చిలుక మరియు గుడ్లగూబ



అనగనగా ఒక అడవిలో ఒక చిలుక గుడ్లగూబ చాలా స్నేహం గా ఉండేవి, ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానం. చిలుకకు తానూ చాలా అందంగా వున్నానని చాలా బాగా పాడుతానని, అసలు ఈ అడవి మొత్తం లో తనకన్నా అందమైనవాళ్లు చక్కగా పాడేవారు లేరని చాలా గట్టిగా నమ్మేది అదేవిధంగా గుడ్లగూబ కూడా ఈ అడవిమొత్తం లో తానె తెలివైనదానిని అనే గుడ్డినమ్మకం తో ఉండేది. ఇవిరెండూ వారి వారికున్న గర్వం తో ఎవరితో సరిగ్గా మాట్లాడేవి కాదు పైగా మాకు మాయిద్దరి స్నేహం చాలు...! వేరేవారితో పనిలేదు...! అని ఎవరితో సంబంధం లేకుండా అందరికి దూరంగా వేరొక చెట్టుపై జీవించేవి.

వారిద్దరినీ ఎప్పటినుండో గమనిస్తున్న ఒక ముసలి గ్రద్ద, వీరిద్దరికి ఏదో ఒకరోజు తప్పకుండా జ్ఞానోదయం అవుతుంది' అనుకుంది మనస్సులో అలా రోజులు గడుస్తూ వున్నాయి, ఒకరోజు చిలుక గుడ్లగూబ చెట్టుపై అటూయిటూ ఎగురుతూ ఆడుకుంటూవుంటే గుడ్లగూబ అనుకోకుండా ఆ చెట్టుకువున్న పదునైన కొమ్మపై పడింది అంతే, ఒక్కసారిగా ఆ కొమ్మకొన గుడ్లగూబ రెక్కకు గుచ్చుకుంది. తాళలేని నొప్పితో గుడ్లగూబ గట్టి గా అరవడం మొదలుపెట్టింది, అనుకోకుండా జరిగిన ప్రమాదానికి భయపడిన చిలుక స్నేహితుణ్ని ఎలా రక్షించాలో తెలీక, గుడ్లగూబ ఏడుపు చూసి తట్టుకోలేక అది కూడా అరవడం మొదలుపెట్టింది.

వీరిద్దరి అరుపులు విని చుట్టుప్రక్కలవున్న పక్షులు జంతువులు అన్ని ఆ చెట్టు దగ్గరకు వచ్చాయి, జరిగింది చూసి కొన్ని మంచిగా అయింది వీళ్ళకి ... వీళ్ళ పొగరుకు తగ్గట్టే ప్రమాదం వచ్చింది, మనం ఎవ్వరం వీళ్ళకి సహాయం చేయొద్దు అని అన్నాయి.

మరి కొన్ని పక్షులు వాటి దుస్థితి చూసి తమలో తామే నవ్వుకున్నాయి. అప్పుడే అక్కడకు వచ్చిన ముసలి గ్రద్ద వారిని చూసి జరిగిన విషయం అర్థం చేసుకొని,'మీరు ఇద్దరూ భయపడొద్దు మీకు మేము సహాయం చేస్తాం 'అని మాటిచ్చింది. మిగిలిన పక్షులు గ్రద్దను సహాయం చేయవద్దని... వారు మన సహాయం తీసుకోవడానికి అర్హులుకాదని... స్వార్ధపరులని... చెప్పాయి.

అందుకు గ్రద్ద నాకు తెలుసు వారు స్వార్ధపరులు, వారెప్పుడూ యితరులకు సహాయం చేయలేదు పైగా మాకు వేరెవ్వరి సహాయం అవసరం లేదని గతం లో చెప్పాయి. కానీ ప్రస్తుతం వారు నిస్సహాయులు మన సహాయం కోసం ఎదురుచూస్తున్నారు యిప్పుడు మనం వీరికి సహాయం చేయక పోతే మనం కూడా వీరిలాగే స్వార్ధపరులం అవుతాం, అని చెప్పి ఇంకొందరి సహాయం తీసికొని గుడ్లగూబ ను ఆ చెట్టుకొమ్మనుండి విడిపించింది.

ముసలి గ్రద్ద మాటల్తో బుద్దివచ్చిన యిద్దరు స్నేతులు అందరిని క్షమాపణ అడిగాయి. అప్పుడు ముసలి గ్రద్ద మీ క్షమాపణలు మాకు అవసరం లేదు మీరు కూడా మాఅందరితో కలసి మెలసి వుండి అవసరం వున్నవారికి సహాయం చేస్తే మీకు కూడా అవసరం లో సహాయం అందుతుంది పైగా అందరితో కలసి ఉంటే మీ జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్పింది. స్నేహితులు ఇద్దరుకూడా గ్రద్ద మాటల్లో వున్న నిజాన్ని గ్రహించి అందరితో కలసివుంటామని మాటిచ్చాయి.

కథ యొక్క నీతి: స్వార్ధపరులు కావడం మనకు ప్రమాదకరమైతే, సహాయం చేసే మనోభావం కలిగి ఇతరులతో కలసి ఉండటం మన జీవితం ఆనందంగా తీర్చబడుతుంది.

Responsive Footer with Logo and Social Media