కాకరకాయ రుచి



అనగనగా ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒక సారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు. అతనికి ఆ కూర చాలా నచ్చింది. అప్పట్లో కాకరకాయ అంత సులువు గా దొరికేది కాదు.

అందుకనే కష్ట పడి, విత్తనాలు సంపాదించి, అవి నాటి, కాకర పాదుని భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు. అవి ఎంతో సరదాగా కోసుకుని, జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు.

ఇంట్లో అతని పెళ్ళానికి కాకరకాయలు ఇచ్చి, వాటిని ఉల్లిపాయతో కూరి, బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు.

మరునాడు తెల్లారుజామునే లేచి పొలానికి వెళ్లి పోయాడు. రోజంతా కాకరకాయ ఉల్లి కారం పెట్టిన కూరని తలుచుకుని అతని నోరు ఊరుతూనే వుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడు కూర తిందామా అని ఆరాట పడుతూ వున్నాడు.

ఇలా ఉండగా అతని పెళ్ళం బూర్లుముక్కుడు లో మంచిగా నూనె వేసి, ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలెట్టింది. ఆ వేగుతున్న కాకరకాయలు నూనెలో భుసభుసలు ఆడుతూ మహా మంచి సువాసన వస్తున్నాయి. కూర అయిపోయాక ఆ కాయలను చూస్తుంటే ఆ అమ్మాయి ఉండ పట్ట లేక పోయింది. “రుచి ఎలా ఉందొ చూడాలి కదా, ఒకటి తిని చూద్దాము” అనుకుని ఒక కాకరకాయ తినేసింది.

కొంత సేపటికి ఆకలి వేస్తోంది, నా వొంతు కూర, అన్నం తిందాము, అనుకుని రెండో కాయ కూడా తినేసింది.

మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కలలు కంటూ ఇంటికి చేరుకున్నాడు.

భోజనానికి కూర్చుంటే పెళ్ళం కూర వడ్డించింది.

“ఇదేంటి, ఒకటే ఉంది, మిగిలిన రెండూ యేవి?” అని అడిగాడు.

“ఒకటి రుచి ఎలా ఉందొ అని తిని చూసాను. రెండోది నా వాటా, అందుకే అన్నంతో తినేసాను” అని చెప్పింది.

రైతుకి కోపం వచ్చింది. “అలా ఎలా తినేసావు?” అన్నాడు.

“ఇలా!” అని మూడోది కూడా నోట్లో వేసుకుని తినేసింది! కాకరకాయ రుచి అలాంటిది మరి!

Responsive Footer with Logo and Social Media