గొల్లవాడు-విద్వాంసుడు



ఒక వూల్లో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు చాలా రాగాలు వచ్చునట. ముఖారిలాటి ఏడుపు తెప్పించే రాగాలు మరీ బాగా పాడగలడట. మరి, ఇంత గొప్ప విద్వాంసుడు మారు మూల పల్లెటూరిలో ఉండటంచేత, ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయినయి. అందుకని, దగ్గరనే పట్టణంలో వుండే రాజుగారి దర్శనం చేసుకొని, పాటకచేరీ పెట్టించి, గొప్ప బహుమతీ పొందుదామని ఆయన బయలుదేరాడు.

దారిలో ఒక అడవి ఉన్నది. పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి. విద్వాంసుడు అడవికి చేరి ఎండగా వుంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టుక్రింద కూర్చున్నాడు. ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ అటువచ్చాడు. అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన వచ్చింది: “ఈయనచాలా ధనవం తుడై ఉండాలి. లేకుంటే అబ్బో, ఇన్ని వందల గొర్రెలను ఎలా సంపాయించ గలడు? మచ్చుకి రెండు రాగాలు పాడి, ఈయనని మెప్పించినట్టయితే ముందు ఇక్కడే బహుమతి పుచ్చుకోవచ్చు ” అని ఆశపడి, విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు.

విద్వాంసుడు పాడుతూవుంటే, సంతో షించటానికి బదులు, గొర్రెలకాపరి ఏడుపు మొదలెట్టాడు. ఇది చూచి విద్వాంసుడు “ఈయన శ్రీమంతుడే కాదు, శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను. కనుకనే నాపాటలో స్వారస్యం కనిపెట్టి కళ్ల నీళ్లు పెట్టుకొంటున్నాడు ” అని తలిచి యింకా గొంతెత్తి పాడుతున్నాడు. విద్వాంసుడు పాడినకొద్దీ గొర్రెల కాపరి దుఃఖం అంతకంతకు ఎక్కువవుతున్నది.

ఈ యేడుపేమిటో అర్థంగాక, విద్వాంసుడు పాడటం ఆపివేశాడు. “ఏమండి స్వామీ! నేను పాడిన పాటవల్లనే మీకు హృదయం కరిగి, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారా? ఏమిటి కారణం ? ” అని గొర్రెల కాపరిని అడిగాడు.

గొర్రెలకాపరి యేడుపు దిగమింగి, “అది కాదయ్యా. నువు పైకి లక్షణంగానే కనపడుతున్నావు. ఏ లోటూ లేని ఇటువంటి వాడు ఇందాకటినుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకుని నీతోపాటు నేనూ ఏడుస్తున్నాను” అని సమాధానం చెప్పాడు.

“నాకు ఏ లోటూ లేదంటారా ? డబ్బు లేక నేను ఎంతబాధపడుతున్నానో మీకేం తెలుసు? ఏదో గొప్పవారు, పండితులు, రెండు రాగాలు పాడితే మెచ్చుకుని బహుమతి యిస్తారని నే నాశపడుతూ వుంటే, ఇదేమీ ఏడుపండి, అర్థంలేని యేడుపూ?” అని విద్వాంసుడు మనస్సులో బాధ బయటపెట్టాడు.

అప్పటికీ గొల్లవాడి దుఃఖం ఆగలేదు. ఇంకా ఏడుస్తూనే ” అర్థంగాక పోవడ మేమిట స్వామీ! నిన్నటి రోజు న నా మందలో ఒక గొర్రె నీలాగనే వెర్రి కేకలు పెట్టి చచ్చిపూరుకుంది. నీపని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి, యేడుస్తున్నానయ్యా” అని బదులు చెప్పాడు.

“అయ్యో, నా తెలివి కాలా! నా సంగీత మంతా చివరికి అడవికాచిన వెన్నెల మోస్తరు అయిందే! ఈ మూర్ఖుడికి నాపాట వినిపించి గొంతుకంతా పాడుచేసికొన్నాను” అని గొణుగుకొంటూ, విద్వాంసుడు తన దారిని తను పోయాడు.

కథ యొక్క నీతి: అన్యోన్యంగా చూసినప్పుడు, మనం పరిగణించని విషయాలు పరస్పరం విభిన్నంగా అర్థం కావచ్చు.

Responsive Footer with Logo and Social Media