ద్రౌపది ధర్మరాజు సంభాషణ
ఒకరోజు ద్రౌపది ధర్మరాజుని చూసి " దృతరాష్ట్రుడు తన కొడుకు మాటవిని మిమ్మల్ని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. కాని అతనికి మీ మీద కోపం పోయిందా. పోదు ఎందుకంటే అతని హృదయం పాషాణం. తన కొడుకు మిమ్మల్ని నిష్టూరంగా మాట్లాడినప్పుడు అతడు వారించ లేదు. రాజభోగాలు అనుభవించ వలసిన మీరు అడవులలో కష్టాలు పడుతున్నారు. ఇది నేను భరించలేను. ఆ ధృతరాష్ట్రుడు లాగా బ్రహ్మదేవుడు మీకు శత్రువైనాడా ఏమి? " అని బాధపడి
మళ్ళీ " నీ ఆజ్ఞానువర్తనులైన నీ తమ్ములు తమ పరాక్రమం విడిచి ఉన్నారు.
నాడు సామంతుల కిరీట కాంతులతో ఎర్రబడ్డ మీ పాదాలు నేడు బండ రాళ్ళ మీద నడచి ఎర్రబడ్డాయి. అనేక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మీరు కందమూలాలు తింటున్నారు. ఇట్టి దుర్దశలో కోపం విడిచి పెట్టడం తగదు కదా. అమిత బలశాలి భీముడు కందమూలాలు తిని చిక్కి పోయాడు. ధనుర్విద్యా పారంగతుడు అర్జునుడు అడవి జంతువుల మధ్య తిరుగుతున్నారు. వారిని చూసి కూడా ఓర్పు వహిస్తున్నారా? క్షమను తేజస్సును సమయానుకూలంగా ఉపయోగించని రాజు ప్రజల మన్నన పొందజాలడు అనే కథ మన ఇతిహాసంలో ఉంది .
పూర్వం బలి చక్రవర్తి క్షమ గొప్పదా ? తేజస్సు గొప్పదా ? అని తన తాత అయిన ప్రహ్లాదుని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు అన్ని సమయాలలో క్షమ పనికిరాదు. అలాగే సదా ప్రతాపం చూపకూడదు రెండూ సమపాళ్ళలో చూపాలి. ఎప్పుడూ క్షమిస్తుంటే సేవకులు పనిచేయరు యజమానిని గౌరవించరు. ఎక్కువ కర్కశంగా ఉంటే ప్రజా కంటకుడౌతాడు " అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఒక తప్పు చేస్తే క్షమించవచ్చు కానీ అదేపనిగా తప్పులు చేస్తున్న కౌరవులను క్షమించ వచ్చునా? కనుక ఇది పరాక్రమం, తేజస్సు చూపించ వలసిన సమయం " అన్నది.
అందుకు ధర్మరాజు " ద్రౌపదీ! కోపం మహాపాపం. కోపం కలవాడు కర్తవ్యం విస్మరిస్తాడు. చంపకూడని వారిని చంపుతాడు. కోపం వదిలిన వాడు తేజోవంతుడు అవుతాడు. క్షమ కలవాడికి విజయం సిద్ధిస్తుంది. దుర్యోధనునికి క్షమా గుణం లేదు కనుక అతడు పతనం కాక తప్పదు " అన్నాడు. అందుకు ద్రౌపది " ఓ అజాత శత్రువా! నీవు ధర్మంతో వర్ధిల్లుతున్నావు. కానీ క్షమ శత్రువుల వద్ద తగునా? వంచకుల పట్ల వంచనతో ప్రవర్తించాలి ఓ బ్రహ్మదేవా! నీవు వంచకులకు అభ్యుదయాన్నిచ్చి, ధర్మాత్ముల సంపద పోగొడుతున్నావా? వంచకులు నీకు బంధువులు, ధర్మాత్ములు శత్రువులా? " అని నిర్వేదంతో పలికింది.
ధర్మరాజు " ద్రౌపదీ! నీవు నాస్తికురాలి వలె మాట్లాడుతున్నావు. అది తప్పు కదా? ధర్మాత్ములైన మార్కండేయ, వ్యాస, నారదాది మహా మునులు ధర్మాత్ముడనని నన్ను గౌరవిస్తున్నారు. ఇతరులు నా పట్ల అధర్మంగా ప్రవర్తించినా నేను ఎందుకు ధర్మం తప్పాలి? పుణ్యకార్యాలకు ఫలితం లేకుంటే మునిజనాలు వాటిని ఎందుకు ఆచరిస్తారు. నీవు దుష్టద్యుమ్నుడు పుణ్య ఫలమున పుట్టిన వాళ్ళు కదా " అన్నాడు.
ద్రౌపది " కర్మఫలానికి విధి కారణం కాదు అనే దానిని కాదు. కాని కర్మ చేయడం మానవ ధర్మం కదా? కర్మ ఫల ప్రాప్తికి మనుష్య ప్రయత్నం తరువాత దైవ బలం సమకూరాలి. పురుషుడు సంకల్పించి తరువాత ప్రయత్నం చేయాలి అప్పుడు దైవం సాయం చేస్తాడు.
నువ్వు గింజలో నూనె ఉన్నా, కర్రలో నిప్పు ఉన్నా పురుష ప్రయత్నం లేని ఎడల నూనె రాదు, నిప్పు పుట్టదు కదా? పురుష ప్రయత్నం లేకుండా దైవాన్ని, ధర్మాన్ని నమ్ముకుంటే ఫలితం ఉంటుందా? కనుక మీ తమ్ముల పరాక్రమం ఉపయోగించి లక్ష్యమును నిర్ణయించి ఫలసిద్ధి పొందమని నా ప్రార్ధన " అన్నది.