ఎవరు జూదగాడు?



హేలాపురిలో ఒకప్పుడు ధనంతో జూదం ఆడటం పెద్ద నేరంగా పరిగణింపబడేది. ధనం ఒడ్డి జూదం ఆడుతూ రక్షక భటులకు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించబడేది. ఒకసారి ఓ నలుగురు ఆసాములు రచ్చబండ దగ్గర, ధనం ఫణంగా పెట్టి మేక-పులి జూదం ఆడుతుండగా రక్షక భటులు వాళ్లను బంధించి న్యాయాధికారి వద్ద ప్రవేశపెట్టారు.

‘అయ్యా నేనసలు జూదం ఆడలేదు. ఆడుతున్న వాళ్లను చూస్తూ, అక్కడ ఉన్నాను అంతే. సత్యప్రమాణంగా’ అన్నాడు ఆ నలుగురిలో ఒక వ్యక్తి వినమ్రంగా. ఆ విషయం నమ్మిన న్యాయాధికారి ఆ వ్యక్తిని విడుదల చేశాడు.

‘అయ్యా, నేను మన సేనాధిపతి గారి దగ్గరి బంధువునండి, ఈసారికి క్షమించి వదిలే యండి.’ అని మరో వ్యక్తి ప్రాధేయపడగా అతన్ని కూడా విడుదల చేశాడు న్యాయాధికారి. మూడో వ్యక్తి న్యాయాధికారి మిత్రుడి కుమారుడిగా రుజువు కావడంతో అతను కూడా విడుదలైపోయాడు.

న్యాయాధికారి, నాలుగోవ్యక్తి వైపు తిరిగి ‘ధనంతో జూదమాడటం నేరమని నీకు తెలియదా? నీకు మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను, ‘ అన్నాడు తీవ్రంగా. ‘అయ్యా, అసలు నేను ఎవరితో జూదమాడేనో చెప్పగలరా?’ అని ప్రశ్నించాడు ఆ నాలుగో వ్యక్తి. న్యాయాధికారి నోట్లో పచ్చివెలక్కాయ పడినట్లయింది. నాలుగో వ్యక్తి కూడా విడు దలయ్యాడు.

కథ యొక్క నీతి: న్యాయం చేయడంలో వాస్తవం మరియు నిజం అనేవి ముఖ్యమైనవి.

Responsive Footer with Logo and Social Media