దొంగల ఆటకట్టు!



పార్వతీపురాన్ని పాలించే వీరవర్మకు మంచి పేరుంది. ఒకానొక సమయంలో రాజ్యంలో దొంగల బెడద ఎక్కువైంది. దొంగతనాలను ఎలా అరికట్టాలో తెలియక మంత్రితో సమాలోచనలు చేశాడు రాజు. 'ప్రభూ, ఇదంతా వేరే రాజ్యానికి చెందిన వారి పనేనని కచ్చితంగా చెప్పగలను. కాబట్టి, ఇక్కడికి కొత్తగా వచ్చేవారు పేదరాశి పెద్దమ్మనే ఆశ్రయిస్తుంటారు,' అన్నాడు మంత్రి. 'అయితే, భటులను మారువేషాల్లో అక్కడికి పంపి వాకబు చేయించండి,' ఆదేశించాడు రాజు.

రెండు రోజులు గడిచాక, మారువేషాల్లో పేదరాశి పెద్దమ్మ వసతి గృహానికి వెళ్లిన భటులు ఓ నివేదిక తెచ్చారు. ఆమె కొన్ని పావురాలను పెంచుతున్నట్టు, వాటిని అక్కడ ఉండే వారు ఇళ్లకు తమ క్షేమ సమాచారం పంపించుకునేందుకు అద్దెకు ఇస్తుంటుందని అందులో సారాంశం. ఆ మాటలతో రాజుకో అనుమానం వచ్చింది. తన దగ్గరున్న చిలుక సహాయంతో ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని మంత్రితో కలిసి భావించాడు.

మర్నాడు మారువేషంలో పేదరాశి పెద్దమ్మ వసతి గృహానికి వెళ్లాడు రాజు. అప్పటికే పెద్దమ్మ పావురాలకు గింజలు చల్లుతూ కనిపించింది. 'పావురాలంటే అంత ఇష్టమా?' అడిగాడు మంత్రి. 'ఆ ఇష్టమే, ఎందుకూ అంటే ఇవి మామూలు పావురాలు కావు,' అంటూ గొప్పగా చెప్పుకొంది పెద్దమ్మ. 'మా దగ్గరున్న చిలుక కూడా సామాన్యమైంది కాదు. దానికి ప్రత్యేకత ఉంది,' అన్నాడు రాజు. 'ఏమిటా ప్రత్యేకత?' అడిగింది పెద్దమ్మ.

'చిలుకమ్మా, నీ ప్రతిభ ఏంటో చూపించు,' అని రాజు అనడంతో, 'మీ పేరు చెప్పండి?' అంటూ పెద్దమ్మను అడిగింది చిలుక. పెద్దమ్మ ఆశ్చర్యపోతూ తన పేరు చెప్పింది. వెంటనే 'పెద్దమ్మ గారికి నమస్కారం,' అంది చిలుక. 'భలే భలే, మాట్లాడే చిలుకా? మీరూ నాలాగే పక్షి ప్రేమికుల్లా ఉన్నారే. ఈ చిలుకను నాకు అమ్ముతారా?' అడిగిందామె. 'మాకు దీన్ని అమ్మే ఉద్దేశం లేదు. మాది పొరుగు దేశం. వేరే పని మీద చాలాదూరం వెళ్లాల్సి వచ్చింది. కొద్దిరోజులు మీరు దీని సంరక్షణ చూడాలి. అందుకు కొంత డబ్బు కూడా చెల్లిస్తాం,' అన్నాడు రాజు.

'అలాగే, మీ క్షేమ సమాచారాలు ఇంటికి పంపించుకోవాలంటే ఈ పావురాలను ఉపయోగించుకోండి,' అంది పెద్దమ్మ. 'ఇప్పుడా అవసరం లేదు కానీ, తిరిగొచ్చాక వాటి సేవలను వినియోగించుకుంటాం,' అని పంజరంతోపాటు చిలుకను అప్పగించి వెళ్లిపోయారిద్దరూ.

వసతి గృహం గుమ్మం ముందు ఆ పంజరాన్ని ఉంచింది పేదరాశి పెద్దమ్మ. అక్కడికి వచ్చేవారందరి పేర్లూ అడిగి పలకరిస్తుండేది చిలుక. అయిదారు రోజుల తర్వాత మారువేషాల్లోనే రాజు, మంత్రి అక్కడికి మళ్లీ వెళ్లారు. 'మా ప్రయాణం పూర్తయ్యింది. రెండు రోజులు ఇక్కడే ఉంటాం. వసతి ఏర్పాట్లు చేయండి. ఈలోగా మా క్షేమ సమాచారాలను ఇంటికి చేరవేసేందుకు ఓ పావురం కావాలి,' అని పెద్దమ్మను అడిగాడు రాజు.

