సింహం మరియు తోడేలు
అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది దానిలో ఒక సింహం ఒక తోడేలు స్నేహం గా ఉండేవి. ఒకరోజు అడవిలో అవి రెండూ మాటలాడుకుంటూ చాలా దూరం వచ్చేసాయి, అసలే ఎండాకాలం పైగా వేడిగాలులు ఇద్దరికీ గొంతుఆర్చుకు పోయింది. ఎక్కడన్నా తాగడానికి కొన్ని నీళ్లు దొరికితే బాగుణ్ణు అంటూ నీళ్ల కోసం వెతకం ప్రారంభించాయి.
కొంతదూరం వెళ్ళాక ఎండిపోవడానికి సిద్ధం గా వున్న ఒక మడుగులో కొన్ని నీళ్లు కనిపించాయి, హమ్మయ్య ... బ్రతికించావ్ దేవుడా అనుకుంటూ నీరు తాగడానికి మడుగు దగ్గరకు వెళ్లాయి కాని దాని లో నీరు చాలా తక్కువుగా ఒకరికి మాత్రమే సరిపోయేలా వున్నాయి.
అవి చూసిన సింహం తోడేలు నేను ముందు తాగుతాను అంటే నేను ముందు తాగుతాను అంటూ కొట్టుకోవడం ప్రారంబించాయి. అలా కొంతసమయం గడిచాక వారిద్దరిని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించి ప్రక్కకు చూశాయి అక్కడ ఒక రావి చెట్టుమీద ఒక పెద్ద రాబందు కూర్చొని వీరిద్దరిని గమనిస్తుంది.
అది చూసిన సింహం, తోడేలు కు గుండెజల్లు మంది, ఏంటి... ఈ రాబందు మన మిద్దరము కొట్టుకొని దానిలో ఎవరో ఒకరు చనిపోతే మన మాంసం తిందామని ఎదురుచూస్తుందా అని ఒకరితో ఒకరు అనుకొని వెంటనే దెబ్బలాట ఆపేసి ఉన్న నీరుని సర్దుకొని తాగాయి.
ఊహించని విధంగా జరగక పోవడంతో రాబందు అక్కడనుండి నిరాశగా ఎగిరిపోయింది.
చూసారా మన జీవితంలో కూడా అంతే,మనం మన అహంకారంతో లెక్కలేనితనము తో మన వారితో మనమే విభేదిస్తూ ఉంటాం అటువంటి సందర్భం కోసం ఎదురుచూస్తున్న ఇలాంటి రాబందులు మనలను మనవారినుండి విడదీసి దానిలో ఆనందం లాభం పొందుతారు జాగ్రత్తగా గమనించండి బంధాల్ని కాపాడుకోండి.
కథ యొక్క నీతి: మన అహంకారమూ, గొడవలూ సంబంధాలను నాశనం చేస్తాయి, ఇతరులు మన బలహీనతలను ఉపయోగించుకుంటారు. అందుకే మన సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరం.