రెండు విందులు



ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ, దారిలో తినడానికి భార్యను ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు. భార్య ఐదు మినప సున్ని ఉండలు చేసి గుడ్డలో మూటకట్టి ఇచ్చింది.

అతను ఆ మూట కర్రకు తగిలించుకొని, కర్ర భుజాన పెట్టుకుని బయలుదేరాడు. పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెడురుపొద కనిపించాయి. ఆ చెరువులో కాసిని నీళ్లు తాగి, భుజం మీద మూట వెదురు పొదలో ఒక గడకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్ర పోయాడు.

కొంత పొద్దెక్కినాకాగానీ అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచే సరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండి ఎదురుగడ ఎందుకు పైకి నిలబడి ఉంది. దానితో పాటు అతని మినపసున్ని ఉండలు మూట కూడా పైకి వెళ్ళింది. మళ్లీ సాయంకాలం అయితే గానీ మూట కిందకు రాదని గ్రహించి అతని ఆకలి తోటే మళ్ళీ నిద్ర పోయాడు.

ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఐదుగురు గంధర్వులకు మినపసున్ని ఉండలు వాసన తగిలింది. వెదురు గడకు వేలాడే మూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న ఐదు మినపసున్ని ఉండలు ఐదుగురు తిన్నారు. చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూచి అతను బీద స్థితికి జాలిపడి సున్నిఉండలకు బదులు ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్లిపోయారు.

అతను లేచేసరికి సాయంకాలం అయింది. వెదురుగడ కిందకి వంగి ఉంది. ఆకలి దహించుకు పోతుండడంవల్ల అతను ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలో నుండి ఇద్దరు గాంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్లి మాయమయ్యారు.

అతను భోజనం చేసి, సంతోషంతో పెట్టె తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరిని పిలిచి, పెట్టె సహాయంతో వచ్చిన వారందిరికీ షడ్ర సోపేతంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్లిపోయారు.

తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడివల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలంవల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకు రావాలనుకున్నాడు. భార్యచేత మినపసున్ని ఉండలు చేయించుకొని తాను కూడా తమ్ముడు వెళ్లిన దారినే బయలుదేరాడు.

వెళ్లి వెళ్లి ఇతనుకూడా చెరువు దగ్గరకి చేరుకున్నాడు. వెదురు పాదకు మూట తగిలించి పడుకొని నిద్ర పోయాడు. ఎప్పటిలాగే ఐదుగురు గంధర్వులు అటుగా వెళ్లుతూ సున్నిఉండల వాసన పసిగట్టి మూటవిప్పి చూశారు. “ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్లీ వచ్చాడు. చాలా ఆశాపాతకుడుగా ఉన్నాడే” అనుకున్నారు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్లిపోయారు.

మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె వుంది. తనపని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకు చూపించాడు. వారి ఆనందానికి హద్దు లేదు.

మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందిరిని విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచే సరికి అందులో నుండి అతిధికి ఇద్దరేసి మంగళ్ళు పొదులతో సహా బయటికి వచ్చారు. ప్రతి అతిధినీ ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా గొరగసాగాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లు అయ్యాయి. తర్వాత మంగలి వాళ్లంతా పెట్టెలోకి వెళ్లి మాయమయ్యారు.

ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తట్టని వాళ్ళు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకు దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు.

కథ యొక్క నీతి: ఈ కథ మనకు తెలిపేది, తమ ఆశలను నిర్లక్ష్యం చేసి అహంకారం, మితిమీరిన ఆశలు మనకు నష్టాన్ని తీసుకువస్తాయని.

Responsive Footer with Logo and Social Media