అన్నా గోపాలా!



ఒక చిన్న గ్రామంలో ఒక తల్లి తన బిడ్డ గోపీతో వుండేది. ఆమెకు భర్త లేడు, ఒక్కడే పిల్లాడు. అన్నెం పున్నెం యెరుగని బాలుడు.

ఆ తల్లి చాలా కష్టాలు పడేది పిల్లవాడిని పోషించడానికి. భగవతుడిని నమ్ముకుని బ్రతికేది. వూరికి దూరంగా వున్న బడిలో గోపీ చదువుకునేవాడు. రోజు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాడు. సాయంత్రం చింతతోపు లోంచి నడుచుకుంటూ ఇంటికి రావటానికి చాలా భయ పడేవాడు. వేరే పిల్లలంతా తల్లి-తండ్రులతోనో, బళ్ళల్లోనో వచ్చేవారు.

ఒక రోజు గోపీ తన తల్లితో అన్నాడు, “అమ్మా నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు, నేనేమీ పంచభక్ష్య పరమాన్నాలు అడగటం లేదు. కానీ రోజు చింతతోపు లోంచి రావాలంటే చాలా భయమేస్తుందమ్మా! నువ్వు రోజూ నాకు తోడు రాలేవా?”

“నాయనా! నీ పేరే గోపీ, గోపాల క్రిష్ణుడి పేరు పెట్టుకున్నాను. ఆయనే నీకు దిక్కు. భగవంతుడే మనకు రక్ష! భయం కలిగినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకో, ఆయనే చూసుకుంటాడు అంతా.” అని ధైర్యం చెప్పింది.

ఆ మాటను అక్షరాలా పఠించేవాడు గోపీ. సాయంత్రాలు భయమేసినప్పుడల్లా, “అన్నా! గోపాలా!” అని తలుచుకునేవాడు. ధైర్యంగా భయం లేకుండా చింతతోపు దాటుకుని ఇంటికి వచ్చేసేవాడు.

ఒక రోజు బడిలో అయ్యవారు తన కూతురి పెళ్ళికి అందరినీ ఆహ్వానించాడు. అందరూ పిల్లలు తల్లి తండ్రులని అడిగి బహుమతులు తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు.

సాయంత్రం ఇంటికి వస్తూ పిల్లాడు, “అన్నా! గోపాలా!” అని పిలిచాడు. “ఏం బహుమతి తీసుకుని వెళ్ళాలి, పాపం మా అమ్మ ఏం ఇవ్వగలదు?” అని అడిగాడు. అమ్మ ఏమిస్తే అదే సరిలే అనుకున్నాడు.

పెళ్ళిరోజు చక్కగా స్నానం చేసి, వున్న వాటిల్లో మంచి బట్టలు వేసుకున్నాడు. వాళ్ళ అమ్మ ఇచ్చిన చిట్టి పిడతలో పెరుగు జాగ్రత్తగా పట్టుకెళ్ళాడు. అందరూ ఖరీదైన బహుమానాలు

తీసుకుని వచ్చారు. కొంత మంది పిల్లలు గోపీ తెచ్చిన బహుమానం చూసి నవ్వేరు. కాని అయ్యవారు చాలా ఆప్యాయంగా గోపీని ఇంట్లోకి రమ్మని, ఆ చిట్టి పిడతని తీసుకుని పక్కకు పెట్టారు. గోపీని కూడ అందరి లాగానే సత్కరించారు. విందులో అందరినీ కూర్చోమన్నారు.

పప్పూ, కూరలూ, పులుసులూ ఆరగించారు. పులిహోరా, మిఠాయివుండలూ, జాంగ్రీలూ వగైరా ఆస్వాదించారు. చివరిగా పెరుగు వడ్డించ మన్నారు.

చిట్టి పిడతలో వున్న పెరుగు ఒక్కరికి సరిపోతుందనుకుని, అయ్యవారు ముందు ఆ గిన్నిలోని పెరుగు ఒకరి విస్తరలో వంపేరు.

ఆశ్చర్యం! తిరిగేసరికి ఆ పిడతలో మళ్ళి పెరుగు నిండిపోయింది.

ఈ లోపల ఆ పెరుగు తింటున్న వ్యక్తి, “అద్భుతం! అమోఘం! ఈ పెరుగేంటి ఇంత రుచిగా వుంది, ఎక్కడనించి తెప్పించారు?” అన్నాడు.

వేరే వాళ్ళంతా, “యేది, మాకు వడ్డించండి, మేమూ చూస్తాము”, అన్నారు.

అయ్యవారు పిడతలో పెరుగు అందరికి వడ్డించడం మొదలెట్టారు. అసలు యెంత మందికి అందులోంచి పెరుగు వడ్డించినా, అందులో మళ్ళీ మళ్ళీ పెరుగు నిండిపోయింది.

వచ్చిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహిమ యేమిటొ అని అయ్యవారు గోపీని అడిగారు. గోపీ జరిగిందంతా చెప్పాడు. అందరూ “యేది, అన్నా! గోపాలా! అని పిలూ, మేమూ చూస్తాము!” అన్నారు.

అయ్యవారు అందరిని మందలించారు. “మనలాంటి వాళ్ళకు కనిపించాల్సిన అవసరం దేవుడికిలేదు. ఈ బాలుడి వల్ల మనం ఈ రోజు ఈ మహిమ చూడగలిగాము.” అన్నారు.

అందరూ ఆకాశం వైపు చూశారు. నీలంగా నల్ల కృష్ణుని నీల పీతంబరమా అన్నట్టు ఆకాశంలో కనబడింది.

Responsive Footer with Logo and Social Media