కోటలోకి దారేది

కోటలోకి వెళ్లడానికి ఎవరి సహాయం లేదు. కనీసం పరిచయస్థులెవరూ లేరు. రోజూ కోట దగ్గరకు చేరి వచ్చీపోయేవాళ్లను చూస్తుంటాడు. ఓ రోజు కోటలోకి వెళ్లబోతున్న రాజగురువును కలుసుకుంటాడు. ‘మీరు నాకు తెలుసు.. మీరు ఫలానా కదా! మీరు మా ఊరు వచ్చారు. అప్పుడు నేనే దగ్గరుండి భోజనం వడ్డించాను’ అంటూ.. మాటలు కలుపుతాడు. రాజగురువు సందేహంగా చూసి, అనేక ప్రశ్నలు వేసి, తిట్టి లోపలికి వెళ్లిపోతాడు. ఎలాగైనా లోపలికి వెళ్లాలనే ఆలోచన చేసిన రామకృష్ణుడు రాజ భటులతో ‘రాజగురువుతో మాట్లాడుతుండగా చూశారుగా. రాజు గొప్ప బహుమానం ఇస్తానని చెబితే వచ్చాను.

అందులో కొంత భాగం మీకు ఇద్దామనుకున్నాను. కానీ, మీరు లోపలికి వెళ్లనివ్వడం లేదు’ అంటాడు. ఆ మాటలు భటులను ఆకట్టుకుంటాయి. బహుమానంలో తమకూ కొంత భాగం ఇచ్చేలా ఒప్పందం చేసుకుంటారు వాళ్లు. అలా కోటలోకి వెళతాడు రామకృష్ణుడు.

రాయల సభ కొలువుదీరి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన కాళీచరణ్‌ అనే ఇంద్రజాలికుడు తన విద్యలన్నీ ప్రదర్శిస్తున్నాడు . అందరూ అతన్ని కీర్తిస్తున్నారు . ‘నాతో పోటీ పడేవారు మీ రాజ్యం లో ఉన్నారా?’ అని సవాల్‌ విసిరాడతను . ఎవరూ ముందుకు రాకపోవడంతో రామకృష్ణుడు ‘నిండుగా కారం తీసుకొని, కళ్లు మూసుకొని ఆ కళ్ల మీదుగా పోసుకుంటాడు. ఇంద్రజాలికుడు తన ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగిపోతాడు.

రాజు రామకృష్ణుడి తెలివికి మెచ్చుకొని బహుమానం కోరుకోమంటే ‘వంద కొరడా దెబ్బలను ఇప్పించండి ప్రభూ’ అని వేడుకుంటాడు. ఇంత విచిత్రమైన కోరిక ఎవరూ కోరరు. అయినా సరే కానీ, అంటూ కొరడా దెబ్బలను అమలు చేయమంటాడు. అప్పుడు రామకృష్ణుడు ‘ప్రభూ తమకో విజ్ఞప్తి. ముగ్గురు ద్వారపాలకులకు మీరు ఇచ్చే బహుమానం ఇస్తాను అనే మాట మీద లోపలికి వచ్చాను. వాళ్లకు కూడా ఇందులో సగ భాగం ఉంది మహారాజా’ అని కోరుతాడు. ఆ ద్వారపాలకులను పిలిపించమంటాడు రాజు. లంచగొండులుగా మారిన ఆ ద్వారపాలకులకు అలా శిక్షపడేలా చేస్తాడు రామకృష్ణుడు. అంతేకాదు మహారాజు తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేలా ఆలోచన చేస్తాడు.

రామకృష్ణుడి చాతుర్యాన్ని మెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు తన సాహిత్యసభలో కవిగా కొనసాగమని చేతి ఉంగరాన్ని బహుకరి౦చాడు . అలా రామకృష్ణుడు భువన విజయంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా చేరిపోయాడు. వికటకవిగా పేరొందిన రామకృష్ణుడు 16వ శతాబ్దికి చెందినవాడు.