వ్యాపారవేత్త – సేవకుడు



రాజ సేవకుని, వ్యాపారవేత్త అందరిలో చాలా అవమానించాడు. ఆత్మ గౌరవం కలిగిన ఆ రాజు సేవకుడు చాలా బాధపడ్డాడు. ఆ రోజంతా నిద్రపోకుండా తనకు జరిగిన అవమానాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు.

రాజు సేవకుడు, "నేనే కనుక రాజు అయి ఉంటే, ఇప్పటికి ఆ వ్యాపారవేత్తని శిక్షించి ఉండేవాడిని. కానీ, నేనేమి చేయగలను? నేనొక సామాన్య వ్యక్తిని, ఎలాంటి అధికారం లేనటువంటి ఒక సేవకుడిని," అని తనలో తానే కుమిలిపోతూ మరుసటి రోజు కూడా రాజసభకి సేవ చేయడానికి వెళ్ళలేడు.

ఎదో ఒకటి చేయాలని, తనను అంతలా అవమానించిన ఆ వ్యాపారవేత్తకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని, నిద్రపోకుండా బాగా ఆలోచించాడు. అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారి ఆస్థానానికి వెళ్లి, రాజుగారి గదిని శుభ్రం చేయడానికి లోపల వెళ్లాడు. రాజుగారు మెలకువగా ఉన్నప్పుడు సేవకుడు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు: "ఆ వ్యాపారవేత్త రాణిగారితో అలా అసభ్యంగా ప్రవర్తించాల్సింది కాదు. సేవకుడిని అయినా నేను ఏమి చేయలేకపోతున్నాను. పాపం, రాణి గారు ఎంత బాధపడ్డారో!" అని రాజుగారికి వినబడేలా గొణిగాడు (తనలో తానే మెల్లగా మాట్లాడుకోవడం). అది విన్న రాజు, వెంటనే కోపంతో లేచి, సేవకుడితో "ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అన్నది నిజమా?" అని గట్టిగా ప్రశ్నించాడు. అందుకు సేవకుడు రాజుగారి కాళ్లు పట్టుకుని, "క్షమించండి ప్రభు, నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే, రెండురోజుల నుండి సరిగ్గా నిద్రపోకపోవడంతో, నాకే తెలియడం లేదు," అని కాళ్ళు పట్టుకున్నాడు.

అదివిన్న రాజు, సేవకుడిని వదిలేశాడు. కానీ, తన మనసులో సేవకుడు అన్న మాటలు మెదులుతూనే ఉన్నాయి. వెంటనే వెళ్లి రాణిని అడగలేని పరిస్థితి, ఒకవేళ అది అబద్ధమైతే రాణి తనను అపార్థం చేసుకుంటుంది అని ఆలోచించాడు.

ఆరోజు నుండి రాజు వ్యాపారవేత్తతో ఉన్న వ్యాపార సంబంధాన్ని వదిలేశాడు. అర్ధాంతరంగా రాజు అలా ప్రవర్తించడానికి కారణం ఏం జరుగుతుందో వ్యాపారవేత్తకు ఏమి అర్థం కాలేదు. ఆ విషయం గురించి అడగడానికి వ్యాపారవేత్త రాజుగారి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసాడు. వెంటనే రాజు, తన భటులతో వ్యాపారవేత్తను లోనికి రానివ్వొద్దని ఆజ్ఞాపించాడు.

అక్కడే ఉండి అన్ని చూస్తున్న రాజ సేవకుడు భటులతో, "ఓ భటులారా! మీరు ఆపుతారు ఎవరినీ? రాజుతో సంభందం ఉన్న ఒక గొప్ప వ్యాపారవేత్తను. అతను తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలడు. నన్ను అందరిలో అవమానించినట్టుగా మిమ్మల్ని కూడా అవమానించగలడు. లేకుంటే కఠినమైన శిక్ష కూడా వేయగలడు," అని అన్నాడు. అది విన్న వ్యాపారవేత్తకు అంతా అర్థమైంది. రాజుగారు తన పట్ల ఇలా ప్రవర్తించడానికి సేవకుడే కారణమని భావించాడు.

మరునాడు సేవకుడిని ఇంటికి పిలిచి, విలువైన బహుమానాలను సమర్పించి, మంచి విందు భోజనం పెట్టాడు. వ్యాపారవేత్త, సేవకుడితో ఆ రోజు జరిగిన దానికి "నేను చింతిస్తున్నాను. నా కూతురి పెళ్లిలో నువ్వు రాజుగారి కోసం మరియు వారి కుటుంబం కోసం ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చున్నావు. అంతలోనే రాజుగారు వచ్చారు. అది చూసిన నాకు చాలా కోపం వచ్చి నిన్న అందరిలో అవమానించాను. అలా చేయడం నా తప్పే, నిజానికి నేను నిన్ను అలా అవమానించాల్సింది కాదు. నన్ను క్షమించు," అన్నాడు.

వ్యాపారవేత్త ఇచ్చిన విలువైన బహుమానాలను చూస్తూ మురిసిపోయిన రాజ సేవకుడు, "మీ మంచి మనస్సు నాకు అర్థమైంది. మనిషి అన్న తరువాత ఎప్పుడైనా ఒక తప్పు చేస్తుంటాడు. చేసిన తప్పును సరిదిద్దుకోవడం మంచితనానికి నిదర్శనం. మీరు మీ మంచితనాన్ని నిరూపించుకున్నారు. మీ పైన రాజుగారి చెడు అభిప్రాయాన్ని నేనే తొలగిస్తాను," అని మాట ఇచ్చి తన ఇంటికి వచ్చేసాడు.

సేవకుడు రెండు రోజుల పాటు రాజుగారి సేవకు వెళ్లలేదు. ఆ తరువాతి రోజు ఉదయాన్నే వెళ్లి రాజుగారు లేవకముందే తన గది శుభ్రం చేయడానికి వెళ్లాడు. రాజుగారు నిద్ర లేస్తున్న సమయాన్ని గమనించి, మళ్లీ తాను గొణగడం ప్రారంభించాడు. "ఏది ఏమైనా, రాజుగారు అలా చేయడం తప్పు. అంతమంది ఉన్న సభలో అందరి ముందు అంత అసహ్యంగా దోసకాయలు తినడం అవసరమా?" అని మళ్లీ, మళ్లీ అదే గొణిగసాగాడు. అది విన్న రాజు గారు కోపంతో సేవకుడిని నిలదీసాడు. "ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అని?" వెంటనే సేవకుడు, "క్షమించండి రాజా, నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, రెండు రోజులుగా నిద్రపోనీ కారణంగా నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. నేను తప్పుగా మాట్లాడి ఉంటే, నన్ను క్షమించండి," అని కాళ్ళు పట్టుకున్నాడు.

అందరూ చూస్తుండగా, రాజుగారు సేవకుడిని వదిలేశాడు. కానీ, బాగా ఆలోచించి, "నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదు" అని గుర్తు చేసుకున్నాడు. వ్యాపారవేత్తతో రాజు రద్దు చేసుకున్న వ్యాపార సంబంధాలను తిరిగి మొదలుపెట్టాడు. రాజు, వ్యాపారిని రాజభవనానికి ఆహ్వానించి, బహుమతులు, ఆభరణాలు, వస్త్రాలతో అతడిని సత్కరించాడు.

రాజుగారు, వ్యాపారవేత్తను గతంలో నియమించిన స్థానానికి తిరిగి నియమించారు. ఆ సేవకుడిని తానూ ప్రస్తుతం చేస్తున్న పని నుండి తప్పించి మరొక పనిలో కుదిర్చాడు.

కథ యొక్క నీతి: రాజుల్ని, ధనవంతుల్ని, పెద్ద పదవిలో ఉన్నవారిని కాదు, ప్రతి ఒక్కరినీ గౌరవించడం నేర్చుకోవాలి. ఎవరి ఆత్మ గౌరవానికైనా ఇబ్బంది కలిగేలా చేస్తే, దాని పర్యవసానం అనుభవించి తీరాల్సిందే. ఇక్కడ అల్పుడిగా భావించిన రాజ సేవకుడు తన తెలివితేటలతో ఆ వ్యాపారవేత్తని దోషిలా నిల్చోబెట్టాడు, తిరిగి యథా స్థానంలో కూర్చోబెట్టాడు. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎవరికి వారే గొప్ప.

Responsive Footer with Logo and Social Media