ధర్మరాజు సుయోధనుడిని విడిపించుటకు తమ్ములను పంపుట
కౌరవులకు గంధర్వులకు మధ్య జరిగిన ఘోరమైన పోరులో గంధర్వులు ఓడి పోయారు. వారు చిత్రసేనునికి జరిగినది చెప్పారు.చిత్రసేనుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. చిత్రసేనుడు మాయాయుద్ధ నిపుణుడు. అతని మాయా యుద్ధానికి కౌరవ సేన తట్టుకొనలేక పారిపోయింది. కర్ణుడు మాత్రము వారితో తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. దుర్యోధనుడు కర్ణునికి సాయంగా ఉన్నాడు. శకుని దుర్యోధనుని సోదరులు దుర్యోధనునికి సాయంగా నిలిచారు. గంధర్వులు గుమిగూడి ఎలాగైనా కర్ణుడిని చంపాలని నిశ్చయించుకొని కత్తులతో శూలాలతో గదలతో చుట్టుముట్టి కొందరు కర్ణుని రథం ను విరగకొట్టారు.కొందరు గుర్రాలను, కొందరు సారధిని పడగొట్టారు. కొందరు కవచమును చీల్చారు. అంత కర్ణుడు రధంనుండి దూకి వికర్ణుని రథం ఎక్కి యుద్ధం నుండి బయటకు వెళ్ళాడు.
అప్పుడు చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరిచి దుర్యోధనుని జుట్టు పట్టుకుని నేల మీద పడవేసి తన రథానికి కట్టి గట్టిగా సింహనాదం చేసాడు. అది చూసిన మిగిలిన గంధర్వులు మిగిలిన కౌరవులను, వారి భార్యలను దుర్యోధనుని భార్యను, కౌరవ రాకుమారులను మంత్రులను పట్టి బంధించి చిత్రసేనుని ముందు ఉంచారు. అది చూసి మిగిలిన వారు అక్కడే ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్ళి రక్షించమని మొర పెట్టుకున్నారు. అది విన్న భీముడు " ఆహా మనం చేవదలచిన కార్యం గంధర్వులే చేసారు. ఏ విధమైన శ్రమ లేకుండా మనకు విజయం చేకూర్చి గంధర్వులు మనకు మహోపకారం చేసారు. పుట్టిన నాటి నుండి పాపాలు మాత్రమే చేయటానికి అలవాటు పడిన దుర్యోధనునికి ఈ నాటికి గర్వభంగం చేసిన బ్రహ్మ ఎంత నేర్పరో కదా.
అడవులలో అష్టకష్టాలు పడుతున్న మనల్ని అవమానించటానికి వచ్చిన దుర్యోధనునికి తగిన పరాభవం జరిగింది. అందు వలన దుర్యోధనుని పై దయ చూపరాదు " అన్నాడు.ఆ మాటలు విన్న ధర్మరాజు " భీమసేనా! పరుషపు మాటలు తగునా. శరణన్న వారిని రక్షించాలి కాని చులక చేయడం తగునా. దాయాదుల మధ్య తగాదాలు సహజం. అంత మాత్రంచే ప్రేమలు అంతరిస్తాయా? దాయాదులు వారిలో వారు కలహించుకున్నా పరాయి వారి చేతిలో పరాభవం జరిగినప్పుడు ఒకరికి ఒకరు సాయపడాలి. ఇతరులు అవమానిస్తూ వుంటే మనం నూట ఇదుగురము. మనలో మనకు వైరుధ్యం ఏర్పడితే మనం ఇదుగురము. వారు నూర్గురు. సుయోధనుడు దుర్నీతి కలవాడే. కాని పరాయి వారెవరో కురుకుల కాంతలను అపహరించటం వలన మన వంశ ప్రతిష్ట నశించి పోతుంది. దుర్యోద్ధనుడు భార్యలతో సహా పట్టుబడ్డాడు. మనం ఉపేక్షించిన కులహాని కలుగుతుంది.
శరణు కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం నీ వంటి పరాక్రమశాలికి అది ధర్మం కనుక నీవు నీ తమ్ములతో సాయుధులై రధముల మీద వెళ్ళి చిత్రసేనుని నుండి సుయోధనుని వారి భార్యలను పరివారమును రక్షించండి " అని చెప్పాడు. భీముడు " అన్నయ్యా! దయ లేకుండా నన్ను నీటిలో తోయించి, విషాహారం పెట్టి చంపాలనుకున్నాడు. మనలను లక్క ఇంట్లో దహించాలని అనుకున్నాడు. మన సంపదలను వంచనతో అపహరించాడు. ద్రౌపది వలువలు నిండు సభలో ఊడదీయించి అవమానించాలని చూసాడు. అతడు చేసిన దుశ్చర్యలు తలచకుండా ఇలా ఔదార్యం చూపడం తగునా " అని భీముడు పలికాడు. అంతలో దుర్యోధనుడు "పాండుకుమారా! యుదిష్టిరా! ఈ గంధర్వుడు నన్ను, నా తమ్ములైన దుస్సాసనుడిని, నా భార్యలను బంధించి తీసుకుని పోతున్నాడు.