పంజరంలోని చిలుకతోపాటు ఓ పావురాన్ని కూడా అప్పగించిందామె. దగ్గరుండి వసతి గదిని కూడా చూపించింది. గదిలోకి వెళ్లిన వెంటనే 'ఇక్కడికి తరచూ వస్తున్న వ్యక్తి పేరేంటి?' అని చిలుకని అడిగాడు వీరవర్మ. 'సూరిబాబు,' అంటూ టక్కున జవాబిచ్చిందది.

ఆ తర్వాత మంత్రితో సమాలోచనలు జరిపాడు రాజు. ఆ పావురాన్ని మచ్చిక చేసుకుంటూ గింజలు వేయసాగారు. మరుసటి రోజు రాజ్య ఖజానాకు మార్గాన్ని తెలుపుతూ ఓ తప్పుడు చిత్రపటాన్ని గీశారు. దాన్ని పావురం కాలికి కట్టి, 'వచ్చే అమావాస్య రోజు రాత్రికి వచ్చి పని ముగించుకోండి. ఇట్లు, సూరిబాబు,' అని రాసిన లేఖనూ దానికి జతచేసి పొరుగు రాజ్యం దిశగా వదిలేశారు.

రెండు రోజులు గడిచాక, పావురం తిరిగి వచ్చి, వీరవర్మ మీద వాలింది. దాని కాలికి ఉన్న లేఖను తీసి చూశాడు. 'నువ్వు పంపించిన చిత్రం అందింది. ఖజానా కొల్లగొట్టిన తర్వాత నీ వాటా నీకు ఇస్తాము,' అని అందులో రాసి ఉంది. రాజు అనుమానం నిజం కావడంతో ఇద్దరూ పేదరాశి పెద్దమ్మ దగ్గర సెలవు తీసుకుని కోటకు వెళ్లిపోయారు.

కొద్ది సేపటికే వసతి గృహానికి భటులు వచ్చి, సూరిబాబు గురించి ఆరా తీశారు. అతడి రాక కోసం ఎదురుచూసి, రాగానే చాకచక్యంగా బంధించారు. అమావాస్య రోజు రానే వచ్చింది. అప్రమత్తమైన భటులు చిత్రంలో ఉన్న మార్గంలో కాపు కాయసాగారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో దొంగల ముఠా అక్కడకు వచ్చింది. భటులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. సూరిబాబు ఉన్న కారాగారంలోనే వారినీ ఖైదు చేశారు.

'సూరిబాబూ, నువ్వెలా పట్టుబడ్డావు?' అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు దొంగల నాయకుడు. 'అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. అయినా ఎలా దొరికిపోయానో నాకూ అర్థం కావడం లేదు. మరి మీరూ?' అని అడిగాడు సూరిబాబు. 'నువ్వు పావురం ద్వారా పంపిన లేఖ ఆధారంగా వచ్చి పట్టుబడ్డాం,' అన్నాడు దొంగల నాయకుడు. 'నేనే పంపలేదు. ఎవరో తెలివిగా మన వేలితోనే మన కళ్లలో పొడిచినట్లున్నారు,' అంటూ వాపోయాడు సూరిబాబు.

'అబద్ధం, అవినీతి, దొంగతనం.. ఒకరోజు కాకపోయినా మరోరోజైనా బయటపడుతుందని మన పరిస్థితి చూస్తే తెలుస్తుంది,' అంటూ దిగులుపడ్డాడు దొంగల నాయకుడు. ఇంతలో భటులు వచ్చి, వారి వద్దనున్న సొత్తును స్వాధీనం చేసుకొని, బాధితులకు అందించారు. దాంతో పోయిందనుకున్న సొమ్ము తిరిగి దక్కినందుకు వారంతా రాజుకు జేజేలు పలికారు.

కథ యొక్క నీతి: అబద్ధం, అవినీతి, దొంగతనం ఎప్పటికైనా బయటపడుతాయి, నిజాయితీనే శాశ్వతమైన గుణం.

Responsive Footer with Logo and Social Media