చెడ్డ శిష్యుడు
ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడుండేవాడు. అతడి దగ్గిర మల్లవిద్య నేర్చుకు నేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తుండేవారు. వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీ పట్లు తెలుసు. వాటిలో నూట నలభై పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించినవాడి కొకడికి నేర్పాడు. కొన్నాళ్ల తరవాత ఆ శిష్యుడు రాజుగారి దగ్గరకు పోయి, ‘మహారాజా! రాజ్యంలో నన్ను మించిన వస్తాదు మరొకడు లేడు. ఆఖరికి నాకు విద్య చెప్పిన గురువునైనా సరే ఓడించగలను. కాని, ఆయన ముసలివాడు కావడం వల్లా, నాకు విద్య నేర్పిన వాడవటం వల్లా కృతజ్ఞత కొద్దీ ఆయనమీద సవాలు చేయదలచలేదు,’ అన్నాడు.
శిష్యుడి మాటలు వింటూనే రాజుగారికి మండిపోయింది. అంత విద్య నేర్పిన గురువుపై కృతజ్ఞతాభావం లేనందుకు అతణ్ణి కోప్పడి, ‘అయినా, నీ మాటల్లో ఉన్న నిజం ఎంతో తెలిసిపోతుంది. మీ ఇద్దరికీ కుస్తీ ఏర్పాటు చేశాను, అన్నాడు.
గురుశిష్యుల కుస్తీ చూసేందుకు చాలామంది జనం వచ్చారు. యువకుడూ, బల శాలీ అయిన శిష్యుడు ఏనుగుపిల్లలా ముసలి గురువు మీదికి దూకాడు. గురువుకు తను బలంలో శిష్యుడికి తీసికట్టని తెలుసు. అందువల్ల అతడు శిష్యుడికి నేర్పకుండా వదిలిన ఆ ఒక్క కుస్తీపట్టు ప్రయోగించి, అతణ్ణి గాలిలోకి ఎత్తి దూరంగా విసిరివేశాడు.
‘ఈ పట్టు నువ్వు నాకు నేర్పలేదు. ఇది అన్యాయం!’ అన్నాడు శిష్యుడు, పడ్డ చోటు నుంచి లేచి మన్ను దులుపుకుంటూ.
‘ఇలాంటి సమయం రావచ్చనే దాన్ని నీకు నేర్పలేదు,’ అన్నాడు ముసలిగురువు. రాజూ, చూడవచ్చిన ప్రజలూ గురువును మెచ్చుకున్నారు.
కథ యొక్క నీతి: విద్యాన్నే కాదు, జీవన అనుభవాన్ని కూడా విలువగొలిపే సూచన.