నన్ను త్వరగా రక్షించండి. వ్రుకోదరా! అర్జునా! నకులసహదేవులారా! ఆయుధములతో వచ్చి రక్షించండి. కురవంశానికి ఈ విధంగా జరిగిన అపకీర్తిని తొలగించండి." అన్న సుయోధనుడి విలాపాన్ని విని ధర్మరాజు " భీమసేనా! రక్షించమని అడిగితే ఎంతటి దుర్బలులైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. నీ వంటి బలవంతునకు ఊరకుండటం తగునా. శత్రువునైనా శరణుజొచ్చిన రక్షించాలని పెద్దలు చెబుతారు. సుయోధనునికి మన బలపరాక్రమములు తెలుయును అందువలన మనం రక్షిస్తామనిఆశతో ఎదురు చూస్తుంటారు. సుయోధనుడు ఆపదలో చిక్కి, నీ బాహుబలాన్ని ఆసరా చేసుకుని ప్రాణాలను కాపాడు కోవాలను కుంటున్నాడు.
ఇంత కన్నా నీవు ఆనందించాల్సిన దేముంది. భీమా! ఇది మనకు పుణ్యం కలుగు సమయం. నేను వెళ్ళి రక్షించగలను నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నిన్ను అర్ధిస్తున్నాను. కనుక మీరు వెళ్ళి గంధర్వులకు మంచి మాటలతో చెప్పి వారిని విడిపించండి. లేని ఎడల వారితో యుద్ధం చేసి వారిని విడిపించండి. నా యజ్ఞాన్ని సఫలం చెయ్యండి " అన్నాడు.
" మంచి మాటలతో గంధర్వులు ధార్తరాష్ట్రులను విడువక పోతే నేడు పృధివి గంధర్వుల నెత్తురు త్రాగుదునని" ఆర్జునుడు అనగా భీముడు తప్పక అంగీకరించి తన తమ్ములతో ఆయుధాలు ధరించి గంధర్వుల దగ్గరకు వెళ్ళారు. అర్జునుడు వారితో " గంధర్వులారా! మీకు మాకు విరోధం లేదు. మీరు సుయోధనుని విడిచి పెట్టండి. ఇది ధర్మరాజు ఆజ్ఞ అనుల్లంఘనీయము అని తెలుసుకోండి " అన్నాడు. గంధర్వులు "ధర్మరాజు మాకు రాజు కాదు కనుక అతని ఆజ్ఞను మేము ఎందుకు పాటిస్తాము. మా రాజు చిత్రసేనుడు తప్ప మరెవరు మమ్ము శాసించలేరు " అని యుద్ధానికి ఉపక్రమించగా అర్జునుడు " గంధర్వులారా! మీరు మంచి మాటలకు వినేలా లేదు మా ప్రతాపం రుచిచూపిస్తాము. సుయోధనుని విడిపిస్తాము " అని గంధర్వులతో తలపడ్డాడు. పాండవులకు గంధర్వులకు మధ్య పోరు భీకరంగా సాగింది.
పాండవులు నరుగురే. గంధర్వులు వేలకువేలు. కర్ణుడి, దుర్యోధనుడి రధములను విరిచినట్లు వీరి రధాలను గూడా విరవాలని వందలకొలది గంధర్వులు మీదపడుతుంటే అర్జునుడు తన బాణాలతో వారిని తమ దగ్గరకు కూడా రాకుండా నిరోధిస్తూ అనేకమంది గంధర్వులను చంపాడు. భీముడు నకులసహదేవులు తమ తమ ఆయుధాలతో విజ్రుమ్భించే సరికి గంధర్వులు తట్టుకోలేక ధార్తరాష్ట్రులను తీసుకుని ఆకాశాని కెగరగా అర్జునుడు తన బాణ సమూహముతో అన్ని దిక్కులా నిరోధించగ గంధర్వులు పంజరంలో చిక్కిన పక్షుల లాగా బాణాల మధ్య చిక్కి అర్జునుడుపై గదలను శక్తులను కురుపించారు.
అర్జునుడు కోపించి బాణ ప్రయోగం చేయగా గంధర్వుల తలలు, చేతులు, కాళ్ళు రాళ్ల వాన కురుస్తున్నట్లు ఆకాశం నుండి తెగిపడుతున్నాయి. ఇది చూసి సహించలేక చిత్రసేనుడు గదను తీసుకుని అర్జునిపై ప్రయోగించాడు. అర్జునుడు తన బాణంతో దానిని ముక్కలు చేసాడు. చిత్రసేనుడు అదృశ్యరూపుడై మాయాయుద్ధం ఆరంభించాడు. అర్జునుడు శభ్దవేది విద్యతో చిత్రసేనుని అంతర్ధాన విద్యను నశింపచేసి అస్త్రాలను ప్రయోగించగా బాణాల దెబ్బ తిని తట్టుకోలేక ఇక చేసేది లేక చిత్రసేనుడు అర్జునుని ముందు నిలిచాడు. అర్జునుడు " చిత్రసేనా! నీకు కౌరవులతో శత్రుత్వం ఎందుకు వారిని విడిచి పెట్టు " అన్నాడు.
చిత్రసేనుడు " అర్జునా! నీకు నాకు ఎలాంటి శత్రుత్వంలేదు పైగా నీవు నా మిత్రుడివి. అసలు విషయం ఏమిటంటే ఈ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. మీరు అడవిలో పడుతున్న కష్టాలు చూసి హేళన చేయడానికి ఘోషయాత్ర మిష మీద వచ్చాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఈ దురాత్ముని పట్టి బంధించి తన వద్దకు తీసుకు రమ్మన్నాడు. అందుకే ఇతనిని పట్టి బంధించి తీసుకు వెళుతున్నాను " అన్నాడు.