నక్క మరియు కొంగ
ఒక రోజు ఒక నక్క అడవిలో అలా నడుచుకుంటూ వెళుతుంది, దానికి ఒకచోట ఆహారం కనబడుతుంది. వేరే జంతువులు ఏమన్నా వచ్చి తన ఆహారం లో వాటా అడుగుతాయి ఏమో అని, కంగారుగా ఆహారం తినడం ప్రారంభించింది. అంతలో ఒక ఎముక దాని గొంతుకు అడ్డం పడింది, ఎంత ప్రయత్నించినా ఆ ఎముక బయటకు రాలేదు. ఏమి చేయాలో నక్కకు తోచలేదు, అంతలో అటుగా వెళుతున్న కోతిని ఆపి తనకు సాయం చేయమని అడిగింది. అప్పుడు కోతి,నేను నీకు సహాయం చేయలేను కానీ ఎవరు సహాయం చేస్తారో చెపుతాను అంది. అప్పుడు నక్క ఎవరు నాకు సహాయం చెయ్యగలరో చెప్పవా అని అడిగింది. అప్పుడు కోతి, కొంగ అయితే తన పొడవాటి ముక్కు తో నీ గొంతులో వున్న ఎముకను సులువుగా తీయగలదు అని చెప్పివెళ్లి పోయింది.
అప్పుడు నక్క, కొంగ దగ్గరకు వెళ్లి తనకు జరిగిన ప్రమాదం చెప్పి సహాయం చేయవలసింది గా కోరింది. దానికి కొంగ సరే నేను నీకు సహాయం చేస్తాను దాని వలన నాకు ప్రయోజనం ఏంటి అని అడిగింది, అందుకు నక్క నేను నీకు మంచి బహుమతి ఇస్తాను అంది. కొంగ ఆనందంగా ఒప్పుకొని నక్క గొంతులోవున్న ఎముక తీసివేసింది, నక్క హమ్మయ్య అనుకొని అక్కడనుండి నెమ్మదిగా జారుకోవాలి అనుకుంది ...అంతలో కొంగ ఆపి నాకు బహుమతి ఇస్తానని ఒప్పుకొని యిప్పుడు జారుకుంటున్నావ్ ఏమిటి అని అడిగింది. నక్క గట్టిగానవ్వి, నీ తల నా నోటిలో పెట్టావ్ అయినప్పటికీ నేను నిన్ను తినలేదు .. అదే నేను నీకు ఇచ్చే గొప్ప బహుమతి అని చెప్పి వెళ్ళిపోయింది. కొంగ తన అదృష్టానికి తానే ఆనంద పడుతూ ఎగిరిపోయింది.
కథ యొక్క నీతి: ఎటువంటి సందర్భమైన చెడ్డవారు తమ గుణం వదులుకోరు.