హస్థినా పురం
హస్థినా పురంలో ధృతరాష్ట్రుడు విదురునితో " విదురా పాండవులు ఏమి చేస్తుంటారు " అని అడిగాడు. దానికి విదురుడు " పాండవులు దైవసంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నీవు విన లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకుని సుయోధనుని విడిచి పెట్టు. ద్రౌపదికి, భీమునికి దుశ్శాశనునితో క్షమాపణలు చెప్పించు అన్నాడు.
ఆ మాటలకు దృతరాష్ట్రుడికి కోపం వచ్చి " సుయోధనుడు నా కన్న కొడుకు వాడిని నేను ఎలా వదలను. నీకు నాకొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కర లేదు. నీవు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడి వెళతావో నీ ఇష్టం " అన్నాడు. వెంటనే విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెద నాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. ధ్రుతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది.
విదురుని విడిచి ఉండ లేక విదురుని కొరకు సంజయుని పంపాడు. సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకు వచ్చాడు. దృతరాష్ట్రుడు " విదురా ! నీవు నీతి మంతుడవు. నాకు బుద్ధి లేదు. అందుకే నిన్ను వెళ్ళగొట్టాను నన్ను క్షమించు " అన్నాడు. విదురుడు "ధ్రుతరాష్ట్రా! నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహా పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు " అన్నాడు.
విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడికి నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాశనులతో చర్చిస్తూ " పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, ధ్రుతరాష్ట్రుడు కలసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేయాలి? " అన్నాడు. శకుని " సత్య సంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగిరారు. ఆ భయం నీకు వద్దు " అన్నాడు. కర్ణుడు " ఈ అండను చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము.
శత్రుశేషం లేకుండా చేద్దాం " అన్నాడు. కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇది తెలిసి వ్యాసుడు ధ్రుతరాష్ట్రుని వద్దకు వచ్చి " నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య, అజ్ఞాత వాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు తొందరెందుకు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " మహత్మా! నన్ను ఏమి చెయ్యమంటారు. జూదం వలన చెడు జరిగింది. నేను పుత్ర వాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను " అన్నాడు.
వ్యాసుడు " ధ్రుతరాష్ట్రా! పుత్ర వాత్సల్యం ఉండవలసిందే కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు" అన్నాడు.ధృతరాష్ట్రుడు " అయ్యా! వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి " అన్నాడు. వ్యాసుడు " మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెబుతాడు " అని వెళ్ళి పోయాడు.