ఇంద్రియ నిగ్రహం
కౌశికుడు ధర్మవ్యాధుని " ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించకుంటే కలిగే పాపం ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించడం వలన కలిగే పుణ్యం ఏమిటి? " అని అడిగాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో " మనం మనసుతో విషయాలను గ్రహిస్తాము. మనస్సు ఎప్పుడూ కోరికలతో, కోపముతో నిండి ఉంటుంది. వాటి వలన లోభం ఏర్పడుతుంది. లోభంతో ఏర్పడిన విషయ వాంఛల వలన మానవుడు సదా సతమతమౌతుంటాడు. లోభికి కరుణ లోపించి పాపములతో కోరికలు తీర్చుకుంటాడు. మంచి మా టలు చెవికెక్కవు.
దుర్మార్గులతో చెలిమి చేస్తాడు. చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు. అలాంటి వాడు దుఃఖంలో మునిగి తేలుతుంటాడు. కనుక మానవులు విషయ వాంఛలకు లొంగక జ్ఞానమార్గం అవలంభించి మోక్షప్రాప్తికి ప్రయత్నించడం ఉత్తమం " అన్నాడు. " మహాత్మా! ఇంద్రియములను నిగ్రహించడం ఎలా? అని నన్ను అడిగారు.
బ్రహ్మకోవిదులు చెప్పతగిన బ్రహ్మ విద్య గురించి నేను చెప్పకూడదు. కాని బ్రాహ్మణోత్తముడివి అడిగావు కనుక బ్రహ్మ కోవిదులకు నమస్కరించి చెప్తాను సావధానంగా విను. అనంతాకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనేవి పంచ భూతములు. మరలా భూమి నీటిలోను, గాలి అగ్ని లోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోను లీనమౌతాయి. మొదట ఆకాశానికి హద్దులు లేని అనంతాకాశం. అంతా చీకటి, శూన్యము. ఆ ఆకాశంలో నుండి ప్రచండ వాయువు, ఉధృతమైన గాలి ఆగాలిలోని ధాతు సంయోగంతో నీరు పుడుతుంది. ఆ నీరు ఘనీభవించి మంచుఖండాలు, ధూళి మేఘాలు ఏర్పడతాయి. అవి శిలా రూపం చెంది భూమి ఏర్పడుతుంది. మరలా అదే క్రమంలో ప్రళయ కాలంలో సముద్రాలన్నీ ఏకమై భూమి జలమయమౌతుంది. అనావృష్టి ప్రారంభమై ఎండలు అధికమై ఆ ప్రంచండాగ్నికి నీరు ఆవిరై వాయు రూపం పొంది ఆకాశంలో లయమౌతుంది. చెవితో వినడం, నాలుకతో రుచి చూడటం, కంటితో చూడటం, ముక్కుతో వాసన చూడటం పంచేద్రియాలు చేసే పనులు. అంటే పంచ భూతముల గుణములైన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు ఇంద్రియవిషయాలు.
పంచేద్రియములకు మూలం మనసు. మనసు ఆరవది, బుద్ధి, అహంకారం మనసుకు తోడు మొత్తం ఎనిమిది. సత్వ, రజో, తమో గుణాలు మానవులకు సహజం. ఈ భూత ప్రపంచం అవ్యక్తము నుండి సృష్టింపబడి అవ్యక్తంలో లీనమౌతాయి. అవ్యక్తమనగా వ్యక్తముకానిది. కాని పంచేద్రియాలకు ఈ అవ్యక్త రూపం దైనందిన కార్యాలలో గోచరమౌతూ ఉంటుంది. అది నిరాకారమైన మనో భావనలో వివిధ రూపాలలో గోచరమౌతుంది. మానవులు పంచ గుణాలకు వశుడై భోగలాలసుడౌతున్నాడు. మానవుడు పంచేద్రియాలను అదుపులో పెట్టుకుని జీవిస్తూ జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానం కలిగిన వాడు అన్ని భూతాలలో తనను చూసుకుంటాడు.
విషయవాంఛల నుండి మనసుని మళ్ళించడమే తపస్సు, వైరాగ్యం. ఇంద్రియముల నివారించిన స్వర్గం ఇంద్రియములకు లొంగి పోయిన నరకం. కోరికలతో సతమమయ్యే మనసును అదుపులో పెట్టుకోవడమే మోక్షం. దేహం రథమైతే ఇంద్రియాలే గుర్రాలు ఆత్మ సారథి, ధైర్యం పగ్గాలు. మానవుడు మనసును నిగ్రహించి ధైర్యమనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపు చేస్తూ మోక్షమనే గమ్యాన్ని చేరాలి. ఇంద్రియము పోవు చోటుకు మనసు పోతుంది కనుక ఇంద్రియములను అదుపు చేస్తూ జ్ఞాన యోగి సాగాలి.