదృష్టం
భద్రయ్య కూతురు సీత పెళ్లి కుదిరింది. ఊళ్ళోనే ఉన్న ధర్మయ్య కొడుకు శివయ్య వరుడు. భద్రయ్య పెళ్లి ఖర్చులకు, కట్నం ఇవ్వడానికి తను ఉంటున్న పెంకుటిల్లు అమ్మడానికి పెట్టాడు.
ఇంటి పక్కనే ఉన్న శాంతయ్య తనకి కలసి వస్తుందని కొనడానికి ముందుకు వచ్చి కొంత డబ్బు ఇచ్చాడు.
కానీ భద్రయ్య అంటే పడని గోపయ్య ఆ ఇంటి వాస్తు సరిగా లేదని, కొంటె అరిష్టమని భయపెట్టాడు. శాంతయ్య భయపడి తను ఇల్లు కొనలేనని ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకున్నాడు.
భద్రయ్య నిరుత్సాహపడ్డాడు. ధర్మయ్య దగ్గరికి వెళ్లి పెళ్లి వాయిదా వేయమని కోరాడు. ఇల్లు అమ్ముడు అయితే తప్ప కట్నం ఇవ్వలేనని అసలు విషయం చెప్పాడు.
అప్పుడు వరుడు శివయ్య ముందుకు వచ్చి, “నాన్న! కట్నం బదులు ఆ ఇల్లు నేను తీసుకుంటాను. పెళ్లయిన తర్వాత అన్నయ్య మీ దగ్గర ఉంటాడు. నేను ఆ ఇంట్లో కాపురం ఉంటాను” అన్నాడు.
“ఆ ఇల్లు చాలా పాత పడింది కదా?” అనే సందేహం వెలిబుచ్చాడు ధర్మయ్య.
“ఆ ఇల్లు ఉన్న స్థలం మన గ్రామం మధ్యలో ఉంది నాన్న! నేను దాన్ని పడగొట్టి ఇంటితోపాటు దుకాణం కట్టిస్తాను. వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది” అని తండ్రికి నచ్చజెప్పారు శివయ్య.
ధర్మయ్య కొడుకు అభిప్రాయంతో ఏకీభవించాడు. పెళ్లయిన తర్వాత భద్రయ్య ఇంటిని అల్లుడికి అప్పగించి తను పట్నంలో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళి పోయాడు.
తర్వాత శివయ్య పెంకుటిల్లు పడగొట్టించాడు. కొత్త ఇల్లు, దుకాణం కట్టించడానికి పునాదులు తవ్వుతుంటే, లంకెబిందెల దొరికింది. దాన్నిండా బంగారు కాసులు ఉన్నాయి.
శివయ్య పట్నం వెళ్లి మామ గారిని కలుసుకొని ఇంటి పునాదుల్లో లంకెబిందె దొరికిందనే సంగతి చెప్పాడు. “మావయ్య! ఆ లంక బిందె మీ పూర్వీకులది ఉంటుంది. అందులో బంగారం మీకు చెందుతుంది తీసుకోండి” అన్నాడు శివయ్య.
భద్రయ్య నవ్వి “అదంతా నీ అదృష్టం అల్లుడు. అదే నా ఇల్లు శాంతయ్య కు అమ్మి ఉంటే, లంకె బిందె బయటపడినా, నాకు చెప్పేవాడా? తిరిగి వచ్చే వాడా? ఇల్లు కొనడానికి డబ్బులు ఇచ్చి తిరిగి తీసుకున్నాడంటే, మా పెద్దల ఆస్తి బయటకు పోకుండా ఉండటానికి అనుకుంటాను. ఇదంతా ఆ దేవుని దయ. నీ అదృష్టం కాబట్టి ఆ బంగారం నీదే” అని లంక బిందె తీసుకోవడానికి తిరస్కరించాడు. శివయ్య సంతోషంతో గ్రామానికి వెనుదిరిగాడు.
కథ యొక్క నీతి: అదృష్టం అనేది వయస్సు, స్థితి లేదా ప్రణాళికలపై ఆధారపడదు. దైవకృప, నీతి, సత్కార్యాలు మన జీవితంలో మంచి మార్గం చూపిస్తాయి.