కౌశికుడు



పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడు ధర్మపరుడు ఎన్నో యగ్న యాగాలు చేసాడు. ఒకరోజు అతడు ఊరి బయట చెట్టు కింద కూర్చుని వేదాలు వల్లిస్తున్న సమయంలో ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది. కౌశికుడు ఆగ్రహించి ఆ కొంగ వైపు తీక్షణంగా చూసాడు. ఆ చూపుల తీక్షణతకు ఆ కొంగ చచ్చిపోయి కింద పడింది. కౌశికుడు అది చూసి కలత పడి. " అయ్యో ! నేను ఎంత నిర్ధయగా ఈ కొంగను చంపాను. నా పాపానికి నిష్కృతి లేదు " అని విలపించాడు.

ఇంతలో మధ్యాహ్నం అయింది ఒక ఇంటికి బిక్షకు వెళ్ళాడు. ఆ ఇంటి ఇల్లాలు అతనికి బిక్ష వేయడానికి పాత్రను సిద్ధం చేస్తున్న సమయంలో ఆమె భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె భర్తకు అభ్యంగన స్నానం చేయించి భోజనం పెట్టి అతని కాళ్ళు వత్తే సమయంలో బిక్షకు వచ్చిన బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆమె ఒక పాత్రలో అన్నం తీసుకు వచ్చి భిక్ష వేయటానికి రావడం చూసి కౌశికుడు కోపించి " ఏమీ ఇంత గర్వమా! నన్ను చూసిన వెంటనే పొమ్మంటే పోదును కదా! ఇంత సేపు ఎందుకు ఆలస్యం చేసి అవమానించావు? " అని అడిగాడు.

అయ్యా మీకు భిక్ష తెచ్చేటప్పడు నా భర్త వచ్చాడు. అయనకు పరిచర్యలు చేసి వచ్చేసరికి నాకు ఆలస్యం అయింది ఓర్పు వహించండి " అన్నది. కౌశికుడు " నీకు ఇంత గర్వమా బ్రాహ్మణులు లోకవంద్యులు. బ్రాహ్మణుల కంటే భర్త ఎక్కువా? సాక్షాత్తు దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను గౌరవిస్తాడు. వారి ఆగ్రహానికి గురైతే లోకాలు భస్మం కాగలవు " అన్నాడు. ఇల్లాలు " అయ్యా ! బ్రాహ్మణుల మహిమ నాకు తెలియనిది కాదు.

వాతాపిని జీర్ణం చేసుకున్నది, సముద్ర జలాలను త్రాగరానివిగా చేసినది, దండకారణ్యం తగుల బెట్టినది మొదలైన ఎన్నో మహత్తర కార్యములు చేసిన బ్రాహ్మణులను అవమానించి కోరి కష్టాలు తెచ్చుకుంటానా ? నాకు భర్తే పరమ దైవం అంతకంటే స్త్రీకి ఉత్తమ ధర్మం లేదు. బ్రాహ్మణోత్తమా మీకు ఆగ్రహం ఎక్కువ అని నా పాతివ్రత్య మహిమతో తెలుసు కున్నాను.

కోపం, మోహం మనిషికి ప్రథమ శత్రువులు వాటిని జయించని బ్రాహ్మణులు ఉత్తములు కాజాలరు. మీరు మీ పై రెట్ట వేసిన కొంగను దహించిన విషం నేనెరుగుదును. ఇంద్రియములను జయించిన వాడు, అహింసను కలిగిన వాడు, సత్య వ్రతమును ఆచరించిన వాడు, సకల జనుల యందు సమ భావం కలిగిన వాడు, గురువులను పూజించే వాడు, ధర్మవర్తనుడు అయిన బ్రాహ్మణుడు పూజనీయుడు కాగలడు.

సత్ప్రవర్తన, వేదాధ్యయనం లాంటి ఉత్తమ కర్మలే బ్రాహ్మణ సంపదలు. ధర్మం బహు సూక్ష్మమైనది. నేను ఆడుదానిని నాకు వివరంగా తెలియదు. నీకు తెలుపగల వాడు మిధిలా నగరంలో ఉన్నాడు. అతని పేరు ధర్మవ్యాధుడు. అతడు ఒక కిరాతుడు. అతడు సత్య వ్రతుడు, సత్గుణ సంపన్నుడు, ధర్మవర్తనుడు, మాతాపితలను పూజించే వాడు. అతని దగ్గరకు పోయి ధర్మం గురించి తెలుసుకో. నీవు సాధ్యాయన పరుడవే కాని ధర్మసూక్ష్మములు ఎరుగవు. నేను చెప్పిన దానిలో అపరాధం ఉంటే నన్ను మన్నించు " అన్నది.

కౌశికుడు " అమ్మా! నీ వలన నాకు జ్ఞానోదయం అయింది. నా మనసుకు శాంతి లభించింది " అని చెప్పి మిధిలకు ప్రయాణమయ్యాడు. కౌశికుడు ఆ పతివ్రత మహిమకు అచ్చెరువంది ఆమెను దూషించి నందుకు పశ్చాత్తాపపడ్డాడు.

Responsive Footer with Logo and Social Media