క్రమశిక్షణ


శివపురం గ్రామంలో శంకరయ్యనే తిండిపోతు వుండేవాడు ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చుని తింటుండేవాడు రోడ్ రోలర్లాగ వున్న శంకరయ్యకు పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. వాడి తండ్రి రామనాథం వాడికి ఈ జన్మలో పెళ్లికాదని దిగులు పడేవాడు.
ఓ రోజు రామనాథం పట్నం వెళ్ళినప్పుడు తన మిత్రుడైన జగన్నాధానికి తన కొడుకు విషయం చెప్పాడు. విషయం విన్న జగన్నాథం వాడ్ని తన వద్దకు సంపమని చెప్పాడు. మర్నాడు శంకరయ్యని జగన్నాథం వద్దకు పంపాడు రామనాధం. వ్యాపారస్తుడైన జగన్నాథం తనకు బాకీలున్నవారందరి అడ్రసులిచ్చి ఈ బాకీలు వసూలు చేయి ఇందులో కష్టమేముంది. బాకీలు వసూలు అయ్యేవరకు తిరగటమే కదా! అన్నాడు.
శంకరయ్య తన భారీకాయాన్ని ఈడ్చుకుంటూ డబ్బులు వసూలు చేయడానికి అడ్రసులు తీసుకుని బయల్దేరాడు. జగన్నాథం పెట్టింది తినడం, ఉదయం నుండి సాయంత్రం వరకూ తిరగడం శంకరయ్యకు దినచర్య అయిపోయింది.. ఆరు నెలల జీతం ఒకేసారి ఇస్తానని చెప్పి శంకరయ్యకి ఒక్క నయా పైసా కూడా ఇచ్చేవాడు కాదు జగన్నాధం చేతిలో డబ్బులేకపోవడంతో చిరుతిళ్ళు తినే వీలు శంకరయ్యకి లేకపోయింది.
ఓ ఆరు నెలలు గడిచేసరికి జగన్నాథం పెట్టిన భోజనం క్రమశిక్షణతో ప్రొద్దుట్నుంచి రాత్రివరకూ తిరుగుతూండటంతో సన్నగా తయారయ్యాడు శంకరం, తన శరీరాన్ని చూసు కున్న శంకరయ్య ఇంకెప్పుడూ క్రమశిక్షణ లేకుండా తినకూడదని, శరీరానికి వ్యాయామం తప్పనిసరనే విషయం గుర్తించాడు. శంకరయ్యలో వచ్చిన మార్పును చూసి రామనాథం చాలా సంతోషించాడు.