బంద్
“రాజు! ఈ రోజు మన ఊరిలో బంద్ చేయమని నాయకుడు చెప్పాడు” అని శ్రీనివాస్ చెప్పాడు. “బంద్ ఎందుకు చేయమన్నాడు” అని అడిగాడు రాజు. “ఆ సంగతి మనకెందుకు సాయంత్రానికి మన నాయకుడు మనకి డబ్బులు ఇస్తాడు” అని శ్రీనివాస్ చెప్పాడు. దాంతో రాజు కొందరు మిత్రులతో కలిసి, బయట తిరుగుతూ తెరిచి ఉన్న దుకాణాలను బలవంతంగా మూయించసాగారు. ఆ సమయంలో ఒక వ్యక్తి స్కూటర్ పై అటు రాసాగాడు. అది గమనించిన రాజు స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని ఆపి “ఈ రోజు బంద్ వెనక్కి తిరిగి వెళ్ళండి” అన్నాడు.
ఆ వ్యక్తి తాను అవసరంగా వెళ్లాలని వారిని ఎంతో బ్రతిమాలినా వాళ్ళు వినలేదు. రాజు కోపంతో ఆ స్కూటర్ టైర్లకు గాలిని తీసి, “మంచిగా చెబితే వినడం లేదు, ఇప్పుడు స్కూటర్ ని తోసుకుంటూ ఇంటికి వెళ్ళు” అనడంతో ఆ వ్యక్తి బాధతో వెళ్ళాడు.
మధ్యాహ్నం అయింది. అందరూ భోజనాలకు ఇళ్లకు వెళుతున్నారు. రాజు తాను గొప్ప పని చేసిన వాడిలా సంతోషంగా గెంతుతూ ఇంటికి వెళ్లాడు. ఇంటి బయట కంగారుగా ఉన్న చెల్లి, “అన్నయ్య! అమ్మ కి జ్వరం ఎక్కువగా ఉంది. హాస్పిటల్ కి వెళ్లాలంటే బంద్ వలన ఏ వాహనం లేదు. నువ్వు వెళ్లి డాక్టర్ ని తీసుకురా, ఆలస్యం అయితే కష్టం” అనడంతో రాజు అలాగే వెనక్కి తిరిగి పరిగెత్తాడు.
రాజు ఊరంతా తిరిగాడు. డాక్టర్లు ఉన్నారు, కానీ బంధువల్లె బయటకు రావడానికి భయపడ్డారు. ఆఖరికి ఒక చిన్న ఇంటి ముందు డాక్టర్ ప్రకాష్ అన్న బోర్డు కనిపించడంతో, ఆయన తప్పక తన ఇంటికి వస్తాడు అన్న ఆశతో ఆ ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలాయన తలుపు తెరిచి, రాజు ద్వారా సంగతి తెలుసుకొని “భయపడకు. మా వాడు చాలా మంచివాడు. అర్థరాత్రి అయినా రోగి ఇంటికి వెళతాడు, ఉండు పిలుస్తాను” అంటూ లోపలికి వెళ్ళాడు.
లోపల నుండి డాక్టర్ బయటికి వచ్చారు. ఆయన్ని చూడటంతో రాజు నిర్ఘాంతపోయాడు. ఆయన ఎవరో కాదు, ఉదయం స్కూటర్ మీద వస్తుంటే తాను అడ్డుపడి టైర్ గాలి పీకి పంపిన వ్యక్తి. ఆయన ఎందుకు తనకు సహాయం చేస్తాడు, అని బాధపడుతూ రాజు వెనుదిరిగాడు. అంతలో డాక్టర్ రాజు ను పిలిచి విషయం అడగడంతో రాజు ఏడుస్తూ ఆయన కాళ్ళపై పడి తల్లి సంగతి చెప్పాడు.
వెంటనే డాక్టర్ తన మందులు పెట్టె తీసుకొని, కాలినడక మీద రాజు ఇంటికి వచ్చి, అతని తల్లిని పరీక్షించి, తగిన మందులు ఇచ్చాడు. కొంతసేపటికి ఆమె జ్వరం తగ్గింది. రాజు, డాక్టర్ చేతులు పట్టుకొని “నన్ను క్షమించండి. ఉదయం మిమ్మల్ని అంత అల్లరి చేసినా మనసులో పెట్టుకోకుండా మా అమ్మకు వైద్యం చేశారు. నిజంగా మీరు దేవుడు” అన్నాడు.
డాక్టర్ అతని భుజంపై తట్టుతూ, “బంద్ అన్నది ఎందుకు చేయాలి. ఆ నాయకులు వారి స్వార్థం కొరకు మీ లాంటి వారితో ఇలా చేపిస్తుంటారు. కానీ దాని వలన ఎందరో నష్టపోతారు, అన్నది ఎవరూ ఆలోచించరు. ఈరోజు నీకు వచ్చిన కష్టం ఇంకా ఎందరికీ వచ్చిందో, మరి వారి పరిస్థితి ఆలోచించావా? ఇకపై ఎవరి మాటలు విని ఇలా బందులు చేయకు. చక్కగా చదువుకో. నలుగురికీ ఉపయోగపడు. నువ్వే కాదు మీ స్నేహితులు మారాలి, అప్పుడు మన దేశం బాగా అభివృద్ధి చెందుతుంది” అని వెళ్ళిపోయాడు.
కథ యొక్క నీతి: మన చర్యలు ఇతరుల ప్రయోజనాన్ని లక్ష్యంగా ఉంచి ఉండాలి. స్వార్థం కోసం చేయబడిన బందులు, నిరసనలు ఇతరులకు కష్టాన్ని తెస్తాయి.