బంధించబడిన పులి
ఒకప్పుడు, ఒక జంతు ప్రదర్శనశాల వారు అడవి నుండి ఒక పులిని బంధించి తీసుకెళ్లారు. అది బలంగా మరియు మంచి రంగుతో ఉన్న పులి. దానిని ప్రతి రోజు ప్రదర్శనకు ఉంచేవారు. ఆ ప్రదర్శనశాలలో అన్ని జంతువుల కన్నా ఆ పులి అందరిని బాగా ఆకట్టుకునేది. ఆ పులిని చూడటానికి ప్రత్యేకమైన ఛార్జ్ తీసుకుని మరీ అనుమతిచ్చేవారు. ఆ పులి వల్ల ఆ జంతు ప్రదర్శనశాలకి మంచి పేరు వచ్చింది. అందరూ సందర్శించడం ప్రారంభించారు. ఆ కారణంగా కొన్ని రోజులలోనే ఆ ఓనర్ చాలా ధనవంతుడయ్యాడు.
కొంతకాలం గడిచాక… పులి బొక్కచిక్కి పోవడం మరియు తన మంచి రంగును కోల్పోతూ వచ్చింది. అది చూసిన ఓనర్ చాలా కంగారుపడ్డాడు. "ఇది ఏమిటి? ఈ పులి ప్రదర్శన వల్ల ఇన్ని రోజులు మంచి సంపాదనతో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇది ఇలా తయారైంది!" అని ఆతను ఆలోచించాడు. దానికి రోజూ మంచి భోజనం పెట్టాడు. అయినా కూడా పులి తన రంగును పూర్తిగా కోల్పోయింది.
సాధారణంగా పులుల రంగు పసుపు మరియు నలుపు రంగుల కలయికలో ఉంటుంది. కానీ ఈ పులి యొక్క రంగు బూడిదరంగు, నలుపు మరియు తెలుపు రంగులుగా మారింది. ఇది ఎంతగా అంటే, ఆ పులి పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ సినిమాతో పోలి కనిపించింది.
జంతు ప్రదర్శనశాల ఓనర్, "ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రకారులకు ఈ జంతు ప్రదర్శనశాలకు వచ్చి రంగులేని పులిని మొదట్లో ఎలా ఉండేదో అలా మార్చమని చెప్పండి. అలా చేస్తే మంచి బహుమానం ఇస్తానని" అన్నాడు. చిత్రకారులు పులికి కొంత రంగు వేసేందుకు ప్రయత్నించారు, కానీ వారిలో ఎవరూ విజయవంతం కాలేదు. ఎందుకంటే రంగు వేయడానికి ప్రయత్నించినపుడల్లా పులి చర్మం నుండి ఆ రంగు జారిపోతుండేది.
అప్పుడు "వాన్ కాగ్" అనే చిత్రకారుడు వచ్చాడు. అతను ఒక వింత వ్యక్తి, తన బ్రష్‌తో సంతోషంగా గాలిలో పెయింటింగ్ చేస్తూ, తనను తానే గొప్ప పెయింటర్ అని అనుకుంటున్నాడు. అతను ఎప్పుడూ కూడా పెయింటింగ్ వేసేందుకు రంగులు, పేపర్ ఉపయోగించలేదు. అతను ఊహిస్తూ తనలో తను మాట్లాడుకుంటూ గాలిలో పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు.
అతను అక్కడకి వచ్చి, "పులికి రంగు నేను వేసి పెంచుతాను" అన్నాడు. అది విన్న మిగతా చిత్రకారులు పగలబడి నవ్వారు. "ఉన్నత చిత్రకారులైన మాతోనే పులికి రంగు వేయడం జరగలేదు. పిచ్చివాడివి, గాలిలో పెయింట్ వేసేవాడివి, నీతో ఏం అవుతుంది?" అని వెక్కిరించారు.
అప్పుడు అతను ఓనర్ దగ్గరికి వెళ్లి, "నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి. నేను తప్పకుండా పులి యొక్క రంగు మారుస్తాను. నాకు మీరు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు" అన్నాడు. అందుకు ఆ ఓనర్ సరే అన్నాడు. మిగతా చిత్రకారులు, "ఇతను పులికి పూర్వ వైభవాన్ని ఎలా తీసుకొస్తాడో?" అని ఊహిస్తూ, "మనము ఇక్కడే ఉండి చూద్దాం" అని నిర్ణయించుకున్నారు.
వాన్ కాగ్ ఆ పులి దగ్గరికి వెళ్లి, చెవిలో ఎదో చెబుతూ పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. మధ్య మధ్యలో పులికి మంచి ఆహారం అందిస్తూ, చెవిలో ఎదో చెబుతూ పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు. అలా కొన్ని రోజులు గడిచాక, పులి తన పూర్వ బలాన్ని మరియు రంగులోకి మారింది. అందరు ఆశ్చర్యపోయారు.
చిత్రకారుడు పులికి చెవిలో చెప్పిన రహస్యం ఏమిటో, అందరూ తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు అతను తన బ్రష్‌ను నిజ జీవితాన్ని చిత్రించడానికి మాత్రమే వాడతానని వివరించాడు. "నేను పులికి చెవిలో చెప్పినది ఏమిటంటే… 'నువ్వు నీ పూర్వవైభవాన్ని కలిగి ఉంటే, నిన్ను ఈ బంధం నుండి విడిపిస్తాను. అప్పుడే నువ్వు స్వతంత్రంగా జీవించవచ్చు' అని చెప్పాను."
అందుకు పులి బాగా తింటూ, ఆనందంగా గడపడం ప్రారంభించింది. ఆ కారణంగా పులి తిరిగి తన వైభవాన్ని తెచ్చుకుంది" అని చిత్రకారుడు వివరించాడు.
అందులో ఒక చిత్రకారుడు లేచి, "అసలు పులికి అలా చెప్తే ఫలితం వస్తుందని నీకు ఎలా తెలుసు?" అన్నాడు. దానికి వాన్ కాగ్, "అడవిలో ఉన్నప్పుడు పులి స్వేచ్ఛగా జీవించేది. కానీ ఇప్పుడు తగిన ఆహారం దొరికినా, తిరగడానికి చోటు లేదు మరియు స్వతంత్రంగా తిరిగే హక్కు లేదు. తోటి జంతులు లేరు. అందుకే పులి ఇలా తయారైంది. అది గమనించి నేను పులి చెవిలో తన భవిష్యత్తు గురించి చెప్పాను. అందుకే ఇది ఫలితంగా మారింది" అన్నాడు.
అందరు లేచి చప్పట్లు కొట్టారు. "ఇంతకాలం నిన్ను మేమంతా ఒక పిచ్చి చిత్రకారుడిగా భావించాము. కానీ నిజ జీవితాన్ని రంగుల మయం చేసే గొప్ప చిత్రకారుడివి నీవే" అని ఆయనను ప్రశంసించారు.
కథ యొక్క నీతి: ఒక మనిషిని, జంతువుని, ప్రాణమున్న ఏ జీవినైనా బోనులో బంధించి ఉంచితే, తన వైభవాన్ని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. అదే ప్రాణి స్వతంత్రంగా విహరిస్తే, ఎల్లప్పుడూ ఒక కొత్త వైభవాన్ని సంతరించుకుంటుంది.