పిసినారి రుద్రయ్య



భీముని పట్నంలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను ఎవరికీ ఏ సహాయం చేసేవాడు కాదు. ఎప్పుడూ 'ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా?' అని ఆలోచిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. తన ఇంటి ముందు ఉండడం వలన ఆ చెట్టు కూడా తనదేనని భావించేవాడు రుద్రయ్య.

ఒకరోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారినపోతూ, ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో రుద్రయ్య బయటకు వచ్చి, "ఈ చెట్టు నాది, దాని కింద కూర్చోవడానికి నికి వీల్లేదు," అన్నాడు. ఆ ఊరివారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు. అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తనను ఇప్పుడే చూశాడు.

రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య. అతనితో "నీ చెట్టు నీడను నేను కొనదలచుకున్నాను, అమ్ముతావా?" అని అడిగాడు. నీడ అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చని రుద్రయ్య చాలా ఆనందించాడు. డబ్బులు తీసుకుని నీడను ఎప్పుడైనా వాడుకోవచ్చని అనుమతించాడు.

సాంబయ్య రోజూ తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు. తన ఆవులను, మేకలను కూడా చెట్టుకు కట్టడం మొదలుపెట్టాడు. సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు జామున చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో, కిటికీ గుండా ఇంటి లోపల కూడా పడేది. సాంబయ్య తన ఆవును, మేకలను, స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకురావడం మొదలుపెట్టాడు. నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతనిని అనలేకపోయాడు.

ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతోంది. రుద్రయ్య స్నేహితులు, చుట్టాలు చాలా మంది వేరే ఊరు నుంచి వచ్చారు. రుద్రయ్య, "మా ఇంట్లో వేడుక జరుగుతోంది, ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? వెళ్లు," అన్నాడు. సాంబయ్య, "ఈ నీడ నాది. నువ్వే నాకు అమ్మావు, అదెక్కడుంటే అక్కడికి వెళ్లే హక్కు నాకుంది," అన్నాడు. రుద్రయ్య స్నేహితులు, చుట్టాలు అతను నీడను కూడా అమ్ముకున్నాడని వాళ్లలో వాళ్లు మాట్లాడుకొని నవ్వడం మొదలుపెట్టారు. రుద్రయ్యకు అవమానంగా అనిపించింది. తన పిసినారితనం పట్ల తనకే సిగ్గేసింది. బుద్ధి తెచ్చుకుని అప్పటి నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నాడు.

కథ యొక్క నీతి: లోభం తాత్కాలిక లాభం ఇవ్వవచ్చు, కానీ అవమానమే మిగల్చుతుంది.

Responsive Footer with Logo and Social Media