దుప్పి తెలివి!



అనగనగా ఓ అడవి. అందులో ఓ దుప్పి ఒక రోజు గడ్డి మేస్తూ , చాలా దూరం వెళ్లి పోయింది. ఇంతలో వాన పడింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది. కాసేపటికీ వర్షం తగ్గింది. ఇక బయటకు రావాలని అనుకుంటున్నప్పుడు, గుహ వైపు వస్తున్న పెద్దపులి కనపడింది.

ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది. గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్దపులికి కనపడే అవకాశం లేదని ఆలోచించగానే, కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం ఇంకా లేకపోయింది. పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహలోకి వచ్చేయొచ్చు. తానేమో బయటకు పరిగెత్తి పారిపోయే అవకాశం లేదు. ఇంతలో, మెరుపులాంటి ఆలోచన రాగానే... 'ఆ పెద్దపులి వచ్చే సమయం అయింది. నిశ్శబ్దంగా ఉండు. అది రాగానే మన ముగ్గురు ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెబుతున్నా... దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటి వరకు తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నాను. ఇది తినితే వంద అవుతుంది' అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్దపులికి ఏమి అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది.

ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పులి పరిగెత్తి పోయింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. 'ఎందుకు పరిగెడుతున్నావు?' అని పులిని అడిగింది. అది విన్న విషయం చెప్పింది. 'అమ్మో... వెళ్లి చూద్దాం!' అని అంది తోడేలు. పులి భయంగా ఒప్పుకుంది. గుహలో నుంచి దుప్పి బయటకు రావాలని అనుకుంటున్నంతలో, ఈసారి తోడేలు, పెద్దపులి కనపడినవి. మరోసారి గొంతు మార్చి 'పెద్దపులి వచ్చేలా లేదు కానీ... ఈ లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో, నేను వెళ్లి చూసి వ స్తాను...' అని గంభీరంగా అంది దుప్పి. అంతే, తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తి బోయింది.

ఈ కంగారులో అది పెద్దపులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులి ఉలిక్కిపడి, కిందపడింది. వెంటనే పైకిలేచి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది. 'బతుకున్న జీవుడా!' అనుకుంటూ, దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరొక దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకెప్పుడూ ఆ గుహ వైపు వెళ్లే సాహసం చేయలేదు.

కథ యొక్క నీతి: సమయస్ఫూర్తి మీకెంతటి ప్రమాదాన్నైనా తప్పించగలదు.

Responsive Footer with Logo and Social Media