నా తోటలో



రంగనాథపురంలో ఉండే రఘుపతి, సరళ దంపతులకి హేమంత్ ఒక్కడే కొడుకు. చదివేది ఏడో తరగతి. పచ్చని ప్రకృతి, పరిసరాలను గమనించడం అతని అభిరుచి. చదువులో కూడా చురుకే.హేమంత్ అమ్మానాన్నలు విద్యావంతులు కావడంతో తనకి ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. రఘుపతి ప్రశాంత జీవనం ఇష్టం. అందుకే పట్నం వాతావరణానికి దూరంగా స్థలం కొని ఇల్లు కట్టుకున్నాడు. పెద్ద ఇల్లు, చుట్టూ ప్రహరీ, కనుచూపు మేరలో కొండలు, అక్కడక్కడా ఇల్లు ఇదీ అక్కడి వాతావరణం. హేమంత్ బడి నుంచి రాగానే చేసే మొదటి పని పెరట్లోకి వెళ్లడమే. ఎందుకంటే… అక్కడ అన్ని రకాల పళ్లు, పూల చెట్లు, పొదలతో చిన్నపాటి అడవిని తలపించేది. తోట పనంటే హేమంత్ కి ఎంతో ఇష్టం. పనయ్యాక పెరట్లో ఓ చాపేసుకొని అక్కడే కూర్చొని చదువుకునే వాడు. చెట్టు చెట్టునూ పరిశీలించి వాటితో కబుర్లు చెప్పేవాడు.

పక్షుల అరుపుల్ని అనుకరిస్తూ, చీమల బారుల్ని ఆసక్తిగా గమనించే వాడు. సీతాకోక చిలుకల్ని, ఉడుతల కదలికల్ని కన్నార్పకుండా చూసేవాడు. సాలీల్ల గూటి నిర్మాణం చూసి ఆశ్చర్యపోయే వాడు. సెల్ టవర్ల రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించి పోతున్నాయి అని కలత చెందుతూ ఉండేవాడు. అందుకే వాటి కోసం తోటలో అక్కడక్కడా గూళ్ళు, మంచినీటి పాత్రలు ఏర్పాటు చేశాడు. పిచ్చుక ల కిచకిచలు తోటంతా ప్రతి ధ్వని స్తుంటే పులకిస్తుంటాడు.

‘ ఎప్పుడూ ఆ తోటలోనేనా! మరో ప్రపంచం లేదా నీకు? ‘ అని తల్లితండ్రులు సున్నితంగా మందలించినా తోటని వదిలి రావడానికి ఇష్టపడేవాడు కాదు.

ఆదివారం హేమంత్ పెరట్లో చదువుకుంటూ ఉండగా ఎండిన ఆకుల చప్పుడయింది. చూస్తే ఏం లేదు. మళ్లీ చదువులో నిమగ్నమయ్యాడు. ఈసారి చప్పుడుతో పాటు హిస్.. హిస్ మనే బుసలు కొడుతున్న శబ్ధం వచ్చింది. హేమంత్ లేచి ఆ వైపు వెళ్లి పరిశీలించాడు. అక్కడో.. పెద్ద కొండచిలువ కనిపించింది. భయంతో కపించిపోయాడు. అది అటూఇటూ కదులుతోంది. హేమంత్ భయం నుండి తేరుకొని ఇంట్లోకి పరిగెత్తాడు.

‘ ఏమైందిరా? అలా వణుకుతున్నావు?’ అని వాళ్ళమ్మ ాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా అడిగేసరికి ‘ అమ్మా… తోటలో పెద్ద కొండచిలువ ‘ రొప్పుతూ చెప్పాడు. ఆమె వెంటనే భర్తకు ఫోన్ చేసింది. రఘుపతి కంగారుగా ఇంటికొస్తూ వెంట నలుగుర్ని తీసుకొని వచ్చాడు. వాళ్ల చేతిలో పెద్ద కర్రలున్నాయి. అందరూ కొండచిలువను వెతుకుతూ తోటలోకి అడుగుపెట్టారు. వాళ్ళతో పాటు హేమంత్ కూడా వెళ్లాడు. తోటలో ఓ గోడ మూలకు చుట్టచుట్టుకొని కనిపించింది.

‘ అదిగో.. అక్కడ వుంది! అమ్మో… ఎంత పెద్దదిగా వుందో! ‘ అని అరుస్తూ కర్రలు లేపారు వాళ్లంతా. కొండచిలువ ఆ అలికిడికి భయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తోంది. హేమంత్ కంగారుగా ‘ నాన్నా! పాపం ఆ కొండచిలువ ఏం చేసింది. దాన్ని ఎందుకు చంపుతున్నారు? అడవుల్ని నాశనం చేస్తుంటే ఆహారం వెతుక్కుంటూ జంతువులు, కొండచిలువలు ఊరిలోకి వస్తున్నాయి. తప్పు మనం చేసి వాటిని శిక్షించడం ఎందుకు నాన్న! వద్దు దాన్ని చంపకండి. అటవీశాఖ అధికారులకు అప్పగించండి ‘ అన్నాడు బాధగా మొహం పెట్టీ.

రఘుపతికి హేమంత్ ఆవేదన అర్థమై చంపుదామని వచ్చిన వాళ్ళను పంపించేసాడు. అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వాళ్ళు గంటలోనే అక్కడికి వచ్చి దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నారు. వెళ్తూ హేమంత్ ని అభినందించారు. ఆ తరువాత దాన్ని భద్రంగా అడవిలో విడిచిపెట్టారు. హేమంత్ ఆనందంతో నాన్నను కౌగిలించుకొని, కృతజ్ఞతలు చెప్పాడు. హేమంత్ మంచి మనసుకు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు.

కథ యొక్క నీతి: ప్రకృతిని ఆదరించి, జంతువులను హాని చేయకుండా సంరక్షించాలి.

Responsive Footer with Logo and Social Media