ధర్మరాజు జూదంలో ఓడిపోవుట
ఆ సమయంలో దుర్యోధనుడు " ధర్మజా! కొంచెం సేపు జూదం ఆడతాము. నీకు జూదం ఆడటంలో ఆసక్తి ఉంది కదా " అన్నాడు. ధర్మరాజు " సుయోధనా ! జూదం అందులో మోసపూరిత జూదం క్షత్రియ ధర్మం కాదు. రాజులు జూదం ఆడుట ధర్మం కాదు. కుటిలులతో జూదం తగదు. దాని వలన ఎంతటి వారైనా సంపద కోల్పోతారు. ధర్మ జూదంలో గెలవడం పుణ్యం, కపట జూదంలో గెలవడం పాపం " అన్నాడు.
శకుని " జూదంలో నేర్పరులు, లోకజ్ఞానం కలవారు, సుక్షత్రియులు, రాజనీతి తెలినవారు జూదాన్ని నిందించటం తగదు. బలహీనులు బలవంతులను ఓడించటానికి మాయలు పరిపాటి కదా. నీకు భయమైతే వద్దు " అన్నాడు. ధర్మరాజు " బలవంతంగా జూదానికి పిలువబడ్డాము. ఆడక తప్పుతుందా. ఇక మాటలెందుకు కానివ్వండి " అన్నాడు.
ధర్మరాజు " మీలో నాతో ఎవరు జూదం ఆడుతారు " అని అడిగాడు. దుర్యోధనుడు " ధర్మజా! నేను రత్నాలను, ధనమును ఇచ్చే వాడిని, నా తరఫున శకుని జూదం ఆడతాడు " అన్నాడు. ధర్మరాజు " ఒకరి కోసం ఒకరు జూదం ఆడటం అక్రమం మీ ఇచ్ఛానుసారం ప్రారంభమవుగాక!" అని చేసేది లేక తన చేతి రత్నఖచిత కంకణాన్ని ఫణంగా పెట్టాడు. జూదం స్నేహపూరితంగా జరుగుతున్నది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వికల మనస్కులై చూస్తున్నారు. శకుని తన కోసం చేయించుకున్న ప్రత్యేక పాచికలతో జూదం ఆడి ప్రతి పందెం గెలుస్తున్నాడు. ధర్మరాజు లో పంతం పెరిగింది. ఒకటి తరువాత ఒకటిగా ఒడ్డుతూ ఓడుతున్నాడు. బంగారు భాండాగారాలు, వజ్రాల భాండాగారాలు, రత్నభాండాగారాలు, బంగారు నిధులు, అశ్వములు, ఏనుగులు, సేవకులు, దాసదాసీ జనాలు, గోవులు, సేనావాహిని, అన్నింటినీ ఓడి పోయాడు.
ఇది చూసి విదురుడు దృతరాష్ట్రునితో " దుర్యోధనుడు పాపాత్ముడు కురు వంశం పాపంతో నిండపోతుంది. దుర్యోధనుని నివారించు. ధర్మాన్ని రక్షించు. వినాశనాన్ని ఆపించు. దుర్యోధనుని బహిష్కరించు. అతడు బలవంతులతో యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. జూదాన్ని ఆపు ఉపేక్షించకు " అన్నాడు. పుత్రుల మీద మమకారంతో ధృతరాష్ట్రుడు మిన్నకున్నాడు. విదురుడు దుర్యోధనునితో " సుయోధనా ! నువ్వు ఈ ప్రకారంగా శకుని సహకారంతో పాండవులను కొల్లగొడుతుంటే ప్రజలు ఛీ కొట్టరా ? ఇలా మోసం చెయ్యటం మంచిదా " అన్నాడు.
అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి కోపంతో " నువ్వు ఎప్పుడూ పాండవుల పక్షాన మాట్లాడతావు. నువ్వు మా ఇంట్లో ఉంటే విష సర్పం ఉన్నట్లే. శత్రువుల సంపదను సులభ మార్గంలో అపహరించడం రాజధర్మం. కనుక మాకు బుద్ధులు చెప్పద్దు " అని దూషించాడు. శకుని ధర్మరాజు తో " ధర్మజా! నీవు నీ సంపదనంతా పందెంలో ఒడ్డి ఓడావు. తరువాత పందెం ఏమిటి " అన్నాడు. శకుని రెచ్చగొడుతుండగా ధర్మరాజు పందెములు ఒడ్డుతూ, తన సమస్త రాజ్యాన్ని, బ్రాహ్మణులకు, దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన ఆస్తులను, తన తమ్ములను ఒడ్డి, చివరకు తనను తాను ఓడ్డుకుని ఓడిపోయాడు. అప్పుడు శకుని " ధర్మజా ! అదేమిటి నిన్ను నీవు ఒడ్డుకున్నావు.
నీ వద్ద ఒడ్డడానికి మరొక ధనం ఉంది మరిచి పోయావా ? నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా?" అని ఎత్తి పొడిచాడు. అప్పుడు ధర్మరాజు ద్రౌపది ని తనకు ఇష్టం లేకున్నా ఫణంగా పెట్టి ఓడి పోయాడు. సభ అంతా క్షోభకు గరైంది.భీష్మ ద్రోనాదులకు చెమటలు పట్టాయి. విదురుడు శక్తిని కోల్పోయి తలపట్టుకుని కూలబడ్డాడు. బాహ్లీకుడు, సోమదత్తుడు, సంజయుడు, అశ్వధామ, భూరిశ్రవుడు, ధృతరాష్ట పుత్రుడు యుయుత్సుడు బుసకొట్టే సర్పాలవలె తలవాల్చి చేతులు నలుపుకున్నారు.
ధృతరాష్ట్రుడు ఆనందంతో "గెలిచామా! గెలిచామా" అని పదే పదే అడుగుతున్నాడు. దుశ్శాసనుడుతో కలిసి కర్ణుడు ఆనందించాడు. ఇతర సభ్యుల కళ్ళనుండి నీళ్ళు రాలాయి.