దురాశకు దారి తప్పిన కోతి



అనగనగా ఒక చిన్న అడవి ఉండేది ఆ అడవిలో అన్ని జంతువులూ పక్షులో కలసి మెలసి ఉండేవి. అదే అడవిలో ఒక కోతి వుండేది దానికి చాలా మంది మిత్రులు ఉండేవారు అది అందరితో కలసి మెలసి ఆనందంగా ఉండేది, ఎవరితో గొడవ పడేది కాదు ఎవరైనా గొడవకు వెళితే వారికి దూరంగా వెళ్ళేది అలా వుండే కోతికి ఒక రోజు బంగారు రంగులో వుండే ఒక చిన్న పెట్టె ఒక చెట్టు తొర్రలో దొరికింది. దానిని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గాని అది తెరుచు కోలేదు.

ఇంతలో దానికి దాని తాత చెప్పిన ఒక విషయం గుర్తుకు వచ్చింది, అక్షయ పాత్ర అని ఒకటి ఉండేదని అది బంగారు వర్ణం లో ఉండేదని, దానిలో ఏ పదార్థం వేసినా అది అయిపోయేది కాదని తనకు అలాటిది దొరికితే జీవితం లో ఈ తిండి కష్టాలు ఉండవని చెప్పింది. అంతే కాకుండా దాని వల్ల అందరిలో గొప్పపేరు కూడా వస్తుంది అంది.

ఆ విషయం గుర్తు రాగానే కోతిలో ఎప్పుడూలేని భయం మొదలయింది. అమ్మో ఈ పెట్టకూడా అలాంటి అద్భుతమైందేమో,దీని గురించి నాకు వివరించడానికి నా సొంతవాళ్ళేవ్వరూ దగ్గరలో లేరు, ఇక్కడ ఆహారం బాగా దొరుకుతుందని ఇక్కడకు వలస వచ్చాను. దీన్ని వేరే ఎవరైనా చూస్తే నాదగ్గరనుండి లాక్కుంటారు, వారి అడవిలో దొరికింది కాబట్టి వారిదే అని అంటారు అనుకొని, ఎవ్వరూ చూడకుండా అక్కడనుండి మెల్లగా జారుకుందాం అనుకుంది.

అంతలోనే అక్కడకు దాని స్నేహితులు వచ్చాయి, ఓయ్..! మిత్రమా ఆడుకుందామా అన్నాయ్, అస్సలే ఈ పెట్టె కంగారులో వున్న కోతికి ఏమి సమాధానం చెప్పాలో అర్థంకాక వారు తన స్నేహితులనే విషయం కూడా మర్చిపోయి వారిని ఎలా అయినా అక్కడనుండి వెళ్లిపోయేలా చేద్దాం అనే ఉదేశ్యం తో ' నాకు మీకులాగా పని ఏమి లేదు అనుకున్నారా,నా పని చెడగొట్టడానికి వచ్చారు బుద్ధిలేకుండా అంది 'కోపంగా. కోతి మాటలు విని బాధపడిన వేరొక కోతి కోపంగా, మొదట మా స్నేహం కావాలని అభ్యర్థించింది నువ్వే, ఇన్నేళ్ళ మన స్నేహాన్ని ఇంత చులకన చేస్తావని మేము ఊహించలేదు ఇకపై మేమెవ్వరం నీస్నేహితులం కాము నువ్వు కూడా మా అడవిలో ఇంకెప్పుడు కనిపించకు అంది గట్టిగా.

ఆ మాటలు విన్న కోతి హమ్మయ్య! నాకు యిదే కావాలి అని ఎవ్వరూ చూడకుండా ఆ పెట్టె పట్టుకొని తన వారు వుండే అడవికి వెళ్ళింది. అక్కడ అందరి ముందు గొప్పగా చెప్పి పెట్టె ఉంచింది. అందరూకలసి అతి కష్టం మీద పెట్టె తెరిచారు.

దాని లోపల రాగి నాణాలు తప్ప ఏమీ లేక పోవడం చూసి ఖంగుతిన్న కోతి, అయ్యో...! ఈ నిరుపయోగమైన పెట్టెకోసం చక్కని ఆహారం యిచ్చే అడవిని మంచి స్నేహితులను ఒదులుకున్నానా అని బాధపడింది.

కథ యొక్క నీతి: దురాశ దుఃఖానికి చేటు, అంటే ఎక్కడో ఆనందం దొరుకుతుందని మన చుట్టూ వున్న వాళ్ళని నిర్లక్ష్యం చేయడం.

Responsive Footer with Logo and Social Media