పంది భయం పంది



ఒక రోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది. గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది. నానా గోల పెట్టింది. ఎలాగో కష్ట పడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వేళ్ళ సాగాడు. అప్పు డైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. దాని మానాన్ని అది వదలకుండా మహా గోల పెడుతూనే వుంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది.

అలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది: “ఎందుకు అంత గోల పెడుతున్నావు? యెంత సిల్లీ గా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు. కానీ మేము ఎప్పుడు ఇలా గోల గోల పెట్టము. మర్యాదగా చెప్పిన మాట వింటాము”

వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలీనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి. దానికి పంది ఇలా జవాబు చెప్పింది. “మిమ్మల్ని గొర్రె లోడు జాగ్రత్త గా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి, మేతకు తీసుకువెళ్లి, మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు.

అందుకే మీకు అతనంటే భయం లేదు. కానీ నన్నేమి చేస్తాడో తెలీదు కదా? నన్ను వొండుకు తింటాడో, ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో? నా భయం నాకు ఉంటుంది కదా!” నిజమే. ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా, సాహస మంతుల లా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు. వాళ్ళ కష్టం అర్ధం చేసుకోవాలి.

కథ యొక్క నీతి: అపదను ఎదుర్కొంటున్నవారిని విమర్శించక, వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలి.

Responsive Footer with Logo and Social Media