ఋష్యశృంగుడు
రోమశుడు ధర్మరాజుకు ఋష్యశృంగుని గురించి చెప్పసాగాడు. " ధర్మరాజా ! కశ్యపుని కుమారుడు విభాండకుడు. అతను ఒకరోజు సరసులో స్నానం చేస్తున్నాడు. అతనికి ఆ సమయంలో దేవ వేశ్య ఊర్వశి కనిపించింది. అతడు ఆమె పట్ల వ్యామోహ పీడితుడైన కారణంగా రేతఃపతనం జరిగి సరస్సులో పడింది. అతని రేతస్సుతో కూడిన నీటిని త్రాగిన దుప్పి గర్భందాల్చి ఋష్యశృంగుని ప్రసవించింది. విభాండకుడు కుమారుని గుర్తించి పెంచుకోసాగాడు.
ఋష్యశృంగునికి తండ్రి తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఆ సమయంలో అంగదేశాన్ని రోమపాదుడు అనే రాజు పాలిస్తున్నాడు. అతను తన పురోహితునకు చేసిన అపరాధం కారణంగా రాజ్యంలో క్షామం ఏర్పడింది. రోమపాదుడు తన తప్పు గ్రహించి బ్రాహ్మణులను తిరిగి రప్పించాడు. వారిని వానలు కురవడానికి ఉపాయం చెప్పమని అడిగాడు. వారు " రాజా! ఋష్యశృంగుని నీ రాజ్యానికి రప్పిస్తే వానలు కురుస్తాయి " అన్నారు. రోమపాదుడు ఋష్యశృంగుని రాజ్యాన్ని రప్పించటానికి కొంత మంది వేశ్యలను పంపాడు. ఒకరోజు విభాంకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుని వదిలి పండ్లు, సమిధలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ సమయంలో రోమపాదుడు పంపిన వేశ్య ఆశ్రమానికి వచ్చింది.
ఋష్యశృంగుడు ఆమె తనలాగే ఋషి కుమారుడు అనుకుని ఆమెకు అతిధి సత్కారం చేసాడు. ఆమె ఋష్యశృంగుని తనతో స్నేహం చెయ్యమని కోరింది. ఆపై ఆటపాటలతో అలరించి తిరిగి వెళుతూ ఇంటికి రమ్మని ఋష్యశృంగుని ఆహ్వానించింది. ఋష్యశృంగుడు ఆమె ధ్యాసలో పడి ఆహారపానీయాల కూడా ధ్యాస మరిచాడు. విభాంకుడు కొడుకు పరధ్యానం గ్రహించి కారణం అడిగాడు. ఋష్యశృంగుడు జరిగినది చెప్పాడు. విభాంకుడు " నాయనా! ఋషుల తపస్సు చెడగొట్టడానికి రాక్షసులు ఇలా మాయవేషాలలో తిరుగుతుంటారు. జాగ్రత్తగా ఉండు " అన్నాడు.
మరునాడు కూడా వేశ్య విభాంకుడు లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చింది. ఆమె మోహంలో పడి ఋష్యశృంగుడు ఆమె వెంట అంగరాజ్యానికి వెళ్ళాడు. ఋష్యశృంగుని రాకతో అంగ రాజ్యంలో వానలు కురిసాయి. రోమపాదుడు సంతోషపడి తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసాడు. విభాండకుడు ఆశ్రమంలో కుమారుని జాడ లేక పోవడంతో వెతుక్కుంటూ అంగదేశానికి వచ్చాడు. అక్కడ కొడుకు కోడలిని చూసి సంతోషించి వారిని తన ఆశ్రమానికి తీసుకు వచ్చాడు " అని చెప్పాడు.