సకలేశ్వరు మాదిరాజయ్య కథ
శ్రీ సకలేశ్వరు మాదిరాజయ్యగారనే భక్తుడు ఉండేవాడు. ఆయన వీణావాదనంతో శివుణ్ణి ఆనందపరుస్తూ అర్చన చేస్తూ వుండేవాడు. మల్లరసు అనే రాజు రాజ్యం త్యజించి శ్రీశైలం వద్ద తపస్సు చేసుకుంటూ వుండగా ఆయనను చూడాలని మాదిరాజయ్యగారు శ్రీశైలం వెళ్లారు. (ఇక్కడ శ్రీశైల వర్ణన సుదీర్ఘంగా పాల్కురికి చేశాడు) అక్కడ చెట్లన్నీ రుద్రాక్ష చెట్లే. అక్కడి గనులన్నీ విభూతిగనులే.
అక్కడి నీళ్లన్నీ లింగ తీర్థములే. అక్కడి సమస్త సృష్టీ శివపూజామయమే. అటువంటి చోటికి వచ్చి మల్లరుసు కోసం వెతకసాగాడు. మల్లికార్జునాచార్యుడు మాదిరాజయ్యను పరీక్షించాలని తన దేహాన్ని భూమ్యాకాశాలు పట్టనంతగా పెంచాడు. మాదిరాజయ్య మల్లికార్జునుని తల కోసం మూడేళ్లు ప్రయాణం చేసి అలసిపోయాడు. పాదాభివందనం చేయకుండా ఉండడమెట్లా అని మల్లికార్జునుని పాదాల కోసం మాదిరాజయ్య ప్రయాణం చేసి ఎనిమిదేళ్లు నడిచి విసిగిపోయాడు.
అప్పుడు భయభ్రాంతుడై ‘‘స్వామీ! మిమ్మెరుగ నేనెంతవాడిని’’ అని ప్రణామం చేశాడు. మల్లికార్జునుడు చిరునవ్వు నవ్వి తన మామూలు రూపం ధరించి మాదిరాజును ఆదరించాడు. మాదిరాజు తాను అక్కడనే ఉండాలని కోరికను వ్యక్తపరచాడు. మల్లికార్జునుడు మాదిరాజయ్యను ఒక తుమ్మ చెట్టుగా మార్చి నిశ్చలంగా తపస్సు చేసుకోమన్నాడు. మాదిరాజు తపసు చేసుకుంటున్నాడు.
ఒకనాడు మల్లికార్జునుడు గొల్లని వేషం ధరించి వచ్చి తుమ్మ కొమ్మలు కొట్టబోగా ‘ఒరే! గొల్లడా! నీకు బుద్ధిలేదా’ అని మాదిరాజు తుమ్మచెట్టు రూపంలోనే ఉండి కోప్పడ్డాడు. అప్పుడు గొల్లని రూపం వదిలి మల్లికార్జునుడు ‘నీవేమి తపసివి! కోపం పోలేదే’ అని పరిహసించాడు.
మాదిరాజయ్య దుఃఖించాడు. మల్లయ్య మాదిరాజును కౌగలించుకొని ఆయనకు మామూలు రూపమిచ్చి ‘‘భూమిమీదికి బసవడనే భక్తుడు వచ్చి వున్నాడు. నీవు అక్కడికి పోయి ఆయనతో కలిసి గోష్ఠి చేయవలసింది’’ అని చెప్పాడు. మాదిరాజు మల్లయ్యకు శరణు చేసి శ్రీగిరినుండి కల్యాణం వచ్చి అక్కడ బసవన్నను కలిశాడు.
బసవన్న మాదిరాజును ఆదరించి సమస్త పూజలతోనూ తృప్తిపరిచాడు.