వీరయ్య వీలునామా



వేమవరంలో వీరయ్య అనే రైతు స్వయంశక్తితో ఆరెకరాల మాగాణీ సంపాదించుకున్నాడు. వీరయ్య కొడుకు రామచంద్రానికీ, కూతురు లక్ష్మీదేవికీ పెళ్లిళ్లు ఐపోయాయి. పండుగలకు పబ్బాలకూ అత్తమామలు కూతురికీ కొత్త బట్టలవీ పెడుతుండటం, రామచంద్రం భార్య కాంతామణికీ ఇష్టముండేది కాదు. ‘చూస్తూ కూర్చుంటే రేపు మనకు కలుగబోయే సంతానానికి ఏమీ మిగలదు. ఏదో వంకతో మీరూ మీ నాన్న దగ్గరనుండి కొద్దో గొప్పో వసూలు చేసుకోవడం మంచిది,’ అంటూ భర్తకు సలహా ఇచ్చింది.

రామచంద్రం తాను చేసే పొగాకు వ్యాపారంలో పెట్టుబడికనో, నష్టం వచ్చిందనో, అప్పులు తీర్చాలనో సాకులు చెబుతూ తండ్రి దగ్గరనుండి పెద్ద మొత్తాలనే తీసుకుపోతూండేవాడు. పొలం తాకట్టు పెట్టో, కొంత అమ్మేసో సొమ్ము తెచ్చి కొడుక్కి ఇస్తూండేవాడు వీరయ్య. ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా లెక్కలు రాసేవాడు. ఓసారి ఆ లెక్కలు చూసుకుంటే, ఆస్తిలో సగం కొడుకు అవసరాలకే ఖర్చు ఐపోయినట్లు తేలింది.

ఓ రోజు రాత్రి వీరయ్య పొలం నుండి తిరిగి వస్తూంటే పాము కరిచి అక్కడికక్కడే మరణించాడు. పెద్ద కర్మ పూర్తయ్యాక పెద్దల సమక్షంలో తండ్రి వీలునామాను బైటకు తీయించారు రామచంద్రం, అతని భార్యాను. అందులో ఇలా ఉంది. ‘ఆస్తంతా నా స్వార్జితం.. అందులో సగం నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలివున్న పొలాన్ని నా భార్య రాజలక్ష్మికి, నా కూతురు లక్ష్మీదేవికి సమానంగా ఇస్తున్నాను. ఇంటిని నా భార్యకు. నా కుమారుడు రామచంద్రం వ్యాపారం నిమిత్తం నా దగ్గరనుండి తీసుకున్న సొమ్మంతా అతనికీ.. మనస్పూర్తిగా రాసి ఇస్తున్నాను.’

అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కాంతామణి, వీరయ్య అత్యంత తెలివిగా వీలునామా రాసి తమకు బుద్ది చెప్పడంతో లబోదిబోమంది.

కథ యొక్క నీతి: అతిగా ఆశలు పెట్టుకోకూడదు; గుణవంతులైన మనస్తత్వంతో ఉన్నవారిని మోసం చేసే ప్రయత్నం చేసే వారికి తగిన బుద్ధి వర్తిస్తుంది.

Responsive Footer with Logo and Social Media