ధృతరాష్ట్రుని చింత



భూలోకంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించిన విషయం వ్యాసుని వలన తెలిసి కలత చెందాడు. సంజయుని పిలిచి " సంజయా! అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనాన్ని దహించాడు. నాలుగు దిక్కులు జయించి ధర్మరాజుతో రాజసూయం చేయించాడు. పరమశివుని మెప్పించి పాశుపతం పొందాడు. అలాంటి అర్జునుడు ఉండగా పాండవులను జయించడం ఎలా? వారు ధర్మవర్తనులు వారిని విజయలక్ష్మి వరిస్తుంది. పరుషంగా మాట్లాడి కర్ణుడు చేసిందేముంది.

ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభకు లాక్కురావడమే ఇంతటి వైరానికి దారి తీసింది. ఇప్పటికీ మందభాగ్యుడైన నాపుత్రుడు దుర్యోధనుడు ఊరుకోవడం లేదు. అర్జునుడి పరాక్రమం చాలా ఆశ్చర్యంగా వుంది. అతడు మహాదేవుడితోనే బహుయుద్ధం కూడా చేసాడని విన్నాను " అన్నాడు. సంజయుడు " సుయోధనుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించే సమయంలో వారిని వారించకుండా ఇప్పుడు వగచి లాభం ఏమి? పాండవులు ఇప్పుడు కామ్యకవనంలో ఉన్నారు.

శ్రీకృష్ణుడు అనేక మంది రాజులను వెంట పెట్టుకుని కామ్యక వనానికి వెళ్ళి పాండవులను పరామర్శించాడు. సుయోధనుని జయించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేస్తానని అన్నాడట. అంత ధర్మరాజు "పదమూడు సంవత్సరములు గడచిన తర్వాత వారిని వారి బంధువులతో కూడా సంహరించు. నేను రాజులందరిలో చేసిన వనవాస ప్రతిజ్ఞను భంగం చేయకు" మని ప్రార్ధించగా ద్దృష్టద్యుమ్నాదులు కృష్ణుడిని సముదాయిన్చారట. మిగిలినవారు వారించి అర్జునునికి సారథ్యం వహించమని అన్నారట. శ్రీకృష్ణుని సాయంతో అరణ్య అజ్ఞాత వాసాలు పూర్తి అయ్యాక నీ కొడుకుతో యుద్ధం చేస్తారు. నీ కొడుకులు అర్జునిని దివ్యాస్త్రాలకు, భీముని గదాఘాతాలకు తట్టుకోగలరా? " అన్నాడు సంజయుడు.

ధృతరాష్ట్రుడు " నేనేం చేసేది సంజయా ! నేను ముసలి వాడిని. నా కొడుకు నా మాట వినడు. వాడు ఒక దుర్బుద్ధి. వాడికి భీష్మ, ద్రోణుల మాటలు నచ్చవు. ఆ కర్ణుని, శకుని మాటలు నచ్చుతాయి. నేనేం చేయుదును " అని పరితపించాడు. ధర్మరాజు కామ్యకవనంలో అర్జునుని కోసం ఎదురు చూస్తున్నాడు. భీముడు " అన్నయ్యా! నువ్వే కదా అర్జునిని తపస్సుకు పంపింది. మన బతుకులన్నీ అర్జునుని మీద ఆధారపడి ఉన్నాయి. మీరు వెంటనే శ్రీకృష్ణుని పంపి అర్జునుని వెంటనే తీసుకు రమ్మని చెప్పండి. నేను అర్జునుడు శ్రీకృష్ణుని సాయంతో దుర్యోధనాదులను జయించి నిన్ను కౌరవ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాము.

రణరంగంలో నన్ను, అర్జునిని ఎదిరించే వారు లేరు" అన్నాడు. అందుకు ధర్మరాజు " భీమసేనా! ఆ విషయం నాకు తెలియును. కాని యుద్ధానికి ఇది సమయం కాదు. పదమూడు సంవత్సరాల తరువాత నీవు, అర్జునుడు శత్రువులను జయించండి. విజయులు కండి. నిండు సభలో కౌరవులతో చేసిన ఒప్పందానికి నేను విరుద్ధంగా ప్రవర్తించను " అన్నాడు ధర్మరాజు.

Responsive Footer with Logo and Social Media