సాధన అంటే ఇలా ఉండాలి!
దక్షిణదేశంలో 'తిరువళ్లువార్' అనే పేరును విననివారు అరుదు. అతడు మహాభక్తుడు, జ్ఞాని. నేత నేసి తన సంసారాన్ని నిర్వహించే వాడు. వారంలో ఒకనాడు పూర్తిగా భగవంతుని సేవలో తన జీవితం అంకితం చేసేవాడు. ఆయన భార్య వాసుకి. కాపురం ప్రారంభమైనప్పుడు అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశాల ప్రకారం విస్తరి పక్కన ఒక దొన్నెలో నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేవాడు.
అయితే భర్త ఆ దొన్నె నీటిని గాని, సూదిని గాని ఎప్పటికీ ఉపయోగించలేదు. వాసుకి తన అంత్యకాలం సమీపిస్తున్నప్పుడు, ఒక రోజు భర్తను అడిగింది, "మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కాని మీరు ఏనాడూ దొన్నెలో నీరుగాని, సూదిగాని ఉపయోగించటం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన ఉంచమని చెప్పినప్పుడు మీ ఉద్దేశ్యం ఏమిటి, అది నాకు సందేహంగా ఉంది."
తిరువళ్లువార్ చిరునవ్వుతో ఇలా అన్నాడు: "అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించడం. అన్నాన్ని కింద పడేయరాదు, వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించే సమయంలో పొరపాటున అన్నం కింద పడితే, దానిని సూదితో తీసుకుని నీటిలో శుద్ధి చేసి ఆకులో పెట్టాలని నా ఉద్దేశ్యం. నీవు ఏనాడూ పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కిందపడేయలేదు, అందుకే సూదిని, నీటిని ఉపయోగించే అవసరం రాలేదు.
" వాసుకి సందేహం తీరి, భర్త ఒడిలో ప్రాణం వదిలింది. తిరువళ్లువార్ అన్నాన్ని బ్రహ్మంగా భావించాడు. అతని భార్య కూడా అన్నాన్ని బ్రహ్మభావంతో, కిందపడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో చేస్తే, ఇంతకంటే గొప్ప సాధన మరొకటి ఉండదు.
కథ యొక్క నీతి: అన్నాన్ని బ్రహ్మంగా భావించి, ప్రతిసారీ జాగ్రత్తగా వడ్డించడం వాస్తవ సేవ.