విలువైన కానుక
ఒక చిన్న పల్లెటూరులో వినయ్, విశాల్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి బడికి వెళ్ళేవారు. వినయ్ ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు, విశాల్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు. వినయ్ ఖరీదైన బట్టలు వేసుకొనేవాడు, ఖరీదైన తిండి తినేవాడు. విశాల్ మధ్యాహ్నం ఒక్కోసారి భోజనం చేయలేకపోయేవాడు.
బడిలో ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేశారు. ఆ రోజు మీకు తోచినవి కానుకలుగా తెచ్చుకొని ఒకరికొకరు పంచుకొని గౌరవించుకోవాలని ఒక నియమం పెట్టారు. విద్యార్థులందరికీ అదొక సరదాగా తోచింది. ఆ రోజు కోసం ఎదురు చూశారు, ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. బడిలో ప్రార్థన ముగిసిన తర్వాత అందరూ వరుసగా నిలబడ్డారు. ఇక మిగిలింది ఒకరికొకరు కానుకలు పంచుకోవడం. వినయ్ పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాడు. అవి చాలా ఖరీదైనవి. కొందరు మిఠాయిలు, మరికొందరు బిస్కట్లు... ఇలా ఎవరికి తోచినవి వారు తెచ్చుకున్నారు.
విశాల్ మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు. ఉపాధ్యాయుడు పిలిచి "నువ్వేమీ తీసుకురాలేదా?" అని అడిగాడు. "తెచ్చాను సార్, మా నాన్న తీసుకొచ్చాడు" అన్నాడు. అంతలోపే విశాల్ తండ్రి ఒక సంచి తెచ్చి అక్కడ పెట్టాడు. ఆ కుర్రాడు చాలా పేదవాడు కాబట్టి సంచిలో ఏమి తెచ్చాడో అని అందరూ ఆసక్తిగా చూశారు. అందులో నుండి మొక్కలు బయటికి తీశాడు విశాల్ తండ్రి. అందరూ ఆశ్చర్యపోయారు. “మేము పేదవాళ్లం, ఇవి తప్ప వేరే కానుకలు ఇచ్చుకోలేం.
ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటాలని నా కోరిక" అని విశాల్ అనగానే ఉపాధ్యాయులందరూ చప్పట్లు చరిచారు. "నువ్వు తెచ్చింది మామూలు కానుక కాదు, చాలా విలువైనది. భావితరాలకు పనికి వచ్చే చక్కటి కానుక" అంటూ విశాల్ని దగ్గరకు చేరదీసి ఆరోజు బహుమతికి ఎంపిక చేశారు. ఆ అబ్బాయి చాలా ఆనందపడ్డాడు. జీవితం ఖరీదైనదై ఉండటం ఒక్కటే సరిపోదు. మనసు గొప్పదై ఉండాలని గ్రహించారు.
కథ యొక్క నీతి: కానుకలలో గొప్పది ఖరీదైనది కాదు, హృదయాన్ని తాకేది.