కాకి గర్వం
అనగనగా ఒక చిట్టడవి లో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరు ఎగరలేరని మిడిసి పడుతుండేది.
ఓ రోజు కాకి ఏమి ఉబుసు పోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్నా పిచ్చుక ని ఆపి, నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గెంటినట్టే ఉంది. అని వేళాకోళ మాడింది.
ఆ మాటలకి పిచ్చుకకి కోపం వచ్చి, నేను నీ లాగే ఎగరాల్సిన అవసరం లేదు. ఎవరి సామర్థ్యం వాళ్లది అన్నది. అయితే నాతో పందెం కాసి మీ సామర్థ్యం తో ‘నన్ను ఓడించు చూద్దాం’! అంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంది. అక్కడున్న పక్షులంతా న్యాయనిర్ణేతగా ఉంటామన్నాయి.
ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టు తో మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రిచెట్టు ను దాటుకుని మళ్లీ ఇక్కడికి రావాలి. ముందుకొచ్చే వాళ్లే విజేత. అని ప్రకటించాయి.
పందెం మొదలైందో లేదో, కాకి సరున రావి చెట్టును దాటి మర్రి చెట్టు లోకి దూసుకెళ్లింది. ఆ మర్రి చాలా పెద్దది లెక్కలేనన్ని ఊడలతొ దట్టంగా ఉంది. దాంతో రెక్కలు రెండు, సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడి పోయింది.
పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వలన కొమ్మల్లో కి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది.
పిచ్చుక కోరికమేరకు వడ్రంగి పిట్ట ఒకటి వచ్చి ఊడలని మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదని తెలుసుకున్న కాకి ఇంకెప్పుడూ గర్వపడలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు.
కథ యొక్క నీతి: గర్వం మనకు సమస్యలను తెస్తుంది. ప్రతి ఒక్కరికి తమతమ ప్రత్యేకతలు ఉంటాయి. గౌరవం మరియు వినయం కలిగి ఉండాలి.