స్నేహం - స్వార్ధం
అనగనగా పర్వతాపురం అనే ఒక ఊరిలో గోపి, శ్యామ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉండేవారు వారిద్దరూ తెలివైనవారైనప్పటికీ చదువైన తరవాత ఏ పని చేయకుండా ఊరిలో ఖాళీగా తిరుగుతూ "మేము ఈ ఊరిలో అందరికన్నా తెలివైన వాళ్ళం... మేము అందరికన్నా గొప్పగా స్థిరపడతాం ఎప్పటికైనా..." అని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు.
వీరి ప్రవర్తన వీరి మాటతీరు చూసి వీరి తల్లి దండ్రులతో సహా వూరిలో వారందరూ వీరిని చులకనగా చూసేవారు, మిత్రులిద్దరూ మాత్రం మనకీ ఒక అవకాశం వస్తుంది అప్పుడు మనమేంటో చూపెడదాం!! అని తమని తాము సమర్థించుకొనేవాళ్ళు.
ఒక రోజు గ్రామపెద్ద ఊరిలో వారందరూ ఒకచోట సమావేశమవ్వాలని, అందరం కలసి ఒక సమస్య గురించి చర్చించాలని దండోరా వేయించాడు.
అదే రోజు అందరు ఊరిమద్య వున్న మర్రి చెట్టు క్రింద సమావేశమయ్యారు. అప్పుడు గ్రామపెద్ద ఊరి ప్రజలను ఉద్దేశించి, చూడండి మీలో చాలా మందికి తెలిసిన విషయమే, మన ఊరిలో చాలామంది గత కొంత కాలంగా విషజ్వారాలుతో బాధపడుతున్నారు. అది ఊరి ప్రజలందరికీ వ్యాపిస్తుంది అని మన వైద్యుడుగారు చెప్పారు అంతేకాకుండా దీనికి నివారణ కూడా వివరించారు . అదేంటంటే మన ఊరి ప్రక్కన వున్న పర్వతంపై నీలం రంగు ఆకులు కలిగిన చిన్న మొక్కలు ఉంటాయి వాటిని తీసుకు వచ్చి మన మంచినీటి చెరువు చుట్టుప్రక్కల వేస్తే వాటి ప్రభావం వలన నీటి ద్వారా మనకు వచ్చిన జ్వరాలు అన్ని తగ్గిపోతాయని చెప్పారు. కాబట్టి వాటిని ఎవరు తెస్తారు అన్నాడు.
అప్పుడు ఊరిలో వారందరూ ఆ పర్వతం చుట్టూ పదుల సంఖ్యలో పులులు వున్నాయి అని మనందరికీ తెలుసు అటువంటప్పుడు ఎవరు ప్రాణత్యాగం చేస్తారు అన్నారు.
అది విన్న గ్రామపెద్ద వాటిని తీసుకు వచ్చిన వారిని మన ఊరి గ్రామాధి కారిని చేస్తాను అన్నాడు.
"గ్రామాధికారి” అనే మాట వినేసరికి అప్పటి వరకు నిశ్శబ్దంగా జరిగింది వింటున్న మిత్రులిద్దరూ, అబ్బా!! భలే అవకాశం వచ్చింది అనుకుంటూ ... ముందుకు వచ్చి ముక్త కంఠంతో మేము తెస్తాం అన్నారు.
అనుకున్నట్లుగానే మరుసటిరోజు ప్రయాణమయ్యారు, కొండ చుట్టూ రెండురోజులు కాళ్ళు అరిగేలా తిరిగినా ఆ మొక్క కనబడలేదు...! పులీ కనబడలేదు
అప్పుడు గోపి, శ్యామ్ తో ఒరేయ్ మనం దైర్యం తెచ్చుకొని కొంత ఎత్తువరకైనా కొండ ఎక్కుదాం, ఏమో మన అదృష్టం బాగుంటే అక్కడే ఆ మొక్క దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు. అప్పుడు శ్యామ్ సరేరా అక్కడ పులిగాని ఉంటే మన లో ఎవరో ఒకరిని తింటుంది మిగిలిన వాళ్ళమైనా గ్రామాధికారి అయి జీవితంలో స్థిరపడదాం అని చెప్పి భయంగా కొండెక్కారు, కొంత ఎత్తు ఎక్కేసరికి ఆ మొక్కలు కనబడ్డాయి హమ్మయ్య !! అనుకోని వాటిని తీసుకొని గబగబా కొండదిగారు.
కొంత దూరం అయ్యేసరికి అలసట వచ్చి యిద్దరూ చెట్టుక్రింద పండుకున్నారు, శ్యామ్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు కానీ గోపి మనసులోకి ఒక దురాలోచన వచ్చింది యిప్పుడు మేమిద్దరం ఈ మొక్కను తీసుకొని వెళితే ఎవరికి గ్రామాధికారి పదవి దక్కుతుంది ? ఒక వేళ శ్యామ్ కి దక్కితే నాపరిస్థితి ఏంటి? మళ్ళీ ఊరిలో అవమానాలేనా....! లేదు!!, నేను ఈ అవకాశం వదులుకోకూడదు, శ్యామ్ కి మత్తిచ్చి ఇక్కడే పండుకోబెట్టి నేను మాత్రమే ఆ మొక్క తెచ్చానని ఊరివారిని నమ్మిస్తా .. గ్రామాధికారి పదవిపొందాక శ్యామ్ కి క్షమాపణలు చెప్పి మంచి పదవి ఇస్తా అని ఆలోచన వచ్చిందే తడవు మత్తిచ్చే తీగ వెతకడానికి ఆలోచించకుండా ఒక పొదలోకి వెళ్ళాడు, అంతకుముందే అక్కడ ఆహారంకోసం పాగా వేసిన పులిని గమనించలేదు. అది ఒక్కసారిగా మీద పడేసరికి భయంతో కేకలు వేసాడు ఆ అరుపులువిని మెలుకువ వచ్చిన శ్యామ్ కి స్నేహితుడు ఆపదలో వున్నాడని అర్థమై రక్షణకై వారుతెచ్చుకున్న కత్తిని తీసుకొని పరుగున వెళ్లి ఒక్క ఉదుటున పులిపై దాడిచేసాడు అనుకోని దాడికి కంగారుపడి గాయాలపాలైన పులి గోపిని వదిలి అక్కడనుండి పారిపోయింది.
తనను రక్షించడానికి ప్రాణాన్ని కూడా లెక్క చేయని స్నేహితుణ్ని చూసి గోపి గర్వపడ్డాడు. తాను చేసిన చెడ్డ ఆలోచనకు తానే సిగ్గుపడి తలదించుకున్నాడు.. ఇకపై ఎప్పుడూ స్నేహితునికి ద్రోహం చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
మొక్కలతో ఊరుచేరిన మిత్రులిద్దరినీ ఊరివారు సత్కరించారు, పరి పరి విధాలుగా పొగిడారు ...
మిత్రులిద్దరి మనస్సు వారి తల్లి దండ్రుల మనస్సు ఆనందంతో నిండిపోయింది.
అప్పుడు గ్రామపెద్ద మీలో ఎవరిని గ్రామాధికారి గా నిర్ణయించాలి అన్నాడు అప్పుడు ఇద్దరూ ఒకరిపేరు ఒకరు చెప్పారు అప్పుడు గ్రామపెద్ద మీలో ఒకరికి గ్రామాధికారి హెూదాను ఒకరికి కొంత ఊరి మాగాణిని ఇస్తాను అన్నాడు.
అప్పుడు యిద్దరూ ఒక్కసారిగా మాయిద్దరికీ పదవివద్దు మేము దానికి అర్హులం కాదు ! మీరిచ్చే భూమిని సరిసగం చేసుకొని కలసి మెలసి ఉంటాం అన్నారు.
వారి ఆలోచనకు ముగ్ధులైన ఊరి ప్రజలు మరికొంత భూమిని వారికిచ్చి వారి పై అభిమానం చాటుకున్నారు.
కథ యొక్క నీతి: స్నేహం లో స్వార్థం ఉండదు,స్వార్థం వున్నవాడు స్నేహానికి అర్హుడుకాదు.