Subscribe

మాయా రాయి - మతిలేని రాక్షసుడు


ప్రతి రోజు లాగే సాయంత్రం అవ్వగానే పిల్లలందరూ పేదరాశి పెద్దమ్మ ఇంటి ముందుకు చేరుకున్నారు.. పెద్దలు కూడా కాసేపు పనులు పక్కనబెట్టి గుడిసె ముందుకు చేరారు... పేదరాశి పెద్దమ్మ అరుగు మీద కూర్చొని అందరి వంక చూసి ఒకసారి నవ్వి కథ చెప్పడం ప్రారంభించింది...

"ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు. మాయా రాయి - మతిలేని రాక్షసుడు పూర్వం రత్నపురి అనే రాజ్యానికి రాజేంద్రుడు అనే రాజు ఉండేవాడు. తను ప్రజలను కన్న బడ్డల్లా చూసుకునేవాడు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా తీర్చేవాడు. ఆ రాజుకు మయూరి అని ఒక కూతురు ఉండేది. కూతురంటే రాజుకు వల్లమాలిన ప్రేమ. యువరాణి చిన్నప్పుడే మహారాణి మరణించడంతో తనే తల్లి, తండ్రి అయ్యి పెంచాడు. తను కాలు కిందపెడితే కందిపోతాయేమో అన్నట్టు చూసుకునేవాడు. తను కోరింది ఏదైనా సరే క్షణాల్లో అమర్చేవాడు.

ఇదిలా ఉండగా ఒకనాడు మయూరి కి అంతుచిక్కని జబ్బు ఒకటి చేసి మంచాన పడింది. చలాకిగా తిరిగే కూతురు ఇలా అవ్వడంతో రాజు కన్నీరు మున్నీరు అయ్యాడు. రాజ్యంలోని వైద్యులు అందరూ కలిసి రకరకాల ములికాలతో మందులు ఇచ్చినా సరే యువరాణి గారు కోలుకోలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కళ్ళ ముందు అలా అవ్వడం చూసి రాజు రోజు రోజుకు క్రుంగిపోయాడు. రాజ్యం గురించి, ప్రజల గురించి పట్టించుకోవడం కూడా మానేసాడు. దోపిడీలు, అరాచకాలు ఎక్కువ అయ్యాయి. అలాగే ఈ రాజ్యాన్ని ఆక్రమించడానికి శత్రురాజ్యాలు కూడా అదును కోసం ఎదురుచూస్తున్నాయి... ఆ విషయం తెలిసిన రాజు ఈ సమస్యలు తొలిగిపోవాలంటే యువరాణి గారి జబ్బు నయం చేయడం ఒక్కటే మార్గం అని అనుకున్నాడు.

ఇంతలో ఒక వైద్యుడు గ్రంధాలన్నీ తిరిగేసి మన రాజ్యం పక్కనున్న అడవి మధ్యలో ఉన్న కొండ మీద దొరికే అమృతవల్లి అనే మూలికతో వైద్యం చేస్తే ఫలితం ఉంటుంది అని సలహా ఇచ్చాడు. వెంటనే సైనికులను అక్కడికి పంపించాడు. కానీ ఎవరు తిరిగి రాలేదు. ఎందుకంటే ఆ కొండ మీద ఒక క్రూరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడి చేతిలో అందరూ ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ధైర్యావంతులు ఆ మూలిక తీసుకొద్దామని ప్రయత్నించారు కానీ ఆ రాక్షసుడి శక్తి ముందు నిలబడలేకపోయారు. ఈలోగా యువరాణి గారి ఆరోగ్యం ఇంకా క్షీణించింది. రాజు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. తనే వెళ్దామ౦టే యువరాణి గారిని చూసుకోడానికి ఎవరు ఉండరు. పైగా రాజు లేని రాజ్యం శత్రువులకు అదునుగా మారుతుంది...

ఏం చేయాలో తెలియక ఆ మూలిక తెచ్చిన సాహస వీరులకు యువరాణి గారిని ఇచ్చి పెళ్లి చేసి, తన తరువాత రాజ్యాన్ని కూడా ఇస్తానని ఊరంతా దండోరా వేయించాడు.. అదే రాజ్యంలో చాణుక్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైన వాడే కానీ ఒట్టి అమాయకుడు. తల్లి, తండ్రి చనిపోవడంతో ఒక కుటుంబం దగ్గర పని చేస్తూ బ్రతికేవాడు. వాళ్లు వీడి దగ్గర రోజంతా పని చేయించుకొని అన్నం కూడా కడుపు నిండా పెట్టేవాళ్ళు కాదు. జీతం డబ్బులు అడిగితే ఇంట్లో నువ్వు ఆ వస్తువు పగలకొట్టావ్, ఈ బొమ్మ విరక్కోట్టావ్ అని అంటూ తక్కువగా ఇచ్చేవారు. చాణుక్యుడుకి బయటకెళ్ళి ఎలా బ్రతకాలో తెలియకపోవడంతో అక్కడే ఉండిపోయాడు.

ఒకరోజు యజమాని కొడుకు కాలు జారి కింద పడడంతో పిల్లాడి తలకు చిన్న దెబ్బ తగిలి రక్తం వచ్చింది. యజమాని కోపంతో నువ్వు సరిగా చూసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని చాణుక్యని బాగా కొట్టి ఇంటి నుంచి బయటకు తరిమేసాడు. చాణుక్యకు ఎటు వెళ్లాలో తెలియక వీధిలో తిరుగుతున్నాడు. అప్పుడే రాజు గారి దండోరా విన్నాడు. ఎలా అయినా సరే ఆ మూలిక తీసుకొద్దామని అడవి వైపు బయల్దేరాడు.

అప్పుడే తనకు ఒక ముసలి బామ్మ ఏడుస్తూ కనిపించింది. ఏమైంది బామ్మ ఎందుకేడుస్తున్నావ్ అని అడిగాడు. నేను ఎంతో ఇష్టంగా దాచుకున్న వెండి బిందె బావిలో పడింది అని సమాధానం చెప్పింది. వెంటనే చాణుక్య బావిలోకి దూకి కష్టపడి చాలా సేపు వెతికి ఆ బిందె తిరిగి తెచ్చి ఇచ్చాడు. దానికి ఆ బామ్మ సంతోషించి ఒక రొట్టె ఇచ్చింది. చాణుక్య దాన్ని సంచిలో పెట్టుకోని ముందుకు కదిలాడు. బాగా ఆకలిగా ఉండటంతో ఒక చోట కూర్చొని తిందామని సంచి తెరిచాడు. అప్పుడే దూరంగా ఒక స్వామీజీ నీరసంతో కళ్ళు తిరిగి పడిపోవడం చూసి పరిగెత్తుకుంటు అక్కడికి వెళ్లి ఆయన్ని లేపి తన దగ్గర ఉన్న ఒక్క రొట్టె కూడా ఇచ్చేసాడు.

అది చూసిన స్వామీజీ తను చేసిన సహాయానికి చాలా సంతోషించాడు. తన సంచిలో ఉన్న ఒక నీలి రంగు రాయి బయటకు తీసాడు. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. ఆ స్వామీజీ ఆ రాయిని దూరంగా విసిరేసాడు. ఎందుకలా చేసాడో తెలియక చాణుక్య అయోమయంగా చూసాడు. తరువాత ఆ స్వామీజీ ఒక మంత్రం చెప్పాడు. వెంటనే ఆ రాయి ఎగురుతూ తిరిగి ఆ స్వామీజీ చేతిలోకి వచ్చింది.

చాణుక్య తను చూసింది నమ్మలేకపోయాడు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దాన్ని తన చేతిలో పెడుతూ ఆ స్వామీజీ ఇలా అన్నాడు.. "నాయన.. ఈ రాయి చాలా శక్తివంతమైంది. ఈ రాయి ఎంత దూరంలోకి విసిరేసినా, ఎక్కడున్నా సరే... ఈ మంత్రం చదివితే వాటన్నిటిని దాటుకొని నీ దగ్గరకు వస్తుంది. కానీ గుర్తుంచుకో ఆ మంత్రం కేవలం రెండు సార్లు మాత్రమే నీకు పని చేస్తుంది...." అని చెప్పాడు. అది విని చాణుక్య సంతోషించి, ఆ స్వామీజీ దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ అడివి వైపు నడక ప్రారంభించాడు. దారిలో తనకు చాలా దాహం వేసింది. వెంట తెచ్చుకున్న సీసాలో నీళ్లు కూడా అయిపోయాయి. గొంతు ఎండిపోసాగింది.

నీరసంగా అనిపించింది. ఇంకొక్క అడుగు కూడా వేయలేనేమో అనుకున్నాడు. తన అదృష్టం కొద్దీ అప్పుడే కాస్త దూరంలో ఒక నీటి కొలను కనిపించింది. అది చూడగానే ఆత్రంగా తాగడానికి దాని దగ్గరగా వెళ్ళాడు. కానీ ఒక్కసారి ఆ కొలను దగ్గర అడుగులు గుర్తులు గమనించాడు. ఆ గుర్తులు కొలను దాకా వెళ్ళేవి ఉన్నాయి కానీ తిరిగిచ్చినవి లేవు. అంటే ఆ కొలనులో ఏదో ప్రమాదం ఉందని గ్రహించాడు. ఇప్పుడు ఆ నీళ్లు ఎలా తాగాలా అని ఆలోచించగా తన జేబులో ఉన్న రాయి గుర్తొచ్చింది. వెంటనే ఆ రాయికి దారంతో సీసా కట్టి నీళ్ళలోకి విసిరేసాడు. తను ఊహించినట్టుగానే రాయి విసిరిన దగ్గర కొన్ని మొసళ్ళు తిరగడం చూసాడు. కొలను దగ్గరకు వెళ్లకుండా మంచి పని చేశాను అని మనసులోనే తన తెలివిని మెచ్చుకున్నాడు. కాసేపటికి మంత్రం చదివాడు. అప్పుడు ఆ రాయితో పాటు నీళ్లు నిండిన సీసా కూడా వచ్చింది. ఆ నీళ్లు తాగి దాహం, పక్కనే చెట్టుకు కాసిన పళ్ళు తిని ఆకలి తీర్చుకున్నాడు.

తరువాత మళ్ళీ అడివిలో నడుస్తూ వెళ్ళాడు. కాసేపటికి ఆ మూలిక ఉన్న కొండ దగ్గరకు చేరుకున్నాడు. మెల్లగా కష్టపడి ఆ కొండను ఎక్కాడు. ఎక్కిన తరువాత ఎదురుగా ఉన్న రాక్షసుడిని చూసి తన గుండె ఆగినంత పనైంది. ఆ రాక్షసుడు మామూలు మనిషి కంటే చాలా పెద్దగా ఉన్నాడు. వాడి తలకు రెండు కొమ్ములు ఉన్నాయి. పళ్ళు పదునుగా, కళ్ళు ఎర్రగా.... మొత్తం రూపమే చూడటానికి చాలా భయంకరంగా ఉంది.. తన రూపం కాసేపు చూస్తేనే ప్రాణం ఆగిపోతుందేమో... "అరేయ్ బాలక... చాలా రోజుల నుంచి మనిషి మాంసం దొరకలేదు. ఈరోజు నిన్ను తిని నా ఆకలి తీర్చుకుంటాను. భలే దొరికావు.." అంటూ బిగ్గరగా నవ్వుతూ చాణుక్యని తన చేతులతో పట్టుకున్నాడు.

చాణుక్యకు చాలా భయమేసింది. వాడి నుంచి విడిపించుకోవాలని చాణుక్య ప్రయత్నించాడు కానీ తన బలం సరిపోవడం లేదు. తనని ఎత్తి నోటి దగ్గరకు తెచ్చాడు. ఇంకొన్ని క్షణాల్లో తన ప్రాణం గాల్లో కలిసిపోతుంది అనగా చాణుక్య కు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తను కూడా నవ్వడం ప్రారంభించాడు. చాణుక్య ఎందుకు నవ్వుతున్నాడో తెలియక రాక్షసుడు విచిత్రంగా చూసాడు. "ఏంటి బాలక... చనిపోతున్నప్పుడు భయపడకుండా ఎందుకలా నవ్వుతున్నావ్" అని కోపంగా అడిగాడు. "నేను నీకు సహాయం చేయాలని చూస్తుంటే నన్ను చంపేసి నీ ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నావ్..." "ఏంటి నువ్వనేది. నువ్వు నాకు సహాయం చేయాలని వచ్చావా..." అంటూ తనని కిందకు దింపి అయోమయంగా అడిగాడు.

"నా పేరు చాణుక్య.. రాక్షస జాతి రాజు దగ్గర సేవకుడిగా పనిచేస్తాను. నీ ధైర్య సాహసాలు గురించి చుట్టూ పక్కల అందరూ చాలా గొప్పగా చెప్పుకోవడం విని నిన్ను తన రాజ్యానికి సేనాదిపతిని చేద్దామని అనుకుంటున్నాడు. మా రాజ్యంలో ఎప్పుడూ పాడితే అప్పుడు తినడానికి మనుషులు కూడా చాలా మంది ఉంటారు." ఆ మాట వినగానే రాక్షసుడి కళ్ళు ఆనందంతో పొంగిపోయాయి. మొహం వెలిగిపోయింది. "పదా.. ఇప్పుడే వెళ్తాం ఆ చోటుకు..." "అక్కడ మామూలు రాక్షసులకు చోటు లేదు. కేవలం కాంతి రాక్షసులకి మాత్రమే అనుమతి "కాంతి రాక్షసులా.. నేను ఇప్పుడు అలా ఎలా మారడం " అని అడిగాడు. వెంటనే చాణుక్య తన జేబులోని రంగు రాయిని బయటకు తీసాడు. "అలా మారాలి అంటే హిమాలయాల్లో మాత్రమే దొరికే ఈ కాంతి రాయిని మింగాలి. అప్పుడే నువ్వు కాంతి రాక్షసుడు అవుతావు. మా రాజ్యంలోకి అనుమతి వస్తుంది" అని చెప్పాడు.

ఆ మాటలను నిజమని ఆ రాక్షసుడు నమ్మి ఆ రాయిని చేతిలోకి తీసుకొని మింగేసాడు. దాని కోసమే ఎదురుచూస్తున్న చాణుక్య వెంటనే మంత్రం చదివాడు. ఆ మంత్రం అయిపోగానే ఆ రాయి రాక్షసుడి పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చింది. పొట్ట పగలగానే ఆ రాక్షసుడు పెద్దగా అరుస్తూ కిందపడి గిల గిలా కొట్టుకుంటూ చనిపోయాడు. పీడా విరగడ అయ్యింది అని చాణుక్య చాలా సంతోషించాడు. తరువాత మంత్రం రెండు సార్లు అయిపోవడంతో రాయిని దూరంగా విసిరేసి ఆ మూలికలు తీసుకొని రాజ్యానికి బయలుదేరాడు.

వైద్యులు వెంటనే ఆ మూలికతో వైద్యం చేయడంతో యువరాణి గారి జబ్బు తగ్గిపోయి మళ్ళీ ఆరోగ్యంగా మారిపోయారు. రాజుగారు చెప్పినట్టుగానే చాణుక్య ధైర్య సాహసాలకు మెచ్చి యువరాణిని తనకు ఇచ్చి పెళ్లి చేసి రాజుని కూడా చేశాడు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన చాణుక్య ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకోవడంతో ప్రజల అభిమానాన్ని కూడా పొందాడు. అలా చాణుక్య ఇతురులకు సహాయం చేసి, అలాగే తన సమయస్ఫూర్తితో ఎదురైనా ప్రమాదాలు దాటుకొని రాజు అయ్యాడు..

ఇదండీ పిల్లలు ఈరోజు కథ..మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంటూ పేదరాశి పెద్దమ్మ పైకి లేచింది.

Responsive Footer with Logo and Social Media