కలవర మనసు
ఉగాది పండక్కి చీరకొనటానికి సంతకొచ్చి ౦ది వీరమ్మ ఎర్ర చీర ఎంచుకుని బేరమాడింది. అటు తిప్పి ఇటు తిప్పి ఈ మాట. ఆ మాట చెప్పి చివరకు ఆ చీరను నలభై రూపాయలకు ఒప్పించడానికి నల్లబడ్డాడు ఎండకు చీరలవ్యాపారి చిన్నయ్య.
ఆమె ఇంటికి చేరుకునేసరికి ప్రక్కింటి శాంతమ్మ అలాంటి చీరనే తీసుకొచ్చి తను ముష్టి ఐదు రూపాయలకే కొన్నట్లు చెప్పింది. వీరమ్మకు ఆ మాట చెవిన పడగానే మనసులో ఒకటే కలవరింత మొదలైంది. చీర పోలికలో ఎటువంటి మార్పు లేదు. పొడవు వెడల్పులో తేడాలు లేవు దారం నేత అంతా ఒకటే రెండూ ఎరుపే, చీరలోని డిజైన్ కూడా అంతా ఒకటే ఐదు రూపాయలు నష్టపోయానని బేరమాడ్డంలో పొరపాటుపడ్డానని అనుక్షణం మధన పడసాగింది.
ఆ చీరను కట్టిన ప్రతీసారి ఆమెలో ఒకే బాధ అనవసరంగా ఐదురూపాయిలు ఎక్కువ పెట్టి కొన్నానని. మూడు నెలలు తర్వాత వీరమ్మకు మనసు తేలిక పడింది. కారణమేమిటంటే శాంతమ్మ కట్టిన చీర రంగు వెలిసిపోయింది.