బాధ సహించలేనివస్తాదు



ఒక పేరుమోసిన వస్తాదు ఉండేవాడు. తన పరాక్రమానికీ, ఖ్యాతికి తగినట్టుగా తన రెండు చేతులమీదా సింహంబొమ్మలు పచ్చ పొడిపించుకోవాలని వాడికి కోరిక కలిగింది. అందుకని వస్తాదు ఒక మంగలి వద్దకు “నా చేతులమీద సింహాల బొమ్మలు పచ్చ పొడుస్తావా ఏమిటి? అసలు నేను సింహ లగ్నంలో పుట్టినవాణ్ణు, వల్లమాలిన ధైర్యసాహసాలు గలవాణ్ణి కూడానూ,” అని చెప్పాడు.

మంగలి సరేనని సూది తీసి వస్తాదు చేతిమీద పొడవసాగాడు. వస్తాదుకు సూది పోట్లు చాలా బాధ కలిగించాయి. రెండు మూడు పోట్లకే వాడు ఎక్కడలేని చిరా కుతో, “ఉండు, ఉండు! ఏం పొడుస్తు న్నావు?” అని అడిగాడు.

“సింహం తోక పొడుస్తున్నాను.” అన్నాడు మంగలి.

“సరిపోయింది! గొప్పవాళ్ళంతా తమ పెంపుడు కుక్కలకూ, గుర్రాలకూ తోకలు కత్తిరించేస్తారు, తెలుసా? తోకలేని సింహా నికి పౌరుషం మహా జాస్తి. అంచేత తోక మానేసి మిగిలిన సింహం పొడు, చాలు!” అన్నాడు వస్తాదు.

మంగలి సరేనని మళ్ళీ పొడవసాగాడు. “ఆగు, ఆగు! ఇప్పుడేం పొడుస్తున్నావు?” అన్నాడు వస్తాదు, సూదిపోటు కొంచెంకూడా భరించలేక.

“సింహం చెవులు పొడుస్తున్నాను,” అన్నాడు మంగలి.

‘‘ఏడిచినట్టే ఉంది! కుక్కలను పెంచే వాళ్లు ఏం చేస్తారో నీకు తెలీదా? వాటి చెవులు కత్తిరించేస్తారు. పొడుగాటి చెపు లుండే కుక్కలను ఎవరూ పెంచరు. సింహాలలో కూడా చెవులు లేని సింహాలే శ్రేష్ఠం!” అన్నాడు వస్తాదు.

“సరే, అయితే చెవులు లేని సింహాన్నే పొడుస్తాను,” అంటూ మంగలి మళ్లీ తన పని సాగించాడు. వాడు చేతిమీద పొడిచినప్పుడల్లా వస్తాదుకు పంచప్రాణాలు పోయినంత పని అవుతున్నది.

“తొందరపడకు, కొంచెం ఆగు! ఇప్పుడేం పొడుస్తున్నావు?” అని వస్తాదు మంగలిని అడిగాడు. “సింహం నడుము పొడుస్తున్నాను,” అన్నాడు మంగలి,

అఘోరించినట్టే ఉన్నది! నువు ఏ జన్మానా కావ్యాలు కూడా చదువుకున్నట్టు లేదు. సింహాలకు నడుములే ఉండవని కవులు ఘోషిస్తున్నారు. ఒకవేళ ఉన్నా ఉండీ లేనట్టుంటాయిట. అందమైన ఆడ వాళ్ల నడుములను సింహాల నడుములతో పోలుస్తారు. అదికూడా నీకు తెలిసినట్టు లేదు. అందుకే ఆడదాన్ని సింహేంద్ర మధ్యమ అంటారు. అంచేత నువు సింహానికి నడుము లేకుండానే చెయ్యి. అప్పుడు నీ బొమ్మ మరింత గొప్పగా వుంటుంది,” అని వస్తాదు వుపన్యాసం దంచేశాడు.

ఇంత లావు వస్తాదుకూ సూదితో పొడి పించుకునే శక్తి లేదనీ, ఇది చివరెళ్లా పచ్చ పొడిపించుకునే మేళం కాదనీ మంగలికి తెలిసిపోయింది. వాడు సూదినీ, రంగులనూ అవతల పెట్టి, “వస్తాదుగారూ, మీరు పచ్చ పొడిపించుకోనూ వద్దు, నేను పొడవావద్దు. నన్ను ఆపే బాధించక వచ్చిన దారినే దయ చెయ్యండి!” అన్నాడు.

ఈ మాటలతో వస్తాదుకు ఆశాభంగం కలగటానికి మారుగా ప్రాణం లేచి వచ్చిన ట్టయింది. “నీకు చాతకాకపోతే ఆ సంగతి ముందే నాతో చెప్పకపోయావా?” అని వాడు మీసం మెలివేసుకుంటూ చల్లగా ఇంటి దారి పట్టాడు. ఆరంభశూరత్వం ఇలాగే వుంటుంది.

కథ యొక్క నీతి: అవస్థను అంచనా వేసి, దానికంతటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి; ఇతరుల సంకోచం లేదా నష్టం వలన బాధపడకుండా, మన ఆశలు నిజమయ్యే దారిని ఎంచుకోవాలి.

Responsive Footer with Logo and Social Media