భగవద్గీత – బహుమానం
రామనాథం మాస్టారు చక్కని ఉపాధ్యాయులు మాత్రమే కాదు, సమయోచితమైన సలహాలతో అందరి మంచిని పెంచే మహా మనిషి. ఒకరోజు రామనాథం మాస్టర్ గారు గోపి అనే విద్యార్థి జన్మదినం సందర్భంగా భగవద్గీత పుస్తకం ఇచ్చాడు. భగవద్గీత పుస్తకాన్ని చూసి గోపితో సహా అతని స్నేహితులు గొల్లున నవ్వి “వృద్ధులకు ఉపయోగపడే భగవద్గీత యువకుడినైన నాకెందుకు ఇచ్చారు” అని అడిగాడు గోపి.
అప్పుడు రామనాథం మాస్టారు అక్కడి వారిని ఉద్దేశించి ఇది వృద్ధులు మాత్రమే చదివే పుస్తకం కాదు మానసిక పరివర్తన చెందిన యువకులు చదవాల్సిన మహాగ్రంథం. ఎందుకంటే నేటి సమాజంలో యువతకు మంచి చెడుకు మధ్య తేడా తెలియడం లేదు. మహా వీరుడైన అర్జునుడు సంశయ మనస్కుడై కర్తవ్యాన్ని విస్మరించి మోహనసముద్రంలో పడిపోతున్న సమయంలో అతడికి సత్యం వివరించి విషాదం నుండి బయటకు లాగి కార్యోన్ముకుడిని చేసింది భగవద్గీత. అందుకే ఈ గ్రంథం ప్రపంచంలోని అన్ని భాషలలోనూ తర్జుమా చేయబడింది. అలాగే ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చావే శరణ్యమని భావించే వారికి, సముద్రంలో దిక్కు తెలియని దిక్సూచి భగవద్గీత. కనుక పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ చదవాల్సిన అద్భుత గ్రంథం భగవద్గీత అని వివరించాడు.
రామనాథం చెప్పిన మాటల్లో సత్యం ఉన్నట్లు అక్కడ ఉన్న వారందరూ గ్రహించి చప్పట్లతో తమ హర్షం వెలిబుచ్చారు.
కథ యొక్క నీతి: భగవద్గీత అన్ని వయస్సుల వారికి, అన్ని సమయంలో ఉపయోగపడే అద్భుత గ్రంథం, అది మనసిక పరివర్తనకు మార్గదర్శకంగా ఉంటుంది.