మాటలతో కోటలు
చమత్కారానికో, లేక పిలవడానికి సులువు అనో కానీ.. కొద్ది కాలంలో రామకృష్ణుడిని ఊరివాళ్లు రామలింగా అని పిలిచేవారు. తల్లికి పనుల్లో సాయపడుతూ, విద్యను అభ్యసిస్తూ పెరిగి పెద్దవుతాడు. పెళ్లి చేసుకొని గృహస్థుడు అవుతాడు. ఒకరోజు ఆ ఊళ్లో ఆచారి అనే వ్యక్తి రామలింగడి కాళ్ల మీద పడతాడు కాపాడమని. విషయం ఏంటని అడుగుతాడు రామకృష్ణుడు.
సేట్ తన జాతకం అడిగితే చూసి 'నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు. నీ పరివారం అంతా ముందే మరణిస్తారు' అని చెప్పాను. తన పనివాళ్లతో చెప్పి నన్ను కొట్టించడానికి సిద్ధమయ్యాడు. నా దోషమేమీ లేదు. ఉన్నదున్నట్టు చెప్పాను' వగరుస్తూ అన్నాడు ఆచారి. ఆచారికి ఓ రహస్యం చెప్పి సేట్ని కలుస్తాడు రామకృష్ణుడు.
కోపంలో ఉన్న సేట్ ఆచారిని తెగ తిడుతుంటాడు. రామకృష్ణుడు వెళ్లగానే 'ఇంట్లో అందరూ జబ్బు చేసి చచ్చిపోతారని వాడు చెప్పాడు. శాంతి చేయాలి..' అని టెన్షన్ పడుతూ ఉంటాడు సేట్. ఆ ఆచారి చెప్పింది అబద్ధం. బృహస్పతి వరం పొందిన ఓ సిద్దుడు చెట్టుకింద కొలువుదీరాడు. ఎవరితోనూ అతను మాట్లాడడు. ఈ రాత్రే వెళ్లి అతన్ని కలవండి' అని చెబుతాడు రామకృష్ణుడు. అలాగేనని వెళతాడు సేట్. రామకృష్ణుడు చెప్పిన విధంగా చెట్టుకింద ఉన్న స్వామీజీని చూసి 'స్వామీజీ నేను పెద్ద పరేశాన్లో ఉన్నాను. మా ఇంటి పరిస్థితి ఇది. దయచేసి చెప్పండి' అని వేడుకుంటాడు.
జాతకం చూసిన అతను.. 'మూడేళ్ల క్రితం మీ తండ్రి మరణించారు. వారం రోజులుగా మీ ఇంట్లో వారంతా మంచం పట్టారు. నువ్వు దీర్ఘాయుష్కుడివి. మీ ఇంట్లో వారందరికంటే నువ్వు రెండేళ్లు ఎక్కువ కాలం బతుకుతావు' అని చెబుతాడు.
అతను చెప్పిన దానికి చాలా సంతోషించిన సేట్ డబ్బు కూడా ఇచ్చి దండం పెట్టుకుంటాడు. ఆ స్వామీజీ వేషం కట్టింది ఆచారియేనని ఆ సేటికి తెలియదు. మాట తీరుతో ఆపదల నుంచి ఎలా బయటపడవచ్చో రామకృష్ణకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని నిరూపిస్తాడు.
ఆచారి రామకృష్ణుడిని కలిసి 'రామా.. నువ్వు చాలా చమత్కారివి. చెప్పినదాన్నే మరో విధంగా చెప్పి నన్ను కాపాడావు' అని మెచ్చుకొని 'ఇంత తెలివైనవాడివి ఈ ఊళ్లో ఉంటే ఎలా? నువ్వు రాజ సభలో ఉండాలి. ఎందుకు ప్రయత్నించకూడదు' అంటాడు.
ఆ ఆలోచనతో భార్య సీతతో విజయనగరం బయల్దేరుతాడు రామకృష్ణుడు.