మనిషి విలువ



అను ఒక చిన్న గ్రామానికి చెందిన సాధారణ ఇంటి అమ్మాయి. తాను డిగ్రీ వరకు చదివి, ఇకపై చదువులు చదవడానికి స్థోమత లేకుండా, పట్టణానికి వెళ్లి జాబ్ చేసే అనుభవం లేకుండా, ఇంట్లోనే ఉండి పనులు చూసుకొంటోంది.

అజయ్ అదే గ్రామానికి చెందిన విజయవంతమైన కెరీర్ ఉన్న సాధారణ వ్యక్తి. అజయ్ అవేమి పట్టించుకునేవాడు కాదు. అనుకూ అజయ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఒక రోజు అను తన మనసులో మాటని అజయ్ కి చెప్పింది. అను చాలా అందమైన అమ్మాయి, పైగా తన అమాయకత్వంతో అందరిని ఇట్టే కట్టిపడేస్తుంది.

అజయ్ కి కూడా అను నచ్చడంతో… అను ప్రేమని అంగీకరిస్తాడు. అను, అజయ్ పైన చూపించే ప్రేమ మరియు అజయ్, అనుపై చూపించే అభిమానం వెలకట్టలేనిదిగా ఉండేది. అను డిగ్రీ వరకు చదువుకున్నది కాబట్టి పెళ్లికి ముందు అనుని మంచి స్థాయిలో ఉండేలా చేయాలి అని అజయ్ ఆలోచించాడు. ఎందుకంటే “రేపటి రోజు నేను ఉన్నా లేకున్నా తన కాళ్లపై తాను నిలబడి ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది అతని కోరిక..”

ఆ రోజునుంచి అజయ్ అనుకి వెన్నంటే ఉండి, తన ప్రతీ అడుగులో తోడుండేవాడు. తనపై చదువులకు సహకరించాడు. తాను చేయాలనుకున్న బిజినెస్ సలహాకు సరే అన్నాడు. తగిన పెట్టుబడిని పెట్టి ఆమెని ముందుకు నడిపించాడు. తాను వేసే ప్రతి అడుగును పది రకాలుగా ఆలోచించి, ఏది తప్పో, ఏది సరియైనదో అన్నీ సలహాలు ఇచ్చేవాడు. ఎందుకంటే అజయ్ వాటన్నిటినీ దాటుకుని వచ్చినవాడు. తనకు కాబోయే భార్య అలాంటి ఇబ్బందుల్లో పడొద్దని చాలా జాగ్రత్త పడేవాడు.

కొన్ని రోజులలోనే అను ఉన్నత స్థాయికి చేరుకుంది. అజయ్, ఆమె ప్రతి అడుగులో తోడుండి ఆమెని ఉద్యోగంలో ఒక్కో మెట్టు ఎక్కేలా చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైనా అను సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే, అజయ్ కొంచెం కఠినంగా వ్యవహరించి తనను సరైన మార్గంలో నడిపించేవాడు. అను, తన మార్గంలో ఎంతో మందిని చూసింది. చాలా మంది ఆమె అందాన్ని, తెలివిని చూసి ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత… అను బిజినెస్ లో తానే స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్థాయికి ఎదిగింది. ఇక అజయ్ ఎలాంటి సలహా ఇచ్చినా.. తీసుకునే పరిస్థితిలో ఆమె లేదు. అజయ్ ఇచ్చే సలహాలను ఆమె పాటించడం మానేసింది. అజయ్, అనుకి అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. అజయ్ ని తిట్టేది. “నీ సలహా నాకేం అక్కర్లేదు.. నేను స్వంతంగా ఆలోచించుకోగలను.. నీ సలహాలను ఇంకెవరికైనా చెప్పు, నాకు కాదు. అయినా అసలు నువ్వు నా నుండి దూరంగా వెళ్లిపో, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను” అని అంది.

ఆ మాటలకు అజయ్ మనసు విరిగిపోయింది. అజయ్ చాలా బాధపడ్డాడు. అజయ్, అను తో.. “నేను నిన్ను ఒక సాధారణ అమ్మాయిగానే ఇష్టపడ్డాను. కానీ, నాకు నిన్నొక ఉన్నత స్థానంలో చూడాలనే కోరికతో.. నువ్వు నువ్వులా బ్రతకాలని చేయాలనుకున్నాను. మొదట్లోనే నిచ్చే సలహాలు అన్నీ తీసుకున్నావు. మంచి ఉన్నత స్థాయిలోకి వచ్చావు. నేనెప్పుడైనా కఠినంగా వ్యవహరించినా అది నీ మంచి కోసమే.. కానీ.. ఇప్పుడు నీకు నా మాటలే నీకు చేదయ్యాయి. నేను ప్రేమించిన అను ఇది కాదు. ఇక నేను నీ జీవితంలోకి రాను అని చెప్పి వెళ్లిపోయాడు.”

అను, అజయ్ మాటలను పట్టించుకోలేదు. “నువ్వు కాకపోతే నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు.” అని అనుకుని, తన మనస్సులో నవ్వుకుంది.

కొన్ని రోజులకి.. అను తన ఆస్తి మొత్తం పెట్టుబడిగా పెట్టి మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంది. తన స్వంత ఆలోచనలతోనే అన్నీ పనులు చేకుంటూ వచ్చింది. సడన్ గా ఒకరోజు గవర్నమెంట్ నుండి ఉత్తర్వులు రావడం, ఆ బిజినెస్ ని క్లోజ్ చేయాలనీ చెప్పడం జరిగింది. అది విన్న అను ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఎంత మందిని సహాయం కోరినా.. ఎవరు తనకు అండగా నిలబడలేరు. ఒకపుడు తన తెలివిని మెచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్లు కూడా “మాకేం తెలియదు” అన్నట్టు వెళ్లిపోయారు. ఆ క్షణంలో… ఆమె మదిలో మెదిలిన వ్యక్తి అజయ్. అసలు అజయ్ నా పక్కన ఉంటే, నాకీ పరిస్థితి వచ్చేది కాదు.

ప్రతీ పనిలో మంచేదో, చెడోదో చెప్పుతూ ఇంతవరకు నన్ను తప్పటడుగు వేయకుండా చేసాడు. అతను నన్ను ఎప్పుడూ ఉన్నత స్థాయిలో, సంతోషంగా ఉండాలని చూడాలనుకున్నాడు. నేనే నా అతి మూర్ఖత్వంతో అజయ్ ని దూరం చేసుకున్నాను అని బాధపడింది. వెంటనే వెళ్లి అజయ్ ని కలవాలనుకుంది. తన తప్పుని మన్నించమని మరియు తనని పెళ్లిచేసుకోవాలనుకున్నది.

కానీ, అప్పటికే అజయ్ తనంటే ప్రాణమిచ్చే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు. ఇది తెలిసిన అను చేసేది ఏమిలేకా, తన జీవితంలో అతి విలువైన వ్యక్తిని కోల్పోయానని అర్థం చేసుకొని, బాధతో హృదయంతో వెనక్కి తిరిగింది.

కథ యొక్క నీతి: మీ కోసం శ్రద్ధ వహించే వారు మాత్రమే మీకు మార్గనిర్దేశం చేయడం ద్వారా లేదా అప్పుడప్పుడు కఠినంగా ఉండటం ద్వారా మీకు సరైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు – వారు మిమ్మల్ని ఎప్పుడూ.. ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి, మీ గతం మరియు మీ జీవితంలో భాగమైన వ్యక్తి గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉండకపోతే ఈ రోజు మీరు ఎక్కడ ఉండేవారు? అహం మరియు కోపాన్ని వదిలేయండి. ఎందుకంటే చివరికి మన జీవితంలో అత్యంత విలువైన భాగం ఆ వ్యక్తే కావచ్చు.

Responsive Footer with Logo and Social Media