కుందేలు తెలివి



నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలుదేరింది నక్క. ‘ఇప్పుడు కడుపునిండా తింటే కానీ నా శక్తి సరిపడదు’ అనుకుంటూ వేగంగా నడుస్తోంది. ఇంతలో దానికి లేత పచ్చిక తినుచున్న కుందేలు కనిపించింది. ‘హమయ్య… ముందు దీన్ని తినేస్తే… కొంత ఆకలి తీరుతుంది’ అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్లింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూసి కుందేలు గుండె ఆగినంత పనైంది. తప్పించుకునే మార్గం కూడా కనిపించలేదు. కానీ వెంటనే… ‘నక్క బావా… బాగున్నావా…?’ అంటూ ఎదురు వెళ్లింది. ‘ఆపు… నీ కబుర్లు! ఇప్పుడు నేను నిన్ను తినేందుకు వస్తున్నా’ అంది నక్క.

‘నీకు ఎదురు పడి తప్పించుకోవడం సాధ్యమా, నక్కబావా! కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు, సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటావంటా లేదు’ అంది కుందేలు. ‘అయితే ఇప్పుడెమిటీ?’ అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే… నన్ను, దాన్నీ కూడా తినేద్దువు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది. మాకూ ఒకరికి ఒకరం లేమనే బాధా తప్పుతుంది’ అంది. ‘నీ మాటలు నిజమేనా?’ అని అడిగింది నక్క. ‘నీ మీద ఒట్టు, పద’ అని చెప్పింది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో సరే, అంది నక్క. కుందేలు కాస్త ముందు వెళ్తుంటే, దాని వెనకే వెళ్లసాగింది.

కొంత దూరంలో గుహ నుండి బయటకు వస్తూ పెద్దపులి కనిపించింది. ‘పులి రాజా… ఈ మూడో నక్కను కూడా తినేస్తే…మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది. త్వరగా రా’ అంది. ఆ మాటలు వినగానే నక్క ఉలిక్కిపడింది. ‘గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడవేసి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసినా… ఆకలి బాధ వల్ల దీని మాటలు నమ్మితే, ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉందని అనుకుని వెనక్కి పరుగు పెట్టింది. తర్వాత కుందేలూ తన దారిన తనే వెళ్లిపోయింది.

కథ యొక్క నీతి: సమస్యను పరిష్కరించడానికి బుద్ధి ఉపయోగించడం శక్తి కంటే గొప్పది.

Responsive Footer with Logo and Social Media