కామ్యకవనానికి శ్రీకృష్ణుని విజయం



" పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతాకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధౌమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేసాడు. ఆ రాక్షసుని చూసి ధర్మరాజు " నీవెవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు " అని అడిగాడు.

దానికి ఆ రాక్షసుడు " నేను బకుడు అనే రాక్షసుని తమ్ముడిని. నా పేరు కిమ్మీరుడు. మనుష్యులను చంపి తింటూ ఉంటాను నాకు భయపడి ఎవరూ ఈ అరణ్యానికి రారు. మీరు ఎవరు? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు? " అని అడిగాడు. ధర్మరాజు " నా పేరు ధర్మరాజు వీరు నా సోదరులు. మేము వనవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాము " అన్నాడు.

ఇది విని ఆ కిమ్మీరుడు " నా అన్న బకుని చంపిన భీముడు వీడేనా . వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నేను వీడి కోసమే వెతుకుతున్నాను " అని వికటాట్టహాసం చేసాడు. ఇది విని అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టాడు కానీ ఈలోగా భీముడు కిమ్మీరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసారు. చెట్లతోనూ రాళ్ళతోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిమ్మీరుని అతని అన్న బకుని చంపినట్లు అతని దేహాన్ని విరగదీసి చంపాడు.

ఈ విధంగా భీముడు కామ్యక వనంలో రాక్షస భయం లేకుండా చేసాడు " అని చెప్పాడు. ఇది విని ధృతరాష్ట్రుడు కలత చెందాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి " కృష్ణా! నీవు పురాణ పురుషుడవు. నీవు గంధమాదన పర్వతం మీద పదివేల సంవత్సరాలు తపస్సు చేసావు. పుష్కరంలో పదుకొండు వేల సంవత్సరాలు తపస్సు చేశావు. సరస్వతీ తీరంలో పన్నెండు సంవత్సరాలు వ్రతం చేసావు. దితి కుమారులను దనువు కుమారులను సంహరించి ఇంద్ర పదవి సుస్థిరం చేసావు. నీవు అదితి కుమారుడివి. ఇంద్రుని తమ్ముడవు ఉపేంద్రుడివి. మొదట వామనుడిగా తరువాత త్రివిక్రమునిగా లోకాలను ఆక్రమించావు. లోక కంటకులైన శిశుపాల కంసులను వధించావు.

నీవు అవతార మూర్తివి. అనృతం, మదము, కోపం, మత్సరం నీ దగ్గరకు రావు " అని స్తుతించాడు. అప్పడు శ్రీకృష్ణుడు అర్జునినితో " అర్జునా! నీవు నరుడవు. నేను నారాయణుడను. మనం ఒకరికి ఒకరం మిత్రులం " అన్నాడు. అప్పుడు ద్రౌపది కృష్ణుని చూసి " దేవా! నీవు యజ్ఞ పురుషుడివి. సర్వవ్యాపివి. సజ్జనులకు నీవే దిక్కు. నీకు తెలియనిది లేదు. నాకు జరిగిన పరాభవం చెప్తాను. నేను చక్రవర్తి పాండురాజు కోడలిని. పాండవుల భార్యను. మహావీరుడైన దుష్టద్యుమ్నుని సోదరిని. అట్టి నన్ను దుశ్శాశనుడు వెండ్రుకలు పట్టి ఈడ్పించాడు. నా వలువలు విప్పాడు.

దారుణంగా నిండు సభలో అవమానించాడు. భీమార్జునులు నా మొర ఆలకించ లేదు. వీరి పరాక్రమమెందుకు? కర్ణుడు నన్ను చూసి నవ్వాడు. ఎందరూ ఉండి ఎవరూ లేనిదానిని అయ్యాను. ఆ నవ్వు నా మనస్సును కాలుస్తుంది. ఆ కౌరవులు భీమునకు విషం పెట్టారు, పాములతో కరిపించారు. లక్క ఇంట్లో పెట్టి కాల్చాలనుకున్నారు. ఇప్పుడు జూదమాడి మా రాజ్యం లాక్కున్నారు. పాండవులు తమ శౌర్యం మరచి ఉన్నారు. కాని నేను మరువలేకున్నాను " అన్నది.

కృష్ణుడు " అమ్మా! అర్జునిని శరాఘాతాలకు కౌరవులు చచ్చుట తధ్యం ఊరడిల్లుము " అన్నాడు . శ్రీకృష్ణుడు " ధర్మరాజా ! జరిగినదంతా యుయుధానుడు చెప్పగా విని దుఃఖించాను. ఆ సమయంలో నేను మీ దగ్గర లేను ఉంటే ఇంత అనర్ధం జరిగేది కాదు. నేను ఆ సమయంలో సాల్వుడితో యుద్ధం చేస్తున్నాను " అన్నాడు.

ధర్మరాజు శ్రీకృష్ణునితో " కృష్ణా ! ఆ వృత్తాంతం వివరించు " అన్నాడు.

Responsive Footer with Logo and Social Media