శంకర్ – సహాయం



నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి శంకర్. అతను తన కుటుంబం యొక్క ఆకలిని తీర్చడం కోసం ప్రతీరోజు పక్కనే ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి, పట్నంలో అమ్మేవాడు. వచ్చిన డబ్బులతో జీవనం గడిపేవారు.

ఒకరోజు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా ఒక ముసలి వ్యక్తి ఆకలితో అలమటించడం చూసాడు. శంకర్, అతని దగ్గరకు వెళ్లి… "పెద్దాయన, నువ్వు ఇక్కడే ఉన్నావు..? ఎక్కడ మీ ఇల్లు..?" అని అడిగాడు. అప్పడు ఆ వ్యక్తి "నేను ఇక్కడే నివసిస్తాను. ఇక్కడే చెట్ల నుండి పండ్లు కోసుకుని తింటూ జీవనం సాగిస్తాను. కానీ, రెండు రోజుల నుండి కోతుల బెడద ఎక్కువగా ఉండటం కారణంగా పండ్లు దొరకడం లేవు" అన్నాడు.

"అయ్యో…! అవునా?" అని శంకర్ ఆలోచించాడు. "నాకు ఇక్కడ నీకు అందించగల ఆహారం లేదు" అని చింతించాడు. కట్టెలు కొట్టే పనిని ముగించి ముందుకు కదిలాడు. అలా వెళుతూ ఉండగా దారిలో ఒక జింక కనబడింది. అది దాహంతో నీటి కోసం వెతకడాన్ని గమనించిన శంకర్, దగ్గరికి వెళ్లి "ఈ పక్కనే ఒక సరస్సు ఉంది కదా! ఇక్కడ నీటికోసం ఎందుకు వెతకుతున్నావు?" అని అడిగాడు. "ఇది వేసవి కాలం అయిన కారణముగా సరస్సు ఎండిపోయింది. అందుకే అడవిలో ఉన్న ఏ జంతువుకి కూడా నీరు లభించడం లేదు" అంది.

ఆ మాట విన్న శంకర్ కు చాలా బాధేసింది. కానీ, ఇవ్వడానికి తన దగ్గర నీరు కూడా లేదు. తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మెల్లగా చీకటి పడటం మొదలైంది. కాస్త దూరంలో కొంతమంది వ్యాపారులు ఆ రాత్రి అడవిలో బస చేయాలి అనుకున్నారు. చలిగా ఉన్న కారణంగా వేడి కోసం మంటని వెలిగించాలి అని చూస్తున్నారు. అక్కడ చూస్తే అన్నీ మహా వృక్షాలు ఉన్నాయి. వారి దగ్గర వాటిని నరకడానికి ఎలాంటి సాధనాలు లేవు. కనుక అందరు కలిసి చిన్న చిన్న పుల్లలను వెతకడం మొదలు పెట్టారు.

అది గమనించిన శంకర్, వారి దగ్గరకు వెళ్లి తాను కొట్టుకువచ్చిన కట్టెలలో కొన్ని తీసి వారికి ఇచ్చాడు. ఆ వ్యాపారులు సంతోషపడి శంకర్ కి తమ దగ్గర ఉన్న ఆహారం మరియు నీటిని ఇచ్చారు. వాటిని తీసుకొని శంకర్ వెనక్కి వెళ్లాడు. దాహంతో ఉన్న జింకకి నీటిని ఇచ్చాడు. ఇంకాస్త దూరం వెళ్లి ఆకలితో ఉన్న ఆ పెద్దాయనకు ఆహారాన్ని అందించాడు. సంతోషించిన ఆ పెద్దాయన, తన దగ్గర ఉన్న కొన్ని బంగారు నాణేలని శంకర్ కి ఇచ్చాడు.

శంకర్ కి కట్టెలు కొట్టడం రోజూవారీ దినచర్య. కాబట్టి, రోజు అడవికి వెళ్లడం, కట్టెలు కొట్టడం, దారిలో కనబడిన జంతువులకు, మనుషులకు సహాయం చేయడం అనేది అతనికి అలవాటు మరియు అతని గొప్ప మనస్సుకు చిహ్నం.

ఒకరోజు కట్టెలు కొడుతున్న సమయంలో చెట్టు నుండి జారీ కిందపడ్డాడు. కాలు విరగడంతో ఎక్కడికి కదలలేని పరిస్థితి. అక్కడే ఉండి ఎవరో వస్తారేమో అని ఎదురుచూడసాగాడు. అంతలోనే అక్కడికి జింక (దాహాన్ని తీర్చిన జింక) వచ్చింది. శంకర్ ని చూసిన జింక వెంటనే పరుగెత్తుకెళ్లి దగ్గర్లోనే ఉన్న పెద్దాయనని (ఆకలిని తీర్చిన వ్యక్తి) తీసుకొచ్చింది.

వెంటనే ఆ పెద్దాయన అడవిలోని మూలికలను సేకరించి శంకర్ కాలికి కట్టు కట్టాడు. రెండు రోజుల్లోనే శంకర్ కాలు నయమయింది. తరువాత ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే కంగారుతో ఎదురు చూస్తున్నా ఇంటి సభ్యులకి అసలు విషయం చెప్పాడు. "ఆ జింక మరియు పెద్దాయన లేకపోయుంటే .. నేను ఈ రోజుకి కూడా ఇంటికి రాకపోయేవాడిని" చెప్పాడు. కుటుంబ సభ్యులంతా మనసులో వారికి కృతజ్ఞతలు చెప్పి ఊపిరి పీల్చుకున్నారు.

కథ యొక్క నీతి: మీరు ఇతరులకు సహాయం చేస్తే, వారు కూడా మీకు సహాయం చేస్తారు.

Responsive Footer with Logo and Social Media