సైంధవుడు ద్రౌపదిని తీసుకుని పోవుట
ఒక రోజు పాండవులు అడవికి వేటకు వెళ్ళారు. ద్రౌపది కుటీరంలో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో సింధు దేశాన్ని పాలించే సైంధవుడు తన చతురంగ బలాలతో పెక్కుమంది ఇతర మిత్ర రాజులతో కలిసి సాళ్వరాజ పుత్రిని వివాహం చేసుకోవడానికి పయనిస్తూ మార్గ మధ్యంలో కామ్యకవనం చేరుకున్నాడు. కుటీరం ముందు నిలిచి ఉన్న ద్రౌపదిని చూసి మోహ పరవశుడైయ్యాడు. తన మిత్రుడైన కోటికాస్యుని పిలిచి " ఈ సుందరాంగి ఎవరు? ఆమెపట్ల నా మనసు లగ్నం అయింది. ఆమెతో మాట్లాడి ఎలాగైనా నన్ను చేరేలా చెయ్యాలి " అన్నాడు.
కోటికాస్యుడు ద్రౌపది వద్దకు వెళ్ళి " లలనా! నీవెవరు, వన్యమృగాలు తిరిగే ఈ అడవిలో ఎందుకు ఉన్నావు. వనదేవతవా? శచీదేవివా? లక్ష్మీ దేవివా? నీ భర్త ఎవరు? నీ పేరేమి? నా పేరు కోటికాస్యుడు. మహా బలవంతుడను. అడుగో అక్కడౌన్న వాడు త్రిగర్త దేశాధి పతి, ఆ పక్కన కళింగ దేశాధిపతి, ఆ పక్కన ఉన్నది సింధు దేశాధీశుడు జయద్రధుడు. అతనికి నీ మీద మనసు కలిగింది. అందుకే నన్ను పంపాడు " అన్నాడు. ఆ మాటలు విన్న ద్రౌపది " అన్నా నేను ఒంటరి దానను, పుత్రవతిని నీవు నా దగ్గరకు రావడం తగదు. నన్ను సామాన్య స్త్రీగా ఎంచ వద్దు. నేను పాంచాలరాజ పుత్రిని, నా పేరు కృష్ణ, పాండవుల ధర్మ పత్నిని వారితో వనవాసం చేస్తున్నాను. కొంత సేపట్లో నా భర్తలు వస్తారు. ఈ సమీపంలో కొంత సమయం ఉండండి. వారు రాగానే అతిథి సత్కారం చేస్తాను " అన్నది.
కోటికాస్యుడు జరిగినది జయద్రధునికి చెప్పాడు. ఎలాగైనా ద్రౌపదిని అపహరించాలన్న ఉద్దేశంతో జయద్రధుడు కుటీరంలో ప్రవేశించాడు. ద్రౌపదితో " ద్రౌపదీ! నీవూ పాండవులు క్షేమమేనా? " అన్నాడు. ద్రౌపది " అయ్యా! అందరూ క్షేమమే నీవు మా అతిథివి. నా భర్తలు వేటకు వెళ్ళారు. వారు రాగానే మీకు అతిథి సత్కారాలు చేస్తారు " అన్నాడు. సైంధవుడు " ద్రౌపదీ! నీ మీద నాకు మనసైంది. రాజ్యమును కోల్పోయిన పాండవులతో నీవు పొందే సుఖం ఏమి? నాతో వచ్చిన సౌఖ్యములు అనుభవించగలవు " అన్నాడు. ఆ మాటలకు ద్రౌపది భయపడింది. పాండవులు వచ్చే వరకు నిరీక్షించాలని అనుకుంది. అంతవరకు అతనిని ఎలాగైనా మాటలలో పెట్టాలని అనుకుంది. " అయ్యా! నీవు నా భర్తల సోదరి దుస్సల భర్తవు. ఆమె నా భర్తల సోదరి కనుక నీవు నాకు సోదరుడివి. నువ్వు ఇలా మాట్లాడటం తగదు. జయద్రధుడు " ద్రౌపదీ ! రాజులకు ఆడువారి విషయంలో వావి వరసలు లేవు. అది రాజధర్మం. రాజులు తమకు ఇష్టం వచ్చినట్లు వినోదించవచ్చు.
స్త్రీలు ఏ ఒక్కరి సొత్తు కాదు. ఏవరినైనా కోరిన పొందవచ్చు" అన్నాడు. ద్రౌపది ఇక వీడు మంచి మాటలతో వినడు అనుకుంది. " ఓరి! క్షత్రియ కులములో పుట్టిన అధముడా! పాండవుల పరాక్రమం తెలిసి నన్ను అవమానిస్తున్నావు. ఫలితం అనుభవిస్తావు. జయద్రధా భీముని సంగతి తెలుసు కదా గుహలో నిద్రిస్తున్న సింహాన్ని జూలుపట్టుకు లాగుతున్నావు. అర్జునిని గురించి అతని గాండీవం గురించి తెలియునా? అతనికి ఆగ్రహం తెప్పించిన వాడు బ్రతకడం అసాధ్యం. నకులసహదేవులను అవమానించడం త్రాచుపాములను తొక్కడం వంటిది. ఎలాగైనా నేటితో నీకు చావు మూడింది కనుకనే ఇలా మాట్లాడుతున్నావు. జాగ్రత్త " అని హెచ్చరించింది. ఆ మాటలకు జయద్రధుడు నవ్వి " పాండవుల పరాక్రమం నాకు తెలియును. నన్ను భయపెట్టకు. మేము పరాక్రమవంతులమే. ఇక మారు పలుకక ఆ బంగారురథంలో ఎక్కుము " అన్నాడు. "
జయద్రధా! నేను మహా వీరుల ధర్మపత్నిని. శ్రీకృష్ణుడు నా అన్న. నేను పతివ్రతను. నా పాతివ్రత్యం నిన్ను దహించ గలదు. అర్జునుని గాండీవం, భీమసేనుని గధాపాతానికి నీ మదం అణుగుతుంది " అన్నది. కాని సైంధవుడు వినక ఆమె చీరపట్టుకుని లాగాడు. ఆమె అతడిని బలంగా నెట్టింది సైంధవుడు కింద పడ్డాడు.
ద్రౌపది గట్టిగా అరుస్తూ ధౌమ్యుడిని పిలిచింది. సైంధవుడిలో పట్టుదల పెరిగి ద్రౌపదిని బంధించి రథం పైకి ఎక్కించి తీసుకుపోసాగాడు. అది చూసిన ధౌమ్యుడు " అయ్యా! రాజులకు ఇలా దుష్కర్మలు చేయడం తగునా! ఆమెను వదిలి పెట్టుము. నీ పాపం నిన్ను నాశనం చేస్తుంది " అంటూ రథం వెంట పరుగెత్తాడు. పాండవులు ఇంటికి రాగానే వారికి దుశ్శకునాలు గోచరించాయి.
ద్రౌపది పరిచారిక వారికి జరిగినది వివరించింది. పాండవులకు కోపం వచ్చింది వెంటనే సైంధవుడు వెళుతున్న దిక్కుకు పరుగెత్తారు. రథం వెనుక పరుగెడుతున్న ధౌమ్యుని వెనుకకు పంపి పాండవులు సైంధవుని వెంబడించారు. తన రథం వెనుక వస్తున్న పాండవులను చూసిన సైంధవుడు " ద్రౌపదీ! వారిలో నీ భర్తలు ఎవరు చెప్పవా? " అని చమత్కరించాడు. ద్రౌపది " నీవు! పాండవులను గురించి తెలుసుకున్నా ప్రయోజనం లేదు. ఇక నీకు శిక్ష తప్పదు. అయినా అడిగావు కనుక చెప్తాను. చచ్చే ముందు వారి గురించి తెలుసుకో " అని పాండవుల గురించి వివరంగా చెప్పింది.