రాజుగారి కల
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలకు ఒక రోజు నిద్రలో ఒక కలవచ్చింది. ఆ కలలో ఆయన ఒక అందమైన, రత్నాలూ, వజ్రాలూ పొదిగిన బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఆ సింహాసనం ఎంత గొప్పదంటే, దానిమీద కూర్చోగానే కోరుకున్న చోటుకి క్షణంలో తీసుకెళ్లగలదు. అంతేకాదు, గాలిలో తేలే ఆ సింహాసనానికి పొదిగిన ప్రతి రత్నంలోనూ, వజ్రంలోనూ రాజుగారి ప్రతిబింబమే కనిపిస్తుంది. ఉదయాన్నే మెలకువ వచ్చిన రాజుగారికి ఎటు చూసినా ఆ సింహాసనమే కనిపించసాగింది. ఆ రోజు సభలో ఆయన తన కలను వివరించి, దాన్ని నిజం చేయాలని కోరారు.
అది విన్నవారంతా గాలిలో తేలే సింహాసనాన్ని తయారుచేయడం సాధ్యం కాదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. రాయలు కోపగించుకుని, "అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలియదు. కానీ నా కల నిజమవ్వాలి. అలాంటి సింహాసనాన్ని చేయించిన వారికి లక్ష వరహాలు బహుమతిగా ఇస్తాను," అని ప్రకటించారు. ఎన్ని రోజులు గడుస్తున్నా రాయలు తన కల గురించి చెప్పడం మాత్రం మానలేదు.
ఒక రోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు. నెరిసిపోయిన జుట్టూ, గడ్డం, మీసాలతో కర్ర సహాయంతో అతి కష్టంగా నడుస్తున్నాడు. రాయలవారిని సమీపించిన ఆ వృద్ధుడు, "నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి ప్రభూ," అని ప్రార్థించాడు. "నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు. నేను నీకు న్యాయం చేస్తాను," అని రాయలు హామీ ఇచ్చారు.
"నా దగ్గర నూరు బంగారు నాణేలుండేవి ప్రభూ, అవి ఒకరు దొంగిలించారు. వారెవరో నాకు తెలుసు, వారిని అడిగి నా నాణేలు నాకు ఇప్పించండి చాలు," అని వృద్ధుడు వేడుకున్నాడు. అదంతా శ్రద్ధగా విన్న రాయలు, "ఈ దొంగతనం ఎవరు చేశారు? ఎక్కడ జరిగింది?" అని ప్రశ్నించారు. వృద్ధుడు తటపటాయించడం చూసి, "నీకేం భయంలేదు, చెప్పు," అంటూ ప్రోత్సహించారు.
"నా నూరు నాణేలనూ దొంగిలించింది మీరే ప్రభూ. నిన్నరాత్రి నా కలలో వచ్చి, మీరే వాటిని తీసుకెళ్లిపోయారు," అంటూ తన కలను వివరించాడు వృద్ధుడు. రాయలకు చాలా కోపం వచ్చింది. "ఏమిటీ ప్రేలాపన! కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా?" అంటూ అసహనంగా వృద్ధుడివైపు చూశారు. ఈ మాట విన్న వృద్ధుడు తన గెడ్డం, మీసం తీసేసి, తన వేషాన్ని విప్పేశాడు. చూస్తే అతను తెనాలి రామకృష్ణుడు.
"క్షమించండి స్వామీ! మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను," అన్నాడు తెనాలి రామకృష్ణుడు. రాయలకు చాలా నవ్వొచ్చింది. ఇంత చక్కగా తనకు అర్థమయ్యేలా వివరించిన రామలింగడిని ఎంతగానో అభినందించారు!
కథ యొక్క నీతి: కలలు నిజమవ్వాలంటే కార్యాచరణ ఉండాలి, అసంభవాన్ని ఆశించడం వ్యర్థం.