ద్వైతవనానికి దుర్యోదనాదుల ప్రయాణం
కర్ణుని మాటలు విన్న దుర్యోధనుడు " మిత్రమా కర్ణా! నా అభిప్రాయం కూడా అదే. మనం ద్వైతవనానికి పోవడానికి దృతరాష్ట్రుడు అంగీకరించాలి కదా. ఇటీవల దృతరాష్ట్రుడు పాండవులను చూసి అంతులేకుండా భయపడుతున్నాడు. పాండవుల శౌర్యపరాక్రమాలను తలచుకుని కలత చెందుతున్నాడు. ఇందుకు పాండవ పక్షపాతి అయిన విదురుడు వారిని ప్రశంసిస్తూ వంత పాడుతున్నాడు.ద్రౌపదితో పాటు అరణ్యంలో కష్టపడుతున్న భీమార్జునులను చూడాలని వుంది. నారచీరలు, కాషాయ వస్త్రాలు, మృగ చర్మాలు ధరించిన పాండవులను ద్రౌపదిని చూస్తుంటే కలిగే అనందం ఈ భూమండలాన్నంతా పొందినా కలుగదు.
పరమౌక్రుష్టమైన రాజ్యలక్ష్మితో కూడిన నన్ను పాండవులు చూసి నప్పుడే గదా నా జీవితం సఫల మౌతుంది. కనుక దృతరాష్ట్రుడు మన ప్రయాణానికి అంగీకరించడేమో. నీవు శకుని ఏదైనా ఉపాయం ఆలోచించండి " అన్నాడు. మరునాడు కర్ణుడు దుర్యోధనుని వద్దకు వచ్చి " సుయోధనా! ద్వైత వనంలో మనకు ఆవుల మందలు ఉన్నాయి కదా. వాటిని చూచు నెపంతో దృతరాష్ట్రుని అనుమతి తీసుకుంటాము " అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని అభిప్రాయంతో తన అభిప్రాయం అదేనంటూ ఏకీభవించాడు. వెంటనే వారు సమంగుడనే గొల్లవాడిని పిలిపించి దృతరాష్ట్రునితో ఎలా మాట్లాడాలో నేర్పించారు.
ఆ తరువాత ముగ్గురూ దృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అంతలో వారు ఏర్పాటు చేసిన గొల్లవాడు వచ్చి దృతరాష్ట్రునితో " మహారాజా! నేను ద్వైతవనం నుండి వచ్చుచున్నాను అక్కడ ఇప్పటి వరకూ క్షేమంగా ఉన్న మన ఆవులకు ఇటీవల క్రూరమృగాల బెడద ఎక్కువయినది. మీరు సత్వరం తగు చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాను " అన్నాడు.
శకుని కర్ణుడు చేరి గోపాలుని మాటలు సత్యమని, గోవులను దూడలను లెక్కించడానికి ఇది తగిన సమయ మనిపిస్తున్నది, కావున సుయోధనుని గోసంరక్షణార్ధం ద్వైతవనానికి పంపమని నమ్మ పలికారు. ధృతరాష్ట్రుడు " గోసంరక్షణ చేయడం మంచిదే. కానీ కర్ణా! అక్కడ పాండవులు ఉన్నారు. వారిని మనం మోసంతో ఓడించాము.అరణ్యంలో వుంటూ వారు కష్టాలు పడుతున్నారు.నిత్యము వారు తపస్సు నాచరిస్తూ వారు శక్తిని గూడా పెంచుకున్నారు. మీరు అక్కడికి వెళ్ళి పాండవులను అవమానిస్తారు. వారు ఇప్పటికే మీచే అవమానించబడి ఉన్నారు.
ధర్మరాజుకు కోపం రాక పోవచ్చు కానీ భీముడు కోపిష్టి. ద్రౌపది సాక్షాత్తు నిప్పు రవ్వే. మీ మీద ఆగ్రహించి ఉన్న భీముని రెచ్చగొట్టడం మంచిది కాదు. అర్జునుడు ఇంద్రలోకం వెళ్లి దివ్యాస్త్రాలను పొందాడు. ఏ అస్త్రాలు లేకుండానే గతంలో భూమిని జయించాడు. ఇప్పుడు అమోఘమైన అస్త్రసంపద సాధించిన అర్జునుని ఎదిరించడం క్షేమంకాదు. మిమ్ములను చంపి తీరుతాడు.కాబట్టి నా మాట విని మీరంతా మీ మీ నివాసాలలో ఉండండి. గోసంరక్షణకు సమర్దులైన వారి నంపుదాం.
మీరు వెళ్ళద్దు " అన్నాడు. ఆ మాటలకు శకుని "మహారాజా! పాండవులు అమిత శౌర్య పరాక్రమాలు కలవాళ్ళు. వారికి మేము హాని ఎలా తలపెడతాము. మేము అలా చేసినా ధర్మాత్ముడైన ధర్మరాజు ఆడిన మాట తప్పడు. అతని తమ్ములు అతని మాట జవదాటరు. మాకు కూడా వేటాడవలెనని కోరిక కలిగినది. మాకు అనుజ్ఞ ఇమ్ము. మేము ఆవులను మాత్రం రక్షిస్తాము. అసలు పాండవులు ఉన్న చోటికి వెళ్ళనే వెళ్ళము. " అని నచ్చచెప్పాడు. ధృతరాష్ట్రుడు తనకు ఇష్టము లేకున్నా చివరకు అంగీకరించాడు. వెంటనే దుర్యోధనుడు ఎనిమిది వేల రధాలు, ముప్పయి వేల ఏనుగులు, ఎన్నో వేల సైనికులతో కలిసి భార్యలతో సహా ఘోషయాత్రకు బయలు దేరాడు